హాదేవుడు శివుడి కంటి నుంచి రాలిన నీటి చుక్క నేల మీద పడి రుద్రాక్షగా మారిందని పురాణాలు చెబుతున్నాయి. రుద్రాక్ష ధరించిన వారికి శివుడి అనుగ్రహం ఉంటుందని నమ్మకం. రుద్రాక్ష ధరించడం వల్ల అనారోగ్యాలు దరిచేరవని సైన్స్ కూడా అంగీకరిస్తుంది. రుద్రాక్షలు రకరకాల రూపాల్లో లభిస్తాయి. ప్రతి రుద్రాక్ష ప్రత్యేక ప్రయోజనాలను కూడా అందిస్తుందట. ఏ రాశి వారు ఏ రకమైన రుద్రాక్ష ధరించాలో ఇక్కడ తెలుసుకుందాం.


జ్యోతిషం ప్రకారం ప్రతి రాశి ఒక ప్రత్యేక లక్షణాన్ని కలిగి ఉంటుంది. కనుక రాశిని అనుసరించి రుద్రాక్షను ఎంచుకోవడం వల్ల మరిన్ని ప్రయోజనాలను పొందవచ్చు.


మేష వృశ్చిక రాశులు


మేష, వృశ్చిక రాశులకు అంగారకుడు అధిపతి. వీరు త్రిముఖ రుద్రాక్ష ధరించడం మంచిది. ఈ రుద్రాక్ష బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు ప్రతీక. మేష, వృశ్చిక రాశుల వారు త్రిముఖ రుద్రాక్ష ధరించడం వల్ల అశాంతి తగ్గి వ్యక్తిత్వం వృద్ధి చెందుతుంది.


వృషభ తులా రాశులు


ఈ రాశులకు శుక్రుడు అధిపతి. వీరు షట్ముఖి రుద్రాక్ష ధరించాలి. షట్ముఖి రుద్రాక్ష తెలివి తేటలు, జ్ఞానం పెరిగేందుకు దోహదం చేస్తుంది. జీవితం ఆనందంగా సాగేందుకు తోడ్పడుతుంది.


మిథున కన్యా రాశులు


చతుర్ముఖి రుద్రాక్షను మిథున, కన్యారాశులకు చెందిన వారు ధరిస్తే మంచి ప్రయోజనాలుంటాయి. ఈ రాశుల వారు రుద్రాక్ష ధరించడం వల్ల విద్యలో విజయం సాధిస్తారు. మానసిక రుగ్మతలు కూడా నయమవుతాయట.


కర్కాటక రాశి


కర్కాటక రాశి వారు ద్విముఖి రుద్రాక్ష ధరించాలి. ఇది ధరిస్తే ఏకాగ్రత పెరుగుతుంది. ద్విముఖి రుద్రాక్ష వల్ల జాతకంలో చంద్రుడు బలపడతాడు. నిర్ణయ సామర్థ్యం పెరుగుతుంది.


సింహరాశి


ద్వాదశ ముఖి రుద్రాక్ష సింహరాశి వారు ధరిస్తే మేలు జరుగుతుంది. వీరికి రుద్రాక్షతో అదృష్టం కలిసివస్తుంది. సంపద చేరుతుంది. వీరిలో నాయకత్వ లక్షణాలు పెంపొందిస్తుంది.


ధనస్సు, మీనరాశి


ధనస్సు, మీన రాశుల వారు పంచముఖి రుద్రాక్ష ధరిస్తే గౌరవం పెరుగుతుంది. అదృష్టం కలిసి రావడం లేదని భావించినపుడు ఈ రుద్రాక్ష ధరిస్తే మంచి ఫలితాలు ఉంటాయి. అనారోగ్యాలు తొలగి ఆరోగ్యం కుదుట పడుతుంది.


మకర కుంభ రాశులు


సప్తముఖి రుద్రాక్ష మకర, కుంభ రాశుల వారు ధరించాలి. వీరికి ఈ రుద్రాక్ష ధరించడం వల్ల డబ్బు సమస్యలు తొలగిపోతాయి. కొత్త ఆదాయ వనరులు సమకూరుతాయి.


కొన్ని రుద్రాక్ష నియమాలు



  • సోమవారం రుద్రాక్ష ధరించడం ప్రారంభించేందుకు మంచి రోజు. ప్రతి నెల మాసశివరాత్రి కూడా మంచిదే.

  • ఆవుపాలు, గంగాజలంతో శుద్ధి చేసిన తర్వాత రుద్రాక్ష దరించాలి.

  • స్నానం, ధ్యానం, శివపూజ తర్వాత రుద్రాక్ష ధరించాలి. మెడలో రుద్రాక్ష ధరించాలని అనుకుంటే పసుపు దారంతో ధరించడం మేలు చేస్తుంది.

  • రుద్రాక్ష ధరించిన వారు మాంసాహారం తీసుకోవద్దు

  • రుద్రాక్ష ఓం నమ: శివాయ అనే మంత్రాన్ని జపిస్తూ దరించాలి.





Also Read: కలలో దెయ్యాలు కనిపించడం దేనికి సంకేతం? ఏం జరుగుతుంది?


Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. వివిధ శాస్త్రాలు, గ్రంథాలు, పండితులు పేర్కొన్న కొన్ని ఆధ్యాత్మిక అంశాలు, పరిష్కారాలను ఇక్కడ యథావిధిగా అందించాం. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు.. ‘ఏబీపీ దేశం’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు పండితులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.