Mylavaram MLA Vasanta Krishna Prasad: సార్వత్రిక ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయం రసవత్తరంగా మారుతోంది. అధికారపార్టీ వైకాపా( YCP) ఏకంగా ఎమ్మెల్యేల బదిలీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడంతో...ఎవరి సీటు ఎటుమారుతుందో తెలియని పరిస్థితి. అసలు సీటు ఉంటుందో లేదో కూడా గ్యారెంటీ లేదు. ఎన్నికల వేళ జోష్‌గా ఉండాల్సిన కార్యకర్తలు సైతం...తమ నేత తమ వద్దే ఉంటాడో లేదోనన్న బెంగ పట్టుకుంది. అటు ఎమ్మెల్యేలు సైతం హామీ ఇవ్వలేకపోతున్నారు. ముఖ్యంగా ఉమ్మడి కృష్ణా జిల్లాలో వైకాపా ఎమ్మెల్యేలకు సీటు పై భరోసా దక్కడం లేదు. వర్గపోరు సమిసిపోయిన నియోజకవర్గాల్లోనూ సీఎం జగన్‍ (Jagan) ‍ఎలాంటి గ్యారెంటీ ఇవ్వకపోవడంతో నేతలు తమదారి తాము చూసుకునే పనిలోపడ్డారు.


తెలుగుదేశం వైపు వసంత చూపు
ఉమ్మడి కృష్ణా జిల్లాలో కీలకమైన మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ ‍(Vasantha Krishna Prasad)తిరిగి తెలుగుదేశం గూటికి చేరతారని ఎప్పటి నుంచో ప్రచారం సాగుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆయన పదేపదే చేస్తున్న వ్యాఖ్యలు అందుకు బలం చేకూరుస్తున్నాయి. తాజాగా మళ్లీ అలాంటి ప్రకటనే చేశారు ఆయన. మైలవరంలో పోటీపై తానేమీ చెప్పలేనన్న ఎమ్మెల్యే....ఈ విషయంలో సీఎం జగన్ స్పష్టతనిస్తారన్నారు. మైలవరంలో తాను పోటీ చేస్తానా లేదా అన్న విషయంపై ఫిబ్రవరి 4, 5 తేదీల్లో ప్రెస్‌మీట్‌ పెట్టి వెల్లడిస్తానన్నారు. అదేరోజు తన మనసులో మాట చెబుతానని ప్రకటించడం విశేషం. సంక్షేమ పథకాల సంగతి ఎలా ఉన్నా...ప్రజలు అభివృద్ధిని కూడా కోరుకుంటున్నారన్నారు. నిధులు లేక ఎక్కడికక్కడ పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తినగా తినగా పంచదార చేదు అన్నట్లు.. సంక్షేమ పథకాలకు ప్రతి ఒక్కరి హక్కు అయ్యాయన్నారు. పథకాలు కాదు.. అభివృద్ధి కావాలని ప్రజలు కోరుకుంటున్నారన్నారు. ఆయన మాటలు చూస్తుంటే ఈసారి ఖచ్చితంగా ఏదో బాంబు పేల్చనున్నారని తెలుస్తోంది.


