Telangana Leaders Affidavit : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల(Telangana Assembly Elections 2023) సందర్భంగా నామినేషన్ల(Namination) ప్రక్రియ జోరందుకుంది. బుధవారం ప్రధాన పార్టీలకు చెందిన అభ్యర్థులు భారీ సంఖ్యలో అఫిడవిట్లు సమర్పించారు. బీఆర్ఎస్ (BRS Party), కాంగ్రెస్‌ (Congress Party), ఇతర పార్టీ సీనియర్‌ నాయకులు నామినేషన్లు వేశారు. ఈ సందర్భంగా తమ ఆస్తులు, కేసుల వివరాలను వెల్లడించారు. మేడ్చల్‌ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి (Malla Reddy) తనకు రూ.95 కోట్లకుపైగా ఆస్తులున్నట్టు పేర్కొన్నారు. 


తన పేరుమీద రూ.41,40,10,776, తన భార్య కల్పనకు రూ.38,69,25,565, డిపెండెంట్‌ పేరుమీద రూ.10,14,72,400 స్థిరాస్తులున్నాయని... తమ చరాస్తుల విలువ 5,70,64,666గా పేర్కొన్నారు. వివిధ బ్యాంకుల్లో అప్పులు రూ.7.5కోట్లున్నాయని తెలిపారు. ఒక్క రూపాయి నగదు లేదని, కారు కూడా లేదని అఫిడవిట్లో పొందుపరిచారు. పలు చోట్ల భూములు, వాణిజ్య భవనాలు ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు.


కరీంనగర్‌ నుంచి పోటీచేస్తున్న మంత్రి గంగుల కమలాకర్‌ (Gangula Kamalakar) రూ.34.08కోట్ల విలువైన ఆస్తులున్నట్లు అఫిడవిట్‌లో తెలిపారు. ఇందులో దాదాపు రూ.7 కోట్ల విలువైన బంగారు వజ్రాభవరణాలు ఉన్నాయి. మొత్తంగా రూ.11.53 కోట్ల చరాస్తులు మంత్రి పేర ఉండగా.. ఆయన సతీమణి పేరిట రూ.7.87 కోట్ల ఆస్తి ఉన్నట్లు అఫిడవిట్‌లో పేర్కొన్నారు. తన పేరు మీద స్థిరాస్తుల విలువ రూ.13.97 కోట్ల వరకు ఉన్నట్లు తెలిపారు. భార్య పేరిట రూ.82.70 లక్షల విలువైన 5 ఎకరాల వ్యవసాయ భూములున్నట్లు పేర్కొన్నారు. రూ.50.63 లక్షల అప్పులు ఉన్నట్లు వెల్లడించారు. 


ఖైరతాబాద్‌ అభ్యర్థిగా దానం నాగేందర్‌ (Danam Nagender) వద్ద ఉన్న వజ్రాల విలువ రూ.6.68 కోట్లుగా ప్రకటించారు. మూడు కిలోల బంగారం, 54.17 ఎకరాల వ్యవసాయభూములు ఉన్నాయని వివరించారు. అడ్వాన్సులు, అప్పులు కలిపి రూ.49.55 కోట్లు ఉందని పేర్కొన్నారు. పాలేరు అభ్యర్థిగా పోటీచేస్తున్న కందాల ఉపేందర్‌రెడ్డి (Kandala Upender Reddy)రూ.89.57 కోట్ల విలువైన ఆస్తులు ఉన్నట్లు పేర్కొన్నారు. భార్యపేరిట 82 లక్షల విలువైన షేర్లు ఉన్నట్లు పేర్కొన్నారు. మహబూబాబాద్‌ అభ్యర్థి శంకర్‌నాయక్‌(Shankar Naik) మొత్తం ఆస్తుల విలువ రూ.21.06 కోట్లుగా ప్రకటించారు. తన కుటుంబానికి 52.23 ఎకరాల వ్యవసాయభూమి, వాణిజ్య భవనాలు ఉన్నాట్లు తెలిపారు. 


మధిర కాంగ్రెస్‌ అభ్యర్థి భట్టివిక్రమార్క(Mallu Bhatti Vikramarka) తన అఫిడవిట్‌లో రూ.8.12 కోట్ల ఆస్తులున్నాయని, అప్పులేవీ లేవని తెలిపారు. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ (Akbaruddin Owaisi) తనపై మొత్తం 6 కేసులు ఉన్నాయని, రూ.18.77 కోట్ల ఆస్తులు, రూ.5.99కోట్ల అప్పులు ఉన్నాయని అఫిడవిట్‌లో పేర్కొన్నారు. నాగర్‌కర్నూలు బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి జనార్దన్‌రెడ్డికి రూ.112.23 కోట్లు ఆస్తులున్నాయి. కోరుట్ల బీజేపీ అభ్యర్థిగా పోటీచేస్తున్న ధర్మపురి అర్వింద్‌ తనపై 17 కేసులతోపాటు రూ.107.43 కోట్ల ఆస్తులున్నాయని వెల్లడించారు.


సనత్‌నగర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి కోట నీలిమ మొత్తం ఆస్తుల విలువ రూ.54.75కోట్లుగా ప్రకటించారు. ఇందులో 8.01 కిలోల బంగారు ఆభరణాలు, నాణేలు ఉన్నాయి. రాజస్థాన్‌లో 10.15 ఎకరాల వ్యవసాయభూమి, ఇల్లు ఉందని అఫిడవిట్‌లో తెలిపారు. వనపర్తి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీచేస్తున్న తుడి మేఘారెడ్డి కుటుంబానికి రూ.23.25కోట్ల ఆస్తులున్నట్లు ప్రకటించారు. ములుగు కాంగ్రెస్‌ అభ్యర్థి సీతక్క రూ.82 లక్షల ఆస్తులతో పాటు గృహరుణం రూ.24.74 లక్షలు ఉందని పేర్కొన్నారు.  


నేడు నామినేషన్లు వేయనున్న కేసీఆర్, హరీష్ రావు
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, ఆ పార్టీ అగ్రనేత తన్నీరు హరీశ్​రావు గురువారం నామినేషన్లు దాఖలు చేయనున్నారు. కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి రెండు చోట్ల నామినేషన్ వేయనున్నారు. సిద్దిపేట ఆర్డీవో కార్యాలయంలో మంత్రి తన్నీరు హరీశ్​రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు. ఈనెల 28న గజ్వేల్ లో కేసీఆర్ ఎన్నికల ప్రచార ముగింపు సభ ఏర్పాటు చేస్తున్నట్లు పార్టీ నాయకులు తెలిపారు. 2014, 2018లో గజ్వేల్ లో ముగింపు సభ నిర్వహించారు. అదే ఆనవాయితీని కేసీఆర్ కొనసాగించబోతున్నట్లు తెలిసింది. 


రేపటితో ముగియనున్న గడువు 
నామినేషన్లకు శుక్రవారంతో గడువు ముగియనుంది. దీంతో అభ్యర్థులు గురువారం నామినేషన్లు వేసేందుకు రెడీ అవుతున్నారు. నామినేషన్ల దాఖలులో బీఆర్ఎస్ అభ్యర్థులు ముందంజలో ఉన్నారు. బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థుల ప్రకటనే ముగియలేదు. 11 స్థానాల్లో బీజేపీ, 4 స్థానాల్లో కాంగ్రెస్‌ అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. కాంగ్రెస్‌ పార్టీ సూర్యాపేట, తుంగతుర్తి, మిర్యాలగూడ, చార్మినార్‌ స్థానాలకు అభ్యర్థులను పెండింగ్‌లో పెట్టింది. కొన్ని చోట్ల ఒకే పార్టీ నుంచి డబుల్‌ నామినేషన్లు దాఖలవుతున్నాయి. నర్సాపూర్‌లో బుధవారం ఆవుల రాజిరెడ్డి, గాలి అనిల్‌కుమార్‌ నామినేషన్‌ వేశారు.