Ardhanarishwara Temple Kondapur: ప్రతి నెలలో పండుగ సందడి ఉంటుంది..కానీ..కార్తీకమాసం మొత్తం పర్వదినాలే. నిత్యం వేకువజామునే నిద్రలేచి దీపారాధనతో మొదలయ్యే రోజు సూర్యాస్తమయం తర్వాత దీపారాధన చేసి ఉపవాస విరమణతో ముగుస్తుంది. ఆరోగ్యం సహకరించేవారు నెలరోజులూ కార్తీకమాస నియమాలు పాటిస్తారు. ఆరోగ్యం సహకరించనివారు కార్తీకసోమవారాలు ఉపవాసం ఆచరిస్తారు. అయితే ఈ నెలరోజులు వేకువజామున స్నానం, దీపారాధన చేయలేనివారు..ఉపవాస నియమాలు పాటించలేనివారు ఆలయాలను సందర్శిస్తారు. శక్తికొలది దాన ధర్మాలు చేస్తారు. స్వామివారి సన్నిధిలో కూర్చుని శ్లోకాలు చదువుకుంటారు. భక్తిశ్రద్ధలతో భగవంతుడికి నమస్కరిస్తారు. అందుకే కార్తీకం నెలరోజులూ ఆలయాలు కళకళలాడుతుంటాయ్. శివాలయాల్లో కార్తీకమాసం సందడి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వేకువజామునే ఆలయం చుట్టూ ఉండే దీపాలు చూస్తుంటే ఆకాశంతో నక్షత్రాలన్నీ ఇక్కడే ఉన్నాయా అనిపిస్తుంది. ఎవరికి సమీపంలో ఉండే ఆలయాలకు వారు వెళ్లి దీపారధన, ప్రత్యేకపూజలు చేస్తారు. దర్శనం చేసుకుని వస్తారు. అయితే ఎంతదూరంలో ఉన్నా సందర్శించాల్సిన కొన్ని ఆలయాలుంటాయ్. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉండేవారు తప్పనిసరిగా దర్శించుకోవాల్సిన ప్రదేశం అర్థనారీశ్వర ఆలయం.
హైదరాబాద్ హైటెక్ సిటీ, కొత్తగూడకి చేరువలో కొండాపూర్ లో ఉంది అందమైన అర్థనారీశ్వర ఆలయం. శివపార్వతుల సమ్మేళనరూపంగా భక్తులు ఆరాధిస్తారు. తెలంగాణలో ఏకైక అర్థనారీశ్వర ఆలయంగా పేరుగాంచింది. ఈ ఆలయం నగరం మధ్యలో ఉన్నప్పటికీ లోపలకు అడుగుపెట్టగానే ప్రశాంతంగా అనిపిస్తుంది.
ఈ ఆలయం 2022 ఫిబ్రవరి 11న మధులత - మహిపాల్ యాదవ్ నిర్మించారు. మహాబలిపురం (తమిళనాడు) నుంచి బ్లాక్ గ్రానైట్ విగ్రహం తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు. ఆలయం పూర్తిగా నల్ల రాతితో నిర్మించిఉండడం విశేషం. గర్భగుడిలో అర్థనారీశ్వర విగ్రహం 5 అడుగుల ఎత్తులో దర్శనమిస్తుంది. ఇక్కడ పెద్దమ్మ తల్లి, రేణుక ఎల్లమ్మ, నాగ దేవతలు, కాత్యాయని, స్కందమాత, కుష్మాండ శక్తి స్వరూపిణిని కూడా దర్శించుకోవచ్చు. ఉదయం 6:00 నుంచి 12:30 వరకు, సాయంత్రం 5:30 నుంచి 8:30 వరకు భక్తులకు అనుమతి ఉంటుంది. కార్తీకమాసం, మహా శివరాత్రి పర్వదినాల్లో సమయాల్లో స్వల్పంగా మార్పులుంటాయి.ఇక్కడ నిత్యం సాంప్రదాయ పూజలు, అభిషేకాలు జరుగుతాయి. గోడలపై ఆర్ట్ వర్క్ భక్తులను ఆకట్టుకుంటుంది.
( ఆలయంలో దర్శనం తర్వాత కాసేపు కూర్చుని ఈ స్తోత్రం పఠించండి)
అర్ధ నారీశ్వర స్తోత్రం
చాంపేయగౌరార్ధశరీరకాయైకర్పూరగౌరార్ధశరీరకాయ ।ధమ్మిల్లకాయై చ జటాధరాయనమః శివాయై చ నమః శివాయ ॥
కస్తూరికాకుంకుమచర్చితాయైచితారజఃపుంజ విచర్చితాయ ।కృతస్మరాయై వికృతస్మరాయనమః శివాయై చ నమః శివాయ ॥
ఝణత్క్వణత్కంకణనూపురాయైపాదాబ్జరాజత్ఫణినూపురాయ ।హేమాంగదాయై భుజగాంగదాయనమః శివాయై చ నమః శివాయ ॥
విశాలనీలోత్పలలోచనాయైవికాసిపంకేరుహలోచనాయ ।సమేక్షణాయై విషమేక్షణాయనమః శివాయై చ నమః శివాయ ॥
మందారమాలాకలితాలకాయైకపాలమాలాంకితకంధరాయ ।దివ్యాంబరాయై చ దిగంబరాయనమః శివాయై చ నమః శివాయ ॥
అంభోధరశ్యామలకుంతలాయైతటిత్ప్రభాతామ్రజటాధరాయ ।నిరీశ్వరాయై నిఖిలేశ్వరాయనమః శివాయై చ నమః శివాయ ॥
ప్రపంచసృష్ట్యున్ముఖలాస్యకాయైసమస్తసంహారకతాండవాయ ।జగజ్జనన్యై జగదేకపిత్రేనమః శివాయై చ నమః శివాయ ॥
ప్రదీప్తరత్నోజ్జ్వలకుండలాయైస్ఫురన్మహాపన్నగభూషణాయ ।శివాన్వితాయై చ శివాన్వితాయనమః శివాయై చ నమః శివాయ ॥
ఏతత్పఠేదష్టకమిష్టదం యోభక్త్యా స మాన్యో భువి దీర్ఘజీవీ ।ప్రాప్నోతి సౌభాగ్యమనంతకాలంభూయాత్సదా తస్య సమస్తసిద్ధిః ॥