Ayodhya Ram Mandir Updates: భారతదేశ చరిత్రలో మరో అద్బుత ఘట్టం ఆవిష్కృతం కానుంది. ఐదు వందల ఏళ్లుగా భారతీయలు ఎదురుచూస్తున్న అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం సోమవారం జరుగనుంది. ఈ మేరకు  ప్రారంభోత్సవానికి అయోధ్య పూర్తిగా సిద్ధమైంది. జగభిరాముడిని కొలువు తీర్చేందుకు అయోధ్య ముస్తాబైంది. ఆలయ సముదాయం, అయోధ్యా నగరంలో రామనామస్మరణలతో మర్మోగుతోంది. ఆలయంలో ప్రతి మూల,  దీపాలు, పూలతో అలంకరించబడ్డాయి. 


ప్రాణప్రతిష్ట వేడుకలను చూసేందుకు వేలాదిగా రామభక్తులు, ప్రముఖులు అయోధ్యకు చేరుకుంటున్నారు. ఈ సందర్భంగా  ఓ ప్రత్యేకమైన సువాసనతో ఆలయం వారికి స్వాగతం పలుకనుంది. ప్రపంచ నలుమూలల నుంచి వచ్చే భక్తులను ఆకట్టుకునేలా, అయోధ్యలో సువాసనలు వెదజల్లేలా బరేలీకి చెందిన ఓ వ్యాపారి ప్రత్యేకంగా పరిమళాలను (పెర్ఫ్యూమ్‌)ను తయారు చేశారు.   


బరేలికి చెందిన వ్యాపారవేత్త గౌరవ్ మిట్టల్ ఈ ప్రత్యేక పరిమళాలను తయారు చేయించారు. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముందు ప్రత్యేక పరిమళ ద్రవ్యాలను అయోధ్య, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌కు కూడా అందించామని చెప్పారు. అలాగే అయోధ్యకు వచ్చే ప్రముఖులకు అందించేలా సుగంధ ద్రవ్యాల సీసాలు, ధూపద్రవ్యాలను ప్రత్యేకంగా పంపారట.  బరేలీ నుంచి మొత్తం 5,000 పెర్ఫ్యూమ్ బాటిళ్లు, 7,000 కుంకుమపువ్వు అగరుబత్తీలను ఆయన పంపించారు.  


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ ఆలయ ప్రారంభోత్సవానికి ప్రత్యేకమైన పరిమళాన్ని సృష్టించమని నన్ను అడిగారు. ఇందుకోసం కస్తూరి పరిమళం, కుంకుమ ధూపం తయారు చేశాను. రాముడు జన్మించినప్పుడు, దశరథుడు అయోధ్య అంతటా చందనం, కస్తూరిని చల్లారని రామచరితమానస్‌లో ప్రస్తావించారు. నేను కూడా అదే మూలకాలను ఉపయోగించి సహజమైన సువాసనను సృష్టించాను’ అని మిట్టల్ చెప్పారు. పెర్ఫ్యూమ్‌ను రూపొందించడానికి మిట్టల్ ఒక ప్రత్యేక బృందాన్ని నియమించారు. దాదాపు 10 రోజుల పాటు శ్రమించి ఆ బృందం ప్రత్యేకమైన పెర్ఫ్యూమ్‌ను తయారు చేశారు. 


అయోధ్యలో రామమందిర మహోత్సవం నేడు అంగరంగ వైభవంగా జరగనుంది. వివిధ రంగాలకు చెందిన 7,000 మందికి పైగా అతిథులు,  విదేశీ ప్రముఖులు అయోధ్యకు చేరుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హజరుకానున్నారు. దేశ వ్యాప్తంగా ప్రజలు రాముడి జీవితం, ఆలయ ప్రాణ ప్రతిష్టను జరుపుకునేలా వివిధ ప్రాంతాలలో ఉత్సవాలు జరుగుతున్నాయి.