ED Who Next TRS   : తెలంగాణ రాష్ట్ర సమితిలో ఇప్పుడు అంతర్గతంగా " ఎన్‌ఫోర్స్ మెంట్ డైరక్టరేట్ " దూకుడుపై చర్చ జరుగుతోంది. ఆదివారం అయినప్పటికీ ఈడీ టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావు కుటుంబానికి చెందిన మధుకాన్ కంపెనీ ఆస్తులను జప్తు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ ఉత్తర్వులు టీఆర్ఎస్‌లో కలకలం రేపాయి. ఓ వైపు బీజేపీ సభ జరుగుతున్న సమయంలోనే ఈ ఉత్తర్వులు వచ్చాయి. ఇది శాంపిల్ మాత్రమేనని బీజేపీ వర్గాలు చెప్పాయని టీఆర్ఎస్ నేతలు భావిస్తున్నాయి.  


బీజేపీ రాజకీయ వ్యూహాలు అమలు చేయడంలో "ఈడీ" భాగమనే ఆరోపణలు!


మహారాష్ట్రలో ఈడీ ప్రభుత్వం వచ్చిందని  సోషల్ మీడియాలో ట్రోలింగ్ నడుస్తోంది. అంటే ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ ప్రభుత్వం అని అన్న అర్థం లో చెబుతున్నారు. ఈ అంటే ఏక్‌నాథ్, డీ అంటే దేవంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వం అని అర్థం.  ద్వంద్వార్థం వచ్చేలా చెబుతున్నారు. దీనికి కారణం ఈడీ దాడులతో భయపెట్టే ఎమ్మెల్యేలను.. శివసేనపై తిరుగుబాటు చేసేలా చేశారన్న ఆరోపణలే. ఈడీ చేతిలో ఉంటే తాము ఇలాంటివి ఎన్నైనా చేస్తామని శివసేన సంజయ్ రౌత్  చెబుతూ ఉంటారు.  ఇప్పటికే ఇద్దరు ఎమ్మెల్యేలు ఈడీ కేసులతో జైల్లో ఉన్నారు. చాలా మందికి నోటీసులు అందాయి. ఇవన్నీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఈడీని ఎలా రాజకీయం మిత్రపక్షంగా వాడుకుంటుందో సాక్ష్యాలని ఇతర పార్టీలు ఆరోపిస్తూ ఉంటాయి.  


తెలంగాలోనూ ఈడీ దాడులు ఉంటాయని కొద్ది రోజులుగా ప్రచారం ! 
 
సీబీఐ చట్టం ప్రకారం రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తేనే సీబీఐ విచారణ చేయాలి. కానీ ఐటీ, ఈడీకి అలాంటి పరిమితులు లేవు.   టీఆర్ఎస్ ఎంపీ నామానాగేశ్వరరావు విషయంలో కూడా ఈడీనే ఆస్తులు జప్తు చేసింది. ఈడీ రాడార్‌లో చాలా మంది టీఆర్ఎస్ నేతలు ఉన్నారన్నప్రచారం కొంత కాలంగా గుప్పు మంటోంది. ముఖ్యంగా భారీ వ్యాపారాలు ఉన్న వారిపై కన్నేసినట్లుగా చెబుతున్నారు.  వారి ఆర్థిక వ్యవహారాల్లో ఏదో ఓ లోపం కనిపెట్టడం ఈడీకి పెద్ద కష్టం కాదు. అలాంటి వారిని ఇప్పటికే మార్క్ చేశారని.. సమయం చూసుని ఎటాక్ చేయడమే మిగిలిందని అంటున్నారు. ఇలాంటి సమాచారం ఉండబట్టే కొద్ది రోజులుగా బీజేపీ దర్యాప్తు సంస్థల్ని దుర్వినియోగం చేస్తోందని కేసీఆర్, కేటీఆర్ విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారన్న విశ్లేషణలు ఉన్నాయి. 


ఈడీ దృష్టి ఎవరెవరిపై పడవచ్చన్నదానిపై టీఆర్ఎస్‌లో చర్చ !


టీఆర్ఎస్ నేతలు బీజేపీపై చేస్తున్న రాజకీయ యుద్ధం కారణంగా బీజేపీ సైలెంట్‌గా ఉండదని ఎక్కువ మంద ినమ్ముతున్నారు.  పార్టీకి ఆర్థికంగా అండదండగా ఉన్న వారిని.. పార్టీలో బడా పారిశ్రామికవేత్తల్ని.. పార్టీలో చేర్చుకోవాలి అనుకున్న వారిని బీజేపీ టార్గెట్ చేస్తుందని నమ్ముతున్నారు.  ఇతర పార్టీల నేతల్ని తమ పార్టీలో చేర్చుకోవడంలో బీజేపీకి దర్యాప్తు సంస్థలు చేసే సాయం ఏమిటో  బెంగాల్‌లో చూశామని టీఆర్ఎస్ నేతలు గుర్తు చేస్తున్నారు.   అసలు ఏమీ లేని బీజేపీలో తృణమూల్ నేతలందరూ పోలోమని చేరడానికి కారణం దర్యాప్తు సంస్థలే. శారదా స్కాం అని మరొకటని టీఎంసీ నేతలపై కేసులు నమోదు చేశారు. దాడులతో భయపెట్టారు. వారంతా బీజేపీలో చేరితే ఆ కేసులు సైలెంట్ అయిపోయాయి.  తెలంగాణలోనూ అదే జరుగుతుందని నమ్ముతున్నారు.