Telangana Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ సమరంలో ఎవరిది హవా? విపక్షాల ఆరోపణలు ఓటమికి సంకేతాలా?
Municipal elections: తెలంంగాణ మున్సిపల్ ఎన్నికల్లో అన్ని పార్టీల అంచనాల్లో మునిగి తేలుతున్నాయి. ఎన్నికల నిర్వహణపై ఆరోపణలుచేయడం ద్వారా బీఆర్ఎస్, బీజేపీ తాము వెనుకబడ్డామన్న సంకేతాలు ఇచ్చాయి

Telangana municipal elections parties expectations: తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల పోలింగ్ పర్వం ముగిసింది. అయితే, పోలింగ్ ముగిసిన వెంటనే వినిపిస్తున్న రాజకీయ విశ్లేషణలు, పార్టీల మధ్య జరుగుతున్న మాటల యుద్ధం ఆసక్తికరంగా మారింది. తెలంగాణలోని 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్ల పరిధిలో బుధవారం జరిగిన పోలింగ్ ముగిసింది. సుమారు 70 శాతానికి పైగా పోలింగ్ నమోదైనట్లు తెలుస్తోంది. అయితే, పోలింగ్ సరళిని బట్టి చూస్తే అధికార కాంగ్రెస్ పార్టీలో ధీమా కనిపిస్తుండగా, విపక్షాలైన బీఆర్ఎస్, బీజేపీలు చేస్తున్న విమర్శలు రాజకీయ వర్గాల్లో కొత్త చర్చకు దారితీస్తున్నాయి.
బీఆర్ఎస్, బీజేపీల ఆరోపణలు - ఆందోళనా?
పోలింగ్ ముగిసిన వెంటనే బీఆర్ఎస్ శ్రేణులు అధికార యంత్రాంగంపై మండిపడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడిందని, పోలీసుల సహకారంతో తమ ఏజెంట్లను ఇబ్బందులకు గురిచేశారని ఆరోపించారు. మరోవైపు, బీజేపీ నేతలు ఒక అడుగు ముందుకు వేసి, అసలు తెలంగాణలో ఎన్నికల సంఘం ఉందా లేదా అని ప్రశ్నించారు. ఓటర్ల జాబితాలో అక్రమాలు జరిగాయని, అధికార పార్టీ నేతలు పోలింగ్ కేంద్రాల వద్ద ఇష్టారాజ్యంగా వ్యవహరించారని విమర్శించారు. సాధారణంగా ఎన్నికల్లో వెనుకబడిపోతామన్న భయం లేదా క్షేత్రస్థాయిలో పరిస్థితులు అనుకూలించని సందర్భంలోనే విపక్షాలు ఇలాంటి గొంతు ఎత్తుతాయని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాంగ్రెస్ 80 శాతం ధీమా
గత డిసెంబర్‌లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సాధించిన విజయాన్ని మున్సిపల్ ఎన్నికల్లోనూ పునరావృతం చేస్తామని కాంగ్రెస్ గట్టి నమ్మకంతో ఉంది. రాష్ట్రవ్యాప్తంగా కనీసం 80 శాతం మున్సిపాలిటీలను క్లీన్ స్వీప్ చేస్తామని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో చేపట్టిన అభివృద్ధి పనులే తమను గెలిపిస్తాయని వారు భావిస్తున్నారు. 116 మున్సిపాలిటీల్లో కనీసం వంద చోట్ల గెలుస్తామని అంటున్నారు. ఏడు కార్పొరేషన్లలో ఐదు కార్పొరేషన్లలో గెలుస్తామని అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ క్రితం సారి జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసింది. ఈ సారి మాత్రం 20లోపు మున్సిపాలిటీలతో సరిపెట్టుకునే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది.
కార్పొరేషన్లలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితి
ఈసారి కార్పొరేషన్లలో బీఆర్ఎస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఏడు కార్పొరేషన్లలో కనీసం ఒక్కటి కూడా గెలుచుకోకపోవచ్చని కొందరు అంచనా వేస్తున్నారు. పట్టణ ఓటర్లు ప్రధానంగా కాంగ్రెస్ , బీజేపీల మధ్య చీలిపోయే అవకాశం ఉండటం, బీఆర్ఎస్ కేడర్ లో కొంత స్తబ్దత నెలకొనడం ఆ పార్టీకి ప్రతికూల అంశాలుగా మారాయి. కరీంనగర్, నిజామాబాద్‌లో బీజేపీ సిట్టింగ్ ఎంపీలు ఉండటంతో అక్కడ బీజేపీ గట్టి పోటీ ఇచ్చింది. అయితే మజ్లిస్, కాంగ్రెస్ పరస్పర సహకారంతో వాటిని కూడా గెలుచుకోవచ్చని భావిస్తున్నారు. క
ఓటరు పల్స్ ఎటు?
పట్టణ ఓటర్లు ఈసారి మౌనంగా తమ తీర్పును బ్యాలెట్ బాక్సుల్లో నిక్షిప్తం చేశారు. పెరిగిన ధరలు, స్థానిక సమస్యలు వంటివి ప్రచారంలో చర్చనీయాంశాలు కాలేదు. లోకల్ పోల్స్ కావడంతో స్థానిక సమస్యలే హైలెట్ కావాల్సి ఉంది. కాకపోయినప్పటికీ ఓటర్లు ఇదే టాపిక్ ను తీసుకుని ఉంటారని భావిస్తున్నారు. ప్రభుత్వ పనితీరు, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ఓటర్లు తమ నిర్ణయాన్ని తీసుకున్నట్లు క్షేత్రస్థాయి విశ్లేషణలు చెబుతున్నాయి. శుక్రవారం జరిగే ఓట్ల లెక్కింపుతో ఈ ఉత్కంఠకు తెరపడనుంది.























