Tadipatri Tension :   తాడిపత్రిలో ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తనయుడు హర్షవర్ధన్ రెడ్డి ఓ తెలుగుదేశం పార్టీ కార్పొరేటర్‌పై హత్యాయత్నం చేయడం కలకలం రేపుతోంది. ఆ  టీడీపీ కార్పొరేటర్ ఇప్పుడు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో ఉన్నారు. దీంతో తాడిపత్రిలో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


డ్రైనేజీ పనుల దగ్గర వివాదం 


అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీలో తెలుగుదేశం అధికారంలో ఉంది. ఎమ్మెల్యేగా వైఎస్ఆర్‌సీపీకి చెందిన కేతిరెడ్డి పెద్దారెడ్డి ( MLA Pedda Reddy ) ఉన్నారు. వేర్వేరు పార్టీలకు చెందిన వారు ఉండటంతో అభివృద్ధి పనుల విషయంలో ఎవరూ ఎవరి మాటా వినడం లేదు. దీంతో పనులన్నీ ఎక్కడివక్కడ ఉండిపోతున్నాయి. భూగర్భ డ్రైనేజీకి సంబంధించిన పనులు మధ్యలో ఉండిపోవడంతో  మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి ( JC Prabhakar Reddy ) వాటిని పూర్తి చేయాలని సంకల్పించారు. కానీ అధికారులు సహకరించలేదు. దీంతో తాడిపత్రి ప్రజలు డ్రైనేజీ సమస్యను ఎదుర్కొంటున్నారు.


పనులు జరగకపోవడంతో ప్రైవేటు జేసీబీలతో పనులు ప్రారంభించిన జేసీ వర్గీయులు


సమస్య ఎటూ తేలకపోతూండటంతో మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి కాంట్రాక్టర్‌ను కాదని ప్రైవేటు జేసీబీల  ( JCB ) ద్వారా డ్రైనేజీ పనులుచేపట్టారు. అయితే దీనిపై ఎమ్మెల్యే తనయుడు కేతిరెడ్డి హర్షవర్ధన్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉదయం ఆవేశంతో వచ్చిన ఆయన  టీడీపీ కౌన్సిలర్లపై దాడి చేశారు.  అడ్డు వచ్చిన విలేకరును సైతం తోసేశాడు. హర్షవర్థన్ తో పాటు అతని అనుచరులు కూడా దాడి చేయడంతో 30వ వార్డు కౌన్సిలర్ మల్లికార్జున్ తీవ్రంగా గాయపడ్డారు. తాడిపత్రి ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేసి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు.


ఎమ్మెల్యే తనయుడిపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని డిమాండ్ 


ఎమ్మెల్యే తనయుడు ( MLA Son ) దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలని టీడీపీ కౌన్సిలర్లు ధర్నాకు దిగారు. తమ కౌన్సిలర్‌పై ఎమ్మెల్యే కొడుకు దాడి చేయడాన్ని జేసీ ప్రభాకర్ రెడ్డి తేలికగా తీసుకునే అవకాశం లేకపోవడంతో శాంతిభద్రతల సమస్య ఏర్పడుతుందన్న ఆందోళనలో ప్రజలు ఉన్నారు. కౌన్సిలర్ చికిత్స తీసుకుంటున్న ప్రభుత్వ ఆస్పత్రి వద్ద  బలగాల్ని మోహరించారు. ఈ అంశంపై ఇంకా జేసీ ప్రభాకర్ రెడ్డి స్పందించలేదు. ఎమ్మెల్యే తనయుడిపై కేసు పెట్టాల్సిందేనని టీడీపీ కౌన్సిలర్లు డిమాండ్ చేస్తున్నారు.