Jagan Mohan Reddy YSRCP Strategy:   2024 ఎన్నికల ఓటమి అనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో రాజకీయం ఊహించని మలుపు తిరిగింది. గతంలో ప్రత్యర్థిపార్టీల నేతలపై నిమిషానికో రీతిలో విరుచుకుపడే  ఫైర్ బ్రాండ్  నాయకులు ఆర్.కే. రోజా, కొడాలి నాని, జోగి రమేష్, వల్లభనేని వంశీ వంటి కీలక నేతలు రాజకీయంగా పూర్తిగా మౌనం వహించారు.  ఎన్నికలు ముగిసి రెండేళ్లు దాటిపోయినా  వీరు పార్టీ కార్యక్రమాల్లో క్రియాశీలకంగా పాల్గొనకపోవడం, మీడియా ముందుకు రాకపోవడం కేడర్‌లో తీవ్ర నిరాశను నింపుతోంది. ప్రస్తుతం కేవలం పేర్ని నాని, అంబటి రాంబాబు వంటి కొద్దిమంది నాయకులు మాత్రమే మైకుల ముందుకు వచ్చి ప్రత్యర్థులపై ఎదురుదాడి చేస్తున్నారు.

Continues below advertisement

కేసుల భయంలో స్లో అయిన నేతలు

 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత నమోదైన వరుస కేసులు, చట్టపరమైన చర్యల భయంతో స్లో అయ్యారు.  జోగి రమేష్  పై సిఐడి కేసులు, అగ్రిగోల్డ్ భూ వివాదం, తాజాగా కుటుబం కేసులు కూడా వచ్చి పడ్డాయి. అలాగే వల్లభనేని వంశీ చాలా రోజులు జైల్లో ఉండి వచ్చారు.   కొడాలి నాని అనారోగ్యం, రాజకీయ ఒత్తిళ్ల కారణంగా అసలు గుడివాడలోనే కనిపించడంలేదు.  ఐదేళ్ల పాలనలో వ్యక్తిగత దూషణలతో తీవ్ర స్థాయి విమర్శలు చేసిన ఈ నేతలు, ఇప్పుడు అధికార పక్షం కఠినంగా వ్యవహరిస్తుండటంతో చట్టపరమైన చిక్కుల నుంచి తప్పించుకునేందుకు తాత్కాలికంగా  రక్షణాత్మక వైఖరి లోకి వెళ్లిపోయారనేది స్పష్టమవుతోంది.

Continues below advertisement

వాళ్లు వస్తేనే కార్యకర్తల్లో ఉత్సాహం

మరోవైపు, ప్రతిపక్షంలో ఉన్న ఈ సమయంలో   తీవ్రంగా విరుచుకుపడే నాయకులు మీడియా ముందు రాకపోతే పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం రాదనేది పక్కా వాస్తవం. జగన్ మోహన్ రెడ్డి సైతం క్షేత్రస్థాయికి వచ్చి నిరసనలకు పిలుపునిస్తున్నా, దూకుడైన నేతల  నాయకత్వం లేకపోవడం వల్ల ఆందోళనలు ఆశించిన స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నాయి. పేర్ని నాని, అంబటి రాంబాబులు ఒంటరి పోరాటం చేస్తున్నప్పటికీ, రాయలసీమ నుంచి రోజా, కృష్ణా జిల్లా నుంచి కొడాలి నాని, వంశీ, జోగి రమేష్ వంటి వారు జతకలిస్తేనే పార్టీ కేడర్‌లో పూర్వ వైభవం, మైలేజ్ లభిస్తాయని వైఎస్సార్సీపీ శ్రేణులు భావిస్తున్నాయి.

జగన్ ఇప్పుడు వీళ్లను యాక్టివ్ చేస్తారు?

అయితే, వీళ్లను జగన్ ఎప్పుడు యాక్టివ్ చేస్తారు? లేదా వారే స్వయంగా బయటకు వస్తారా? అనే ప్రశ్నలకు పార్టీ వ్యూహకర్తల నుంచి భిన్నమైన సమాధానాలు వస్తున్నాయి. ఎన్నికలకు ముందు అధికారంలో ఉన్నప్పుడు చేసిన విమర్శల వల్లే తీవ్ర వ్యతిరేకత వచ్చిందని భావిస్తున్న జగన్, ప్రస్తుతానికి కొత్త డెసిషన్ తీసుకునే ముందు కొంత సమయం ఇవ్వాలని భావిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా, ప్రభుత్వం విధించే చట్టపరమైన సవాళ్లు , కేసుల తీవ్రత కొంత తగ్గిన తర్వాతే లేదా స్థానిక సంస్థల ఎన్నికల సమయానికి వీరిని మళ్లీ ముందువరుసలోకి తెచ్చేలా వ్యూహం రచిస్తున్నారని సమాచారం. అందుకే వారు వారి వారి నియోజకవర్గాల్లో పెద్దగా పార్టీ వ్యవహారాలను పట్టించుకోకపోయినా .. లైట్ తీసుకుంటున్నారని అంటున్నారు.

దూకుడైన నేతలు రావాల్సిందే! 

 వైఎస్సార్సీపీ తిరిగి పుంజుకోవాలంటే కేవలం జగన్ ఓరల్ ప్రసంగాలు సరిపోవు. క్షేత్రస్థాయిలో కౌంటర్ ఇవ్వగలిగే బలమైన గొంతులు మళ్లీ ప్రజా క్షేత్రంలోకి రావడం అత్యంత అవసరం. ఈ నేతలు తమ వ్యక్తిగత, న్యాయపరమైన సవాళ్లను దాటుకుని ధైర్యంగా ముందుకు వస్తే తప్ప వైఎస్సార్సీపీ కేడర్‌లో కోల్పోయిన ఆత్మవిశ్వాసం తిరిగొచ్చే అవకాశం లేదు. మరి దానికి జగన్ ఏం చేయబోతున్నారో ?