Ayyappa Swamy Deeksha : అయ్యప్ప భక్తులకు మాల ధారణ అనేది పవిత్రమైన వ్రతం. ఇది ఆత్మశుద్ధి, భక్తి, సంయమనం ద్వారా స్వామిని సమీపించే మార్గం. ఆధ్యాత్మిక దృష్టితో చూస్తే , మాల అనేది మనసు శరీరం ఆత్మల మధ్య బంధం లాంటిది. ఇది వ్రతం ప్రారంభంతో మొదలై దర్శనంతో పరిపూర్ణమవుతుంది. ఇవి సంప్రదాయక నియమాలపై ఆధారపడి ఉన్నాయి కానీ హృదయంలో భక్తి ఉంటే స్వామి అనుగ్రహం మీపై ఎప్పటికీ ఉంటుంది మాల ఎక్కడ వేసుకున్నామో అక్కడే తీయాలా? లేదు..అలాంటి కఠిన నియమం లేదు. మాల వేసుకునేటప్పుడు సాధారణంగా గురుస్వామి సహాయంతో లేదా ఆలయ పూజారి ద్వారా వేసుకుంటారు. సొంతూరు అయ్యప్ప ఆలయంలో లేదా ఇంట్లో కూడా జరగొచ్చు. మాల తీసివేయడం అనేది గురుస్వామి లేదా పూజారి సహాయంతో జరగాలి కానీ అది వేసుకున్న స్థలమే అవ్వాలని ఎక్కడా చెప్పలేదు. ఆధ్యాత్మికంగా మాల అనేది వ్రతానికి సంబంధించిన ప్రతీక, దాని ధారణ-విరమణ స్థలం కన్నా భక్తి ముఖ్యం . ఉదారహరణకు చెప్పాలంటే సొంతూర్లో వేసుకుని యాత్ర ముగిసిన తర్వాత మార్గ మధ్యలో ఏదైనా ఆలయంలో తీయొచ్చు లేదంటే ఇంటికి వచ్చాక గురుస్వామి దగ్గర విరమణ చేయొచ్చు. 

Continues below advertisement

సొంతూర్లో మాసవేసుకుని శబరిమలలో తీయకూడదా? సాధారణంగా శబరిమలలో మాల తీయకూడదు. ఎందుకంటే మాల ధరించి ఉండడమే యాత్రకు అర్హత. దర్శనం చేసుకునేటప్పుడు మాల తప్పనిసరి. వ్రతం ముగిసిన తర్వాత మాల తీయాలి. అందుకే శబరిమలలో కన్నా ఇంటికి తిరిగి వచ్చి ఇంటి ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టి, పూజ చేసి ప్రసాదం పంచిన తర్వాత మాల తీయాలని చెబుతున్నారు ఆధ్యాత్మికవేత్తలు. శబరిమలలో మాల తీసేస్తే వ్రతం అసంపూర్ణం అవుతుందని కొందరు ఆధ్యాత్మిక వేత్తల సందేశం.  

తంత్రి ఉండేది అందుకేనా!

Continues below advertisement

శబరిమల కొండ కింద కన్నెమూల గణపతి ఆలయం పక్కన తంత్రి అనే పూజారి ఉంటారు. శబరిమల కొండపైకి వెళ్లి స్వామిని దర్శనం చేసుకుని వచ్చిన అయ్యప్ప భక్తులు తంత్రి దగ్గర దీక్షా విరమణ చేస్తుంటారు. అయితే కన్నెమూల గణపతి ఆలయ రక్షణ, విఘ్నాల నివారణకు ప్రసిద్ధి. అయ్యప్ప దీక్షా విరమణ ఇక్కడ చేయకూడదనేది ఆధ్యాత్మికవేత్తలు, అత్యధిక భక్తుల అభిప్రాయం. మాల విరమణ నియమాలేంటి?

మాల విరమణ అనేది వ్రతం ముగింపు. ఇది శ్రద్ధతో చేయాలి. దీక్షా విరమణ ఇంటికి వచ్చాకే తీయాలి. వ్రతం 41 రోజులు లేదా అంతకన్నా ఎక్కువ ఉండాలి. గురుస్వామి లేదా ఆలయ పూజారి సహాయంతో తీయాలి లేదంటే తల్లి లేదా కుటుంబ సభ్యుల ముందు స్వయంగా తీయవచ్చు. మంత్రం చదవుతూ దీక్షా విరమణ చేయాలి

"అపూర్వమచాలారోహ దివ్య దర్శనకారణం శాస్త్రుముద్రాత్మకాదేవ దేహి మే వ్రతవిమోచనం". 

విధానం

ఇంటి ద్వారం వద్ద కొబ్బరికాయ కొట్టండి

స్నానం చేసి పూజా మందిరంలో ప్రసాదం ఉంచి నైవేద్యం సమర్పించి హారతి ఇవ్వండి

మాలను పాలలో ముంచి శుభ్రం చేసి , విభూతి చల్లి సురక్షితంగా దాచండి ( దానిని మళ్లీ ఉపయోగించవచ్చు)

ప్రసాదం కుటంబ సభ్యులకు, సన్నిహితులకు పంచండి

కుటుంబంలో మరణం లాంటి సందర్భాల్లో మాత్రమే మాల మధ్యలో తీయొచ్చు

ఆధ్యాత్మికంగా చెప్పాలంటే దీక్షా విరమణ అనేది వ్రతం ఫలితాన్ని స్వీకరించడం..ఇది సంతోషంగా, భక్తితో చేయాలి. మీరు ఏ నియమాలు అనుసరించాలన్నా గురుస్వామి లేదా అయ్యప్ప ఆలయ పూజారిని సంప్రదించండి స్వామియే శరణం అయ్యప్ప

గమనిక: ఇక్కడ అందించిన సమాచారం కేవలం నమ్మకాలపై ఆధారపడి ఉంటుంది. ABPదేశం ఎలాంటి నమ్మకాలను, సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని అమలు చేయడానికి ముందు సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.