Trinamool Congress Split: పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో తృణమూల్ కాంగ్రెస్ ఉనికికే ప్రమాదం తెచ్చేలా సాగుతున్న అంతర్గత సంక్షోభం ఇప్పుడు సరికొత్త లీగల్ ,  టెక్నికల్ మలుపులు తిరుగుతోంది. లోక్‌సభ ఎన్నికల పరాజయం తర్వాత మమతా బెనర్జీ తన రాజకీయ భవిష్యత్తు కోసం, జాతీయ స్థాయిలో మోదీని ఢీకొట్టేందుకు టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేయడమే ఏకైక మార్గమని భావిస్తున్నట్లు విస్తృత ప్రచారం జరుగుతోంది. దశాబ్దాలుగా మమతకు నీడలా నిలిచిన కల్యాణ్ బెనర్జీ వంటి సీనియర్ మోస్ట్ నేతలు కూడా ఇప్పుడు బహిరంగంగానే తిరుగుబాటు దారుల జాబితాలో చేరడం ఈ విలీన వార్తలకు మరింత బలాన్ని చేకూరుస్తోంది. అయితే, క్షేత్రస్థాయి రాజకీయ సమీకరణాలను, దేశంలోని పార్టీ విలీన చట్టాలను నిశితంగా పరిశీలిస్తే.. ఈ విలీనం అనుకున్నంత సులభం కాదని, సాంకేతికంగా ఇది దాదాపు అసాధ్యమనే వాదనలు వినిపిస్తున్నాయి.

Continues below advertisement

ఎమ్మెల్యేలు, ఎంపీల తిరుగుబాటు 

జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల ప్రాభవం తగ్గుతున్న తరుణంలో, మమతా బెనర్జీకి కాంగ్రెస్ పెద్ద దిక్కుగా కనిపిస్తోంది. ఒంటిచేత్తో బెంగాల్‌ను పాలించిన 'దీదీ', ఇప్పుడు జాతీయ స్థాయిలో ఎంతో కొంత రాజకీయం చేయాలన్నా, కేంద్ర దర్యాప్తు సంస్థల ఒత్తిడి నుంచి తప్పుకోవాలన్నా కాంగ్రెస్ అనే పెద్ద ఛత్రం కిందకు చేరడం బెటర్ అని అంతర్గతంగా ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే సోనియా గాంధీ, రాహుల్ గాంధీలతో  జరిపిన చర్చల్లో విలీన ప్రస్తావన ప్రధాన ఎజెండాగా నిలిచింది. కానీ, ఈ పొలిటికల్ మాస్టర్ ప్లాన్‌కు పార్టీలోని మెజార్టీ ప్రజాప్రతినిధుల తిరుగుబాటు ఒక పెద్ద సాంకేతిక అడ్డంకిగా మారింది.

Continues below advertisement

వ్యక్తిగతంగా మమతా బెనర్జీ కాంగ్రెస్‌లో చేరాల్సిందే 

భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్  ఫిరాయింపుల నిరోధక చట్టం  ప్రకారం.. ఒక ప్రాంతీయ పార్టీని జాతీయ పార్టీలో పూర్తిగా విలీనం చేయాలంటే, ఆ పార్టీకి ఉన్న మొత్తం శాసనసభ్యులలో,  పార్లమెంటు సభ్యులలో  కనీసం మూడింట రెండు వంతుల మంది మద్దతు తప్పనిసరిగా ఉండాలి. ప్రస్తుత తృణమూల్ సంక్షోభంలో పరిస్థితి  అంతే ఉంది. ఇప్పటికే 29 మంది టీఎంసీ ఎంపీలలో 20 మంది ఎంపీలు కాకొలి ఘోష్ దస్తీదార్, శతాబ్ది రాయ్ నేతృత్వంలో తిరుగుబాటు జెండా ఎగురవేసి, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ వైపు మొగ్గు చూపుతున్నారు. అంటే, పార్లమెంటరీ పార్టీలో కేవలం 9 మంది మాత్రమే మమత వైపు ఉన్నారు. అసెంబ్లీలోనూ దాదాపు 60 మందికి పైగా ఎమ్మెల్యేలు ఇప్పటికే తిరుగుబాటు గ్రూపుగా ఏర్పడ్డారు. ఇలాంటి సంక్షోభ సమయంలో మమతా బెనర్జీ గనుక టీఎంసీని కాంగ్రెస్‌లో విలీనం చేస్తున్నట్లు ప్రకటించినా, సాంకేతికంగా ఆ విలీనానికి చట్టబద్ధత లభించదు. ఎందుకంటే 2/3 వంతు మెజార్టీ లేనందున కేంద్ర ఎన్నికల సంఘం   కానీ, లోక్‌సభ స్పీకర్ కానీ ఈ విలీనాన్ని గుర్తించరు. ఒకవేళ మమత మొండిగా ముందుకు వెళ్తే.. అది కేవలం మమతా బెనర్జీ, అభిషేక్ బెనర్జీ మరికొంత మంది నేతలు వ్యక్తిగతంగా కాంగ్రెస్‌లో చేరినట్లు మాత్రమే అవుతుంది తప్ప,  తృణమూల్ కాంగ్రెస్  అనే పార్టీ కాంగ్రెస్‌లో విలీనమైనట్లు కాదు.

అతి పెద్ద వ్యూహాత్మక తప్పిదం

ఈ పరిణామం సంభవిస్తే అది మమతా బెనర్జీ రాజకీయ జీవితంలోనే అతిపెద్ద వ్యూహాత్మక తప్పిదంగా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. మమత కాంగ్రెస్ గూటికి చేరిన మరుక్షణమే.. ఇటు బెంగాల్‌లో  రితబ్రత బెనర్జీ, అటు ఢిల్లీలో 20 మంది రెబల్ ఎంపీల బృందం క్లెయిమ్స్ తెరపైకి తెస్తాయి. అసెంబ్లీ , పార్లమెంట్‌లో తమకే మెజార్టీ సంఖ్యాబలం ఉందని చూపిస్తూ, కేంద్ర ఎన్నికల సంఘాన్ని ఆశ్రయించి  నిజమైన తృణమూల్ కాంగ్రెస్ మాదే.. పార్టీ గుర్తు  మాకే చెందుతుంది అని ప్రకటించుకునే పూర్తి లీగల్ ఛాన్స్ రెబల్స్ చేతికి వస్తుంది. అదే జరిగితే, దశాబ్దాల పాటు రక్తం చిందించి, ఎన్నో పోరాటాలు చేసి మమతా బెనర్జీ సొంతంగా నిర్మించుకున్న 'తృణమూల్ కాంగ్రెస్' సామ్రాజ్యం, ఆమె కళ్ల ముందే ఇతరుల చేతుల్లోకి వెళ్ళిపోతుంది. కేవలం మేనల్లుడు అభిషేక్ బెనర్జీ అనాలోచిత వ్యూహాలు, అహంకార వైఖరి వల్ల పార్టీని కాపాడుకోలేక.. చివరకు తన రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన కాంగ్రెస్ పార్టీలోనే మమత శరణు కోరాల్సి వస్తుంది.   మమత కాంగ్రెస్‌ వైపు అడుగులు వేస్తే, బెంగాల్‌లో టీఎంసీ బ్రాండ్ ఇమేజ్ మరియు పార్టీ సింబల్ పూర్తిగా రెబల్స్ వశం కావడం ఖాయమని అనుకోవచ్చు.