YSRCP silent on tainted leaders : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఒక క్లిష్టమైన రాజకీయ సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. అధికారాన్ని కోల్పోయిన తర్వాత సహజంగానే వచ్చే అవినీతి ఆరోపణలు ఒకెత్తయితే, పార్టీలోని కీలక నేతలు హత్యలు, కిడ్నాప్‌లు వంటి తీవ్రమైన క్రిమినల్ కేసుల్లో చిక్కుకోవడం ఇప్పుడు పార్టీ ప్రతిష్టను తీవ్రంగా దెబ్బతీస్తోంది. కడప మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి మొదలుకొని, ఎమ్మెల్సీ అనంతబాబు వరకు.. నేతలు చట్టం ముందు  నిలబడుతున్న తీరు, పార్టీకి ప్రజల్లో ఉన్న విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోంది.

Continues below advertisement

కడప హత్యకేసు - ప్రకంపనలు రేపుతున్న ఆస్తుల పత్రాలు

కడపలో వైసీపీ కార్యకర్త, రియల్ ఎస్టేట్ వ్యాపారి పెద్ద దస్తగిరి హత్య కేసు ఇప్పుడు రాజకీయ మలుపు తిరిగింది. ఈ కేసులో మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డిని ప్రధాన సూత్రధారిగా పోలీసులు గుర్తించడం సంచలనం రేపింది. ఆయన నివాసంపై జరిగిన దాడుల్లో సుమారు రూ. 100 కోట్లకు పైగా విలువైన ఆస్తుల పత్రాలు లభ్యమవ్వడం, ఒక సాధారణ రాజకీయ నేత వద్ద ఇంత పెద్ద మొత్తంలో భూ వివాదాలకు సంబంధించిన పత్రాలు ఉండటం చర్చనీయాంశమైంది. స్వపక్షీయులనే మట్టుబెట్టే స్థాయికి వర్గ పోరు వెళ్లిందన్న ఆరోపణలు, కేవలం ఆర్థిక ప్రయోజనాల కోసమే ఇలాంటి దారుణాలకు పాల్పడుతున్నారనే సంకేతాలను ప్రజల్లోకి తీసుకెళ్తున్నాయి.

Continues below advertisement

అనంతబాబు వ్యవహారం - పార్టీకి మాయని మచ్చ

మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో నిందితుడిగా ఉన్న ఎమ్మెల్సీ అనంతబాబు ఉదంతం వైసీపీకి ఇప్పటికే తీరని నష్టం చేకూర్చింది. తాజాగా ఆయన సాక్షులను బెదిరిస్తూ, డబ్బుతో ప్రలోభపెట్టేందుకు ప్రయత్నించారనే ఆరోపణలతో పోలీసులు మళ్లీ కేసులు నమోదు చేయడం, ఆయన బెయిల్ రద్దు అయ్యే పరిస్థితులు తలెత్తడం పార్టీని ఇరకాటంలో పడేసింది. హత్య చేసినట్లు ఆయనే స్వయంగా ఒప్పుకున్నప్పటికీ, పార్టీ ఆయనపై కఠినమైన క్రమశిక్షణా చర్యలు తీసుకోకపోవడం వల్ల,  పార్టీ అండ చూసుకునే ఆయన ఇలా రెచ్చిపోతున్నారా  అనే అనుమానాలు బలపడుతున్నాయి.

హైకమాండ్ నిర్లిప్తత - వ్యూహాత్మక మౌనమా?

వైసీపీ అధిష్టానం ఇలాంటి నేతలపై కఠినంగా వ్యవహరించడంలో వెనకాడుతోందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తప్పు చేసిన వారు తమ పార్టీ వారైనా సరే వదిలిపెట్టబోమని గతంలో గొప్పగా చెప్పుకున్న జగన్ మోహన్ రెడ్డి, ఇప్పుడు తన నేతలు హత్య కేసుల్లో ఇరుక్కున్నా మౌనంగా ఉండటం  ఏమిటని టీడీపీ నేతుల ప్రశ్నిస్తున్నారు. పార్టీ అధికారంలో లేని సమయంలో నేతలను వదులుకుంటే క్యాడర్ బలహీనపడుతుందనే భయం ఒకవైపు కనిపిస్తున్నా, ఈ నిర్లిప్తత సామాన్య ప్రజల్లో పార్టీని నేరగాళ్ల అడ్డాగా చిత్రీకరించే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్తోంది. 

దెబ్బతింటున్న పార్టీ ఇమేజ్

రాజకీయాల్లో అవినీతిని ప్రజలు కొంతవరకు భరించవచ్చు కానీ, ప్రాణాలు తీసే సంస్కృతిని మాత్రం ఎప్పటికీ ఆమోదించరు. వైసీపీ నేతలు వరుసగా ఇలాంటి కేసుల్లో చిక్కుకోవడం వల్ల, ఐదేళ్ల పాలనలో శాంతిభద్రతల పరిస్థితి ఎలా ఉండేదో చెప్పడానికి ఇవి సాక్ష్యాలుగా మారుతున్నాయని విపక్షాలు చేస్తున్న ప్రచారం ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.   వైసీపీ  కేవలం రాజకీయ పోరాటాలు చేస్తే సరిపోదు. పార్టీలోని  క్రిమినల్ ఎలిమెంట్స్  పై ఉక్కుపాదం మోపి, ప్రజలకు జవాబుదారీగా ఉన్నామనే నమ్మకాన్ని కలిగించాలన్న సూచనలు ఆ పార్టీకి వస్తున్నాయి. . నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిని వెనకేసుకొచ్చినంత కాలం, వైసీపీ ఒక బాధ్యతాయుతమైన విపక్షంగా ఎదగడం కష్టమేనని అంటున్నారు. మరి వైసీపీ వ్యూహకర్తలు కఠిన నిర్ణయాలకు రెడీ అవుతారా?