Mamata Banerjee TMC Congress Merger:   పశ్చిమ బెంగాల్ రాజకీయాలను రెండు దశాబ్దాలుగా  శాసించిన తృణమూల్ కాంగ్రెస్  అధినేత్రి మమతా బెనర్జీ రాజకీయ ప్రస్థానం ప్రస్తుతం అత్యంత కీలకమైన, కఠినమైన మలుపు తిరిగింది. పార్టీలో చోటుచేసుకున్న తిరుగుబాటు, ఆపై రెండు వర్గాలుగా చీలిపోవడం  వల్ల ఆమె గ్రాఫ్ నానాటికీ దిగజారుతోంది.నందిగ్రామ్, రెజీనగర్ అసెంబ్లీ ఉపఎన్నికల ఫలితాలు వంగ నేల రాజకీయాల్లో మమత తీవ్రమైన డిఫెన్స్‌లో పడ్డారని స్పష్టం చేస్తున్నాయి.

Continues below advertisement

మమతా పార్టీని పట్టించుకోని ప్రజలు 

ఈ ఉపఎన్నికల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ క్యాడర్ ,  ప్రజాదరణ ఏ స్థాయిలో దిగజారిందో స్పష్టంగా కనిపించింది. నందిగ్రామ్‌లో తమ అభ్యర్థి ఉపసంహరించుకోవడంతో గత్యంతరం లేక కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతు ప్రకటించినప్పటికీ, అక్కడ కనీసం 20 శాతం ఓట్లను కూడా రాబట్టలేకపోయారు. ఇక ముస్లిం జనాభా అధికంగా ఉండే రెజీనగర్ స్థానంలో మమత సొంత అభ్యర్థి బరిలో ఉన్నప్పటికీ, కేవలం 3,847 ఓట్లు  మాత్రమే సాధించి నాలుగో స్థానానికి పరిమితం కావడం ఘోర పరాభవంగా నిలిచింది. ఈ ఘోర ఫలితాల అనంతరం బెంగాలీ సోషల్ మీడియా , పొలిటికల్ సర్కిళ్లలో  చర్చ మొదలైంది. ఒకప్పుడు కాంగ్రెస్‌పై తిరుగుబాటు జెండా ఎగరేసి, సొంతంగా ప్రాంతీయ పార్టీని స్థాపించి లెఫ్ట్ రౌడీయిజానికి చెక్ పెట్టిన  దీదీ , ఇప్పుడు తన పార్టీ మనుగడ కోసమే కాంగ్రెస్ దయాదాక్షిణ్యాలపై ఆధారపడే స్థితికి వచ్చారనే కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. పార్టీలో సీనియర్ నేతలు,  పార్లమెంట్ సభ్యులు విడిపోయి విపక్షాల్లో చేరడం, ఎన్నికల గుర్తు ఫ్రీజ్ కావడంతో మమత ఫేడవుట్ శకంలోకి అడుగుపెట్టారని  భావిస్తున్నారు.

Continues below advertisement

బీజేపీ పూర్తి ఆధిపత్యం

ప్రస్తుతం బెంగాల్ రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ ఆధిపత్యం ప్రదర్శిస్తోంది. రెజీనగర్ వంటి ముస్లిం మెజారిటీ స్థానంలో కూడా బీజేపీ భారీ మెజారిటీతో విజయం సాధించడం, నాన్-బీజేపీ ఓటు బ్యాంకు పూర్తిగా చెల్లాచెదురైందనడానికి ప్రత్యక్ష నిదర్శనం. విడిపోయిన టీఎంసీ వర్గాలు, కాంగ్రెస్, కమ్యూనిస్టులు వేర్వేరుగా పోటీ చేయడం వల్ల వ్యతిరేక ఓటు అంతా చీలిపోయి బీజేపీకి తిరుగులేని విజయాలను కట్టబెడుతోంది. ఈ  సంక్షోభ పరిస్థితుల్లో మమతా బెనర్జీ ముందున్న ఏకైక మార్గం తన వర్గాన్ని తిరిగి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడమేనని పొలిటికల్ కారిడార్లలో జోరుగా ప్రచారం సాగుతోంది. జాతీయ స్థాయిలో రాహుల్ గాంధీ,  ఇండియా కూటమి పెద్దలతో మమత నిరంతరం సంప్రదింపులు జరుపుతుండటం, బెంగాల్‌లోని లోకల్ కాంగ్రెస్ నేతల దెప్పిపొడుపులను సైతం తట్టుకుని కాంగ్రెస్‌కు మద్దతిస్తుండటం ఈ విలీన సిద్ధాంతానికి బలం చేకూరుస్తోంది.

రాజకీయం కోసం తప్పదా? 

  ఒకవేళ కాంగ్రెస్‌లో విలీనం జరిగితే మమత బెనర్జీ స్వతంత్ర ప్రతిపత్తి   దెబ్బతింటుంది. కానీ, బీజేపీ దూకుడును తట్టుకోవడానికి, తన మిగిలి ఉన్న ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి, పార్టీకి ఒక జాతీయ వేదిక లభించాలంటే మమతకు మరే ఇతర ప్రత్యామ్నాయం కనిపించడం లేదనేది ఎక్కువ మంది అభిప్రాయం. ఈ రాజకీయ క్షీణదశ నుంచి మమత మళ్లీ పుంజుకుంటారా లేక ఆత్మరక్షణ కోసం విలీన బాట పడతారా అనేది కాలమే నిర్ణయించాలి.