టీమిండియా 2023లో రెండు భారీ టోర్నీలు జస్ట్ ఫైనల్లో ఓడిపోయింది. ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్. లార్డ్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ పాలిట కొరకరాని కొయ్యగా మారి ఆసీస్ ను గెలిపించింది ట్రావియెస్ హెడ్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో హెడ్ బాదిన 163పరుగులు ఆసీస్ కు ఊహించని స్థాయిలో ఆధిక్యం ఇవ్వటంతో పాటు..భారత్ ను ఓడించి ఆస్ట్రేలియానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకోవటంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గానూ నిలిచాడు. తిరిగి నవంబర్ లో వన్డే వరల్డ్ కప్. మళ్లీ ఫైనల్లో భారత్ కు ఎదురుపడింది ఆస్ట్రేలియా. చచ్చీ చెడీ భారత్ 240పరుగులు చేస్తే..మళ్లీ హెడ్డే మనకు హెడేక్ తెప్పించాడు. ఓపెనర్ గా వచ్చి వరల్డ్ కప్ ఫైనల్లో 137పరుగులు చేయటంతో ఆస్ట్రేలియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ మన చేతుల్లో నుంచి లాక్కెళ్లిపోయింది. మళ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచే ట్రావియెస్ హెడ్డే. ఇప్పుడు అలాంటోడు మూడోసారి భారీ టోర్నీలో ఫైనల్ ఆడుతున్నాడు. కాకపోతో ఆడుతోంది ఈ సారి మన తెలుగు టీమ్ తరపున. పై రెండు టోర్నీలను ఏ కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో హెడ్ ఇరగదీశాడో ఇప్పుడు అదే కెప్టెన్ ప్యాట్ కమిన్స్ నేతృత్వంలో సన్ రైజర్స్ ను ఫైనల్ కి చేర్చాడు ట్రావియెస్ హెడ్. హెడ్ మాస్టర్ అనే నిక్ నేమ్ తో ఓపెనర్ గా పవర్ ప్లేల్లో ఇరగదీస్తూ ఆరెంజ్ ఆర్మీ విజయాల్లో మెయిన్ పిల్లర్ గా మారాడు. 14 మ్యాచుల్లో 567 పరుగులు చేసిన హెడ్..అభిషేక్ శర్మ తోడుగా చేస్తున్న విధ్వంసమే సన్ రైజర్స్ కి భారీ విజయాలను సాధించి పెట్టింది. నాలుగు హాఫ్ సెంచరీలు ఓ సెంచరీతో మంచి ఊపు మీదున్న హెడ్ మరొక్కసారి తనకు అచ్చొచ్చే ఫైనల్ లో చెలరేగిపోయి లెక్కలు మారిస్తే చాలు కోల్ కతా బౌలర్ల మక్కెలు ఇరగటం ఖాయం అనే ఎక్స్పెక్టేషన్స్ తో ఉన్నారు సన్ రైజర్స్ ఫ్యాన్స్.