Telangana Municipal Elections 2026: మున్సిపోల్స్ ఫలితాలతో రాజకీయాల్లో కీలక మార్పులు ఖాయం - వెనుకబడిన వారికి గడ్డు కాలమే !
Municipal Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు అన్ని పార్టీలకూ అత్యంత కీలకంగా మారాయి. మంచి ఫలితాలు సాధించకపోతే వెనుకబడిపోతామని ఆ పార్టీలు అర్థం చేసుకుంటున్నాయి.

Local polls have become crucial for all parties: తెలంగాణలో ఫిబ్రవరి 11న జరగనున్న మున్సిపల్ ఎన్నికలు కేవలం పట్టణ పరిపాలన కోసమే కాదు, 2028 అసెంబ్లీ ఎన్నికలకు పునాదిగా, రాబోయే పంచాయతీ ఎన్నికలకు రిహార్సల్స్‌గా మారాయి. రాష్ట్రవ్యాప్తంగా 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో జరుగుతున్న ఈ పోరు ఇప్పుడు హస్తం వర్సెస్ కారు మధ్య అత్యంత ప్రతిష్టాత్మకమైన 'సెమీ ఫైనల్'గా మారింది.
పట్టు నిలుపుకునే పంతంలో కాంగ్రెస్
అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన విజయం గాలివాటం కాదని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై ఉంది. ఇటీవలే ముగిసిన పంచాయతీ ఎన్నికల తొలి రెండు దశల్లో కాంగ్రెస్ మద్దతుదారులు సుమారు 4,000 కు పైగా సర్పంచ్ స్థానాలను గెలుచుకుని జోరు మీదున్నారు. అదే ఊపును మున్సిపాలిటీల్లోనూ కొనసాగించి, పట్టణ ఓటర్లు కూడా తమవైపే ఉన్నారని చాటిచెప్పాలని కాంగ్రెస్ భావిస్తోంది. ఇందుకోసం మంత్రులను పార్లమెంటరీ నియోజకవర్గాల ఇన్‌ఛార్జులుగా నియమించి క్షేత్రస్థాయిలో వ్యూహాలు రచిస్తోంది.
పుంజుకోవాలని ఆరాటపడుతున్న బీఆర్ఎస్
అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత కుంగుబాటులో ఉన్న బీఆర్ఎస్, ఈ మున్సిపల్ ఎన్నికలను పునర్వైభవానికి మార్గంగా చూస్తోంది. పంచాయతీ ఎన్నికల్లో దాదాపు 1,800 స్థానాలను గెలుచుకుని తాము ఇంకా క్షేత్రస్థాయిలో బలంగానే ఉన్నామని కేడర్‌లో ధైర్యాన్ని నింపింది. పట్టణ ప్రాంతాల్లో కేసీఆర్ హయాంలో జరిగిన అభివృద్ధిని, ప్రస్తుత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. ఈ ఎన్నికల్లో ఆశించిన ఫలితాలు రాకపోతే పార్టీ మనుగడ ప్రశ్నార్థకమవుతుందనే ఆందోళన గులాబీ శ్రేణుల్లో కనిపిస్తోంది.
ఆరు గ్యారెంటీలు - గెలుపు గుర్రాలా?
మున్సిపల్ ఓటర్ల తీర్పులో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'ఆరు గ్యారెంటీలు' కీలక పాత్ర పోషించనున్నాయి. ఉచిత బస్సు ప్రయాణం, మహాలక్ష్మి పథకం, గృహజ్యోతి వంటి పథకాల లబ్ధిదారులు పట్టణాల్లోనే ఎక్కువగా ఉన్నారు. అయితే, రుణమాఫీ అమలులో జాప్యం, రైతు భరోసాపై సందిగ్ధతను బీఆర్ఎస్ అస్త్రంగా మలచుకుంటోంది. ఈ పథకాల వల్ల తమ జీవితాల్లో మార్పు వచ్చిందని ఓటర్లు భావిస్తే కాంగ్రెస్ గెలుపు నల్లేరుపై నడకే, లేదంటే 'యాంటీ ఇంకంబెన్సీ' సెగ తగిలే అవకాశం ఉంది. ప్రస్తుతం మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వచ్చే ఎన్నికలపై నేరుగా ప్రభావం చూపుతాయి. .
బీజేపీ కూడా గట్టి అంచనాలే పెట్టుకుంది!
బీజేపీ ఈ మున్సిపల్ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని, కాంగ్రెస్, బీఆర్ఎస్‌లకు ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు వ్యూహాలు రచిస్తోంది. ముఖ్యంగా ఉత్తర తెలంగాణా జిల్లాల్లో ఆ పార్టీకి ఉన్న బలమైన ఓటు బ్యాంకు, ఇటీవల పార్లమెంట్ ఎన్నికల్లో సాధించిన ఎంపీ స్థానాల ప్రభావం పట్టణ ఓటర్లపై బలంగా ఉంటుందని అంచనా వేస్తోంది. వికసిత్ తెలంగాణ బీజేపీ సంకల్ప పత్రం 2026 పేరుతో విడుదల చేసిన మేనిఫెస్టోలో ఆస్తి పన్నులు పెంచబోమని, అవినీతి రహిత పాలన అందిస్తామని ఇచ్చిన హామీలు మధ్యతరగతి ఓటర్లను ఆకట్టుకునేలా ఉన్నాయి. నిజామాబాద్, కరీంనగర్ వంటి నగరాలతో పాటు ఆదిలాబాద్, మహబూబ్ నగర్ వంటి ప్రాంతాల్లో బీజేపీకి గణనీయమైన విజయావకాశాలు ఉన్నాయని, కనీసం 30% వార్డుల్లో కాషాయ జెండా ఎగురవేయాలని ఆ పార్టీ లక్ష్యంగా పెట్టుకుంది.
పట్టణ ఓటర్లలో పలుకుబడి నిలబెట్టుకున్న పార్టీలు మరింత ధైర్యంగా రాజకీయాలు చేయబోతున్నాయి. దెబ్బతిన్న పార్టీలు మాత్రం కొత్త వ్యూహాలతో ప్రయత్నాలు చేయాల్సిందే.



