వివాదం ముగిసినా వీడని చిక్కుముడులు
జగన్‌కు అత్యంత నమ్మినబంటుగా వసంత కృష్ణప్రసాద్‌ మెలిగారు. కొన్ని వ్యాపారాల్లోనూ ఇరువురికి భాగస్వామ్యం ఉందని సమాచారం. అలాంటి వసంత కృష్ణప్రసాద్ కు కూడా టిక్కెట్ కన్ఫార్మ్ చేయడంలో జగన్ జాప్యం చేయడానికి కారణాలేంటో తెలియడం లేదు. ఇంతకు ముందు అంటే మంత్రి జోగిరమేశ్‌‍( Jogi Ramesh ) తో మైలవరం సీటుపై వివాదం ఉందనుకుందాం. ఇప్పుడు జోగిరమేశ్ ను పెనమలూరు ఇంఛార్జిగా నియమించడంతో మైలవరం వివాదానికి ముగింపు పలికినట్లేనని అందరూ భావించారు. కానీ ఇప్పటికీ మైలవరం( Mylavaram) వ్యవహారాన్ని జగన్ తేల్చకపోవడం వసంత కృష్ణప్రసాద్ కు మింగుడుపడని అంశం. ఇక వైకాపా అధిష్టానంతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసమన్నమైందని గ్రహించిన ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్...ఫిబ్రవరి 5న మీడియా సమావేశం ఏర్పాటు చేసి భవిష్యత్ కార్యాచరణను ప్రకటించనున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఆయన తెలుగుదేశం‍(TDP)  నేతలతో టచ్ లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే అక్కడా సీనియర్ నేత, మాజీమంత్రి దేవినేని ఉమ( Devineni Uma) ఉండటం, వీరిరువురికీ మొదటి నుంచీ పొసగకపోవడంతోనే కొంచెం ఆచీతూచీ వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే వసంత కృష్ణప్రసాద్ తెలుగుదేశంలో చేరినా....ఇప్పటికిప్పుడు మైలవరం టిక్కెట్ ఆయనకు ఇస్తారా లేదా అన్నది అనుమానమే. ఆ టిక్కెట్ పై ఇప్పటికే దేవినేని ఉమ ఖర్చీప్ వేసి ఉన్నారు. ఆయన్ను కాదని వసంతకు ఏమేరకు సర్దుబాటు చేస్తారో వేచిచూడాల్సిందే.


వసంత వస్తే సర్దుబాటు ఎలా..?


మైలవరం టిక్కెట్ కాకుంటే ఆ నియోజకవర్గానికే ఆనుకుని ఉన్న నూజివీడు టిక్కెట్ వసంత కృష్ణప్రసాద్ ఆశించి ఉండొచ్చు. అయితే ఈ టిక్కెట్ వైకాపా నుంచి తెలుగుదేశంలోకి రానున్న మరో కీలక నేత పార్థసారధి కోసం రిజర్వ్ చేసినట్లు తెలుస్తోంది. ఆయన సామాజికవర్గం ఓట్లు ఈ నియోజకవర్గంలో అధికంగా ఉండటంతో తెలుగుదేశం ఆయన్ను నూజివీడు నుంచి బరిలో దింపే అవకాశాలు ఉన్నాయి. విజయవాడ పార్లమెంట్ సీటు ఖాళీ అయ్యిందనుకున్నా....ఈ సీటు కోసం ఏడాదిన్నరగా కేశినేని చిన్ని ఎదురుచూస్తున్నారు. అధిష్టానం ఆయనకు టిక్కెట్ కన్ఫార్మ్ చేయడం వల్లే ప్రస్తుత ఎంపీ కేశినేని నాని బయటకు వెళ్లిపోయారు. విజయవాడ పార్లమెంట్ పరిధిలో దాదాపు అన్ని సీట్లు ఇప్పటికే నిండిపోయాయి. వైకాపా నుంచి వచ్చే వారికి ఎక్కడ, ఎలా సర్దుబాటు చేయాలో కూడా తెలుగుదేశం అధిష్టానానికి అర్థం కావడం లేదు. అటు కృష్ణప్రసాద్ మాటలు చూస్తుంటే....జగన్ ను అంత వ్యతిరేకిస్తున్నట్లు కూడా ఏమీ అనిపించడం లేదు. పోనీ మైలవరం నుంచి వైకాపా తరఫున మీరే పోటీలో ఉంటారా అంటే అదీ చెప్పడకపోవడంతో ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా... ఇప్పటికీ అభ్యర్థి ఎవరన్నదానిపై ఎలాంటి గ్యారెంటీ ఎవరూ చెప్పకపోవడంతో....అందరూ అయోమయంలో ఉన్నారు.