Independence Day 2022 :  దేశం మొత్తం కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో " అజాదీ కా అమృత్ మహోత్సవ్" పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. కానీ తెలంగాణలో మాత్రం ఆ పేరు ఇక పెద్దగా వినిపించదు. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరపున కేసీఆర్ కొత్త పేరును తెర ముందుకు తెచ్చారు. "స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ "  పేరుతో వేడుకలు నిర్వహించాలని నిర్ణయించారు.  దేశ స్వాతంత్య్రం సాధించి 75 సంవత్సరాలు అయినందున   15 రోజుల పాటు  రోజు వారీగా వేడుకలు నిర్వహిస్తారు. ఈ "స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ " వేడుకపై సీఎం కేసీఆర్ స్వయంగా సమీక్ష జరిపారు. 


తెలంగాణలో  "స్వతంత్ర భారత వజ్రోత్సవ ద్వి సప్తాహ " పేరుతో వేడుకలు !


తెలంగాణ  ప్రభుత్వ ఆధ్వర్యంలో ఆగస్టు 8-22 వరకు ఉత్సవాలను నిర్వహించేందుకు ఎంపీ కే.కేశవరావు నేతృత్వంలో ఇప్పటికీ కమిటీ వేశారు.  8న హెచ్‌ఐసీసీలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఉత్సవాలను ప్రారంభిస్తారున. ఆగస్టు 22న ఎల్బీస్టేడియంలో భారీ ఎత్తున ముగింపు వేడుకలు జరుగుతాయి.  ఆగస్టు 15న రాష్ట్రవ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండా ఎగురవేయించాలని  దీని కోసం ప్రభుత్వం కోటి జెండాలు తయారు చేయించి ఇంటింటికీ పంపిణీ చేయాలని నిర్ణయించారు. ‘భారత స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో నింపేందుకు, అమరవీరుల త్యాగాలను భవిష్యత్తు తరానికి తెలియజేసేందుకు వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. 


కేంద్రంతో సంబంధం లేకుండా ప్రత్యేకంగా కార్యక్రమాలు


స్వతంత్ర భారత వజ్రోత్సవాల ద్విసప్తాహం నిర్వహణకు ప్రత్యేక చిహ్నాన్ని తెలంగాణ ప్రభుత్వం రూపొందించింది. జాతీయ చిహ్నంలోని అశోకచక్రం, రాష్ట్ర అధికారచిహ్నంలోని కాకతీయతోరణం, త్రివర్ణపతాకం మిళితమయ్యేలా దీనిని తయారు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దీనిని త్వరలో విడుదల చేయనున్నారు. ప్రజా ప్రతినిధులతో పాటు, ప్రభుత్వ కార్యదర్శులు సహా ఉన్నతాధికారులు వారి వారి లెటర్‌ ప్యాడ్లమీద జాతీయపతాకంతో కూడిన స్వతంత్ర భారత వజ్రోత్సవాల లోగోను ముద్రించుకోవాలని, ప్రచారమాధ్యమాలు సైతం పక్షం రోజుల పాటు ఈ చిత్రం ప్రదర్శించాలని ప్రభుత్వం కోరనుంది.


ఇంటింటికి జాతీయ జెండా సరఫరా చేయనున్న తెలంగాణ సర్కార్ 


అయితే మోదీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన అజాదీ కా అమృత్ మహోత్సవ్‌కు పోటీగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారన్న అభిప్రాయం సహజంగానే అందరికీ కలుగుతోంది. అన్ని రాష్ట్రాలు అజాదీ కా అమృత్ మహోత్సవ్‌ పేరుతోనే నిర్వహిస్తున్నాయి. కానీ తెలంగాణ సర్కార్ పేరు మార్చి కేంద్రం ఊసు లేకుండా సొంతంగా నిర్వహిస్తోంది. ప్రత్యేకంగా ఓ లోగో కూడా రిలీజ్ చేయాలని నిర్ణయించడం.. దాన్నే సోషల్ మీడియా డీపీలుగా పెట్టుకోవాలని సూచించే చాన్స్ ఉండటంతో కేంద్రానికి పోటీగానే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లుగా భావిస్తున్నారు.