తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఆషాఢ బోనాల జాతర గురువారం గోల్కొండ కోటలో అత్యంత వైభవంగా ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ లంగర్ హౌస్ చౌరస్తా వద్ద శ్రీ జగదాంబ మహంకాళి అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించి ఉత్సవాలను లాంఛనంగా ప్రారంభించారు. ఈ వేడుకతో నెలరోజుల పాటు సాగే బోనాల పండుగకు అంకురార్పణ జరిగింది.ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారు వి. హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు.