Five States assembly elections:    పశ్చిమ బెంగాల్, కేరళ, తమిళనాడు, అసోం, పుదుచ్చేరి అసెంబ్లీ ఎన్నికలు వచ్చే మాూడు నెలల్లో జరగనున్నాయి. చాలా కాలంగా కాంగ్రెస్ పార్టీ గెలుస్తామని అనుకున్న  రాష్ట్రాల్లో కూడా ఓడిపోతోంది. రాను రాను ఆ పార్టీ పరిస్థితి దిగజారుతోంది. ఇలాంటి సమయంలో మరో ఐదు రాష్ట్రాల ఎన్నికలు వచ్చాయి. ఈ ఐదు రాష్ట్రాల్లో ముఖాముఖి, కూటములుగా తలపడే పరిస్థితులు ఉన్నాయి.  జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ వరుస ఓటములతో సతమతమవుతున్న వేళ, ఈ ఎన్నికలు ఆ పార్టీ ఉనికికి ,ప్రతిపక్ష కూట  ఐక్యతకు అగ్నిపరీక్షగా మారాయి.   పశ్చిమ బెంగాల్ - దీదీ అధికారాన్ని నిలబెట్టుకోగలరా?

Continues below advertisement

పశ్చిమ బెంగాల్‌లో మరోసారి తృణమూల్ కాంగ్రెస్, బీజేపీ మధ్య ముఖాముఖి పోరు నెలకొంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ తన సంక్షేమ పథకాలు , బెంగాలీ అస్తిత్వంపై నమ్మకం పెట్టుకోగా, ప్రభుత్వ వ్యతిరేకత,  అవినీతి ఆరోపణలను బీజేపీ తన ప్రధాన అస్త్రాలుగా మార్చుకుంది. ఇక్కడ కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పోటీ చేస్తున్నప్పటికీ, ప్రధాన పోటీ మాత్రం టీఎంసీ-బీజేపీ మధ్యే ఉండేలా కనిపిస్తోంది. ముస్లిం ఓట్ల సమీకరణ ఇక్కడ గెలుపోటములను శాసించనుంది. మమతా బెనర్జీ ఎంతో నమ్మకంగా ఉన్నప్పటికీ.. బీజేపీ కూడా గెలిచి చూపిస్తామన్న ధీమాతో ఉంది. 

ద్రావిడ కోటలో కొత్త శక్తుల సందడి 

Continues below advertisement

తమిళనాడులో అధికార డీఎంకే కూటమి బలంగా ఉన్నప్పటికీ, నటుడు విజయ్ స్థాపించిన  తమిళగ వెట్రి కళగం  రాకతో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. అన్నా డీఎంకే  తన కోల్పోయిన వైభవాన్ని చాటుకోవాలని చూస్తుంటే, బీజేపీ తన ఓటు బ్యాంకును పెంచుకోవడానికి తీవ్రంగా శ్రమిస్తోంది. కాంగ్రెస్ ఇక్కడ డీఎంకేపైనే ఆధారపడాల్సిన పరిస్థితి ఉంది. సీట్ల సర్దుబాటు విషయంలో డీఎంకే ఈసారి కఠినంగా వ్యవహరించే అవకాశం ఉండటంతో కాంగ్రెస్‌కు ఇది సవాలుగా మారింది. త్రిముఖ పోరులో డీఎంకేకు లాభం కలుగుతుందన్న అంచనాలు వస్తున్నాయి. 

 కేరళ: ఎల్‌డిఎఫ్ హ్యాట్రిక్ కొడుతుందా?  

సాధారణంగా కేరళలో ఐదేళ్లకోసారి ప్రభుత్వం మారుతుంది, కానీ గత ఎన్నికల్లో పినరయి విజయన్ ఆ సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఇప్పుడు వరుసగా మూడోసారి అధికారం దక్కించుకోవాలని ఎల్‌డిఎఫ్ చూస్తోంది. కాంగ్రెస్ నేతృత్వంలోని యుడిఎఫ్  కి ఇది చావో రేవో లాంటి ఎన్నిక. ఒకవేళ ఇక్కడ కూడా కాంగ్రెస్ ఓడిపోతే, జాతీయ స్థాయిలో ఆ పార్టీ నైతిక స్థైర్యం పూర్తిగా దెబ్బతింటుంది. అటు బీజేపీ కూడా క్రైస్తవ ఓటర్లను ఆకట్టుకుంటూ ఇక్కడ బలపడాలని చూస్తోంది. ప్రియాంకా గాంధీ వాయనాడ్ నుంచి ఎంపీగా ఉండటంతో  గెలుపు సాధించడం ప్రతిష్టాత్మకంగా మారింది. 

 అసోం: బీజేపీ హ్యాట్రిక్ ప్రయత్నం 

అసోంలో ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ తిరుగులేని నాయకుడిగా ఎదిగారు. అభివృద్ధి ,  హిందుత్వ నినాదాలతో బీజేపీ మూడోసారి అధికారంపై కన్నేసింది. కాంగ్రెస్ పార్టీ ఇక్కడ అంతర్గత కుమ్ములాటలతో ఇబ్బంది పడుతోంది. పైగా కీలక నేతలు బీజేపీలో చేరడం ఆ పార్టీకి పెద్ద దెబ్బ. ఏఐయుడిఎఫ్ వంటి పార్టీలతో పొత్తులు కుదిరితేనే కాంగ్రెస్ ఇక్కడ గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉంది, లేదంటే బీజేపీకి మార్గం సుగమం అవుతుంది.

 పుదుచ్చేరి: కేంద్రపాలిత ప్రాంతంలో పట్టు కోసం పోరు 

పుదుచ్చేరిలో ఎన్. రంగస్వామి నేతృత్వంలోని ఏఐఎన్ఆర్‌సీ , బీజేపీ కూటమి అధికారాన్ని నిలబెట్టుకోవాలని చూస్తోంది. గతంలో ఇక్కడ కాంగ్రెస్ బలంగా ఉండేది, కానీ నేతల వలసలు ఆ పార్టీని బలహీనపరిచాయి. ఇక్కడ కూడా డీఎంకే మద్దతుతోనే కాంగ్రెస్ తన ఉనికిని చాటుకోవాల్సిన పరిస్థితి ఉంది. చిన్న రాష్ట్రం అయినప్పటికీ, ఇక్కడ గెలుపు కేంద్రంలోని అధికార పార్టీకి ప్రతిష్టాత్మకం. ఈ ఎన్నికలు కాంగ్రెస్ పార్టీకి అత్యంత కీలకం. కేరళలో అధికారం దక్కించుకోలేకపోతే, ఆ పార్టీ కేవలం కొన్ని చిన్న రాష్ట్రాలకే పరిమితమయ్యే ప్రమాదం ఉంది. మరోవైపు, బెంగాల్ ,  తమిళనాడులో ప్రాంతీయ పార్టీలైన టీఎంసీ, డీఎంకేలు గెలిస్తే, ఇండియా కూటమిలో కాంగ్రెస్ ప్రాధాన్యత తగ్గి, మమతా బెనర్జీ , స్టాలిన్ వంటి నేతలు జాతీయ నాయకత్వం వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది. 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈ ఐదు రాష్ట్రాల ఫలితాలు దేశ రాజకీయ గమనాన్ని మార్చనున్నాయి.