Why Pavan boycott :   జనసేన అధినేత పవన్ కల్యాణ్ భీమవరంలో కనిపించలేదు. సాక్షాత్తూ ప్రధానమంత్రి పాల్గొంటున్న సభకే హాజరు కాలేదు. కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వయంగా ఫోన్ చేసి ఆహ్వానించారని పవన్ కల్యాణ్ స్వయంగా ప్రకటించారు. అంటే ఆహ్వానం అందలేనందున రాలేదన్న మాట కూడా వాస్తవం కాదు. సాధారణంగా ప్రధాని పాల్గొనే కార్యక్రమం అంటే.. ఎలాంటి పరిస్థితుల్లోనైనా హాజరవుతారు.పైగా మిత్రపక్షం కావడంతో పవన్ ఖచ్చితంగా హాజరవుతారని అనుకున్నారు . కానీ ఆయన వెళ్లకపోవడంతో రాజకీయ కారణాలు ఏమైనా ఉన్నాయా అన్న చర్చ ప్రారంభమయింది.


రాజకీయాలకు అతీతంగా అల్లూరి విగ్రహావిష్కరణ కార్యక్రమం !


అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణ కార్యక్రమం పార్టీలకు అతీతంగా జరిగింది. అన్ని పార్టీల నేతలను ఆహ్వానించారు. పవన్ కల్యాణ్‌ను కూడా ఆహ్వానించారు. రాష్ట్ర బీజేపీ నేతలతో తనకు పెద్దగా సంబంధాలు లేవు కానీ ఢిల్లీ బీజేపీ నేతలతో మాత్రం సాన్నిహిత్యం ఉందని పవన్ పలు సందర్భాల్లో ప్రకటించారు. ప్రధానమంత్రిని కలిసేందుకు గతంలో కొన్ని సార్లు పవన్ ప్రయత్నించినా సఫలం కాలేదు. ఇప్పుడు నేరుగా ప్రధాని కార్యక్రమానికి పిలుపు వచ్చినా పవన్ వెళ్లలేదు. దీంతో పవన్ చెప్పిన ఆ సాన్నిహిత్యంగా గ్యాప్‌గా మారిందా అన్న భావన ఏర్పడింది.


మొక్కుబడిగా పిలిచారన్న భావనలో జనసేనాని !


బీజేపీతో మిత్రపక్షంగా ఉన్నప్పటికీ.. తనను మొక్కుబడిగా పిలిచారన్న భావన పవన్ కల్యాణ్‌లో ఉందని జనసేన వర్గాలు చెబుతున్నాయి.  చిరంజీవిని కూడా ఆహ్వనించిన తర్వాత కార్యక్రమం రెండు రోజుల ముందు ఆహ్వానించారని .. అన్ని వైపుల నుంచి పవన్ కల్యాణ్‌ను నిర్లక్ష్యం చేస్తున్నారన్న విమర్శలు వచ్చిన తర్వాతనే స్పందించారని జనసేన వర్గాలు చెబుతున్నాయి. అక్కడకు వెళ్తే తనకు అవమానం జరుగుతుందని ఆయన ఫీలయ్యారని.. అందుకే వెళ్లలేదని అంటున్నారు. నిజానికి విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఇతర పార్టీల నేతలను  ఆహ్వానించారు కానీ దానికి తగ్గట్లుగా వారికి ప్రాధాన్యం కూడా లభించలేదు. దీంతో చాలా మంది అవమానం జరిగినట్లుగా ఫీలయ్యారు. పవన్ వెళ్లినా అదే పరిస్థితి ఉండేదని ముందే తెలిసి ఆగిపోయారంటున్నారు. 


బీజేపీతో పెరిగిన గ్యాపే కారణమా ?


జనసేనపార్టీలో నెంబర్ టు గా నాదెండ్ల మనోహర్ ఉన్నారు. ఆయనను అయినా పార్టీ ప్రతినిధిగా పవన్ పంపి ఉండాల్సిందన్న అభిప్రాయం వినిపిస్తోంది. కానీ వెళ్లకపోవడంతో ఇప్పుడు బీజేపీ విషయంలో పవన్ కల్యాణ్ అసంతృప్తిగా ఉన్నారని అందుక ఎవాయిడ్ చేశారని రాజకీయవర్గాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం బీజేపీతో పొత్తు గురించి పవన్ పెద్దగా మాట్లాడటం లేదు. ఇప్పుడు మోదీ ఏపీకి వచ్చినా ఆయనను కలిసే అవకాశం లభించినా.. వెనక్కి తగ్గడంతో చర్చ ప్రారంభమయింది.