CM Revanth Requested To Sonia: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించిన కాంగ్రెస్‌ పార్టీ... పార్లమెంట్‌ ఎన్నికలకు (Parliament Elections) సిద్ధమవుతోంది. అంతేకాదు... కాంగ్రెస్‌ అగ్రనేత సోనియా గాంధీని ఎలాగైనా తెలంగాణ నుంచి ఎంపీగా పోటీచేయించాలనే ధృడనిశ్చయంతో ఉంది. ఈ క్రమంలో... ఢిల్లీ (Delhi) పర్యటనకు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి (Revanth reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క (Bhatti Vikramarka), మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి (Ponguleti Srinivas Reddy)‌... సోమవారం (ఫిబ్రవరి 5వ తేదీ) AICC మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో భేటీ అయ్యారు. సుమారు అరగంట పాటు సమావేశమయ్యారు. తెలంగాణలో పరిస్థితిని ఆమెకు వివరించారు. రాష్ట్రంలో అమలవుతోన్న సంక్షేమ పథకాల గురించి కూడా సోనియా గాంధీ (Sonia Gandhi)కి వివరించారు. తెలంగాణ ఇచ్చిన త‌ల్లిగా....రాష్ట్ర ప్రజలకు ఆమెను గుర్తిస్తున్నారని చెప్పారు. కనుక... తెలంగాణ నుంచి ఎంపీగా పోటీచేయాలని ప్రత్యేకంగా కోరారు. సీఎం రేవంత్‌రెడ్డి స్పెషల్ రిక్వెస్ట్‌కు స్పందించిన సోనియా గాంధీ... సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటానని చెప్పినట్లు చెలిసింది. సోనియా గాంధీ... ఒకవేళ తెలంగాణ నుంచి ఎంపీగా పోటీచేయాలనుకుంటే... ఆమె ఏ నియోజకవర్గం నుంచి నుంచి పోటీ చేస్తారు అన్నది ఉత్కంఠగా మారుతోంది. 


తెలంగాణలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తొలిసారి సోనియా గాంధీని కలిశామని అన్నారు డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార్క. లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయాలని సోనియాగాంధీని కోరామన్నారు. ఈ విషయంలో ఇప్పటికే రాష్ట్ర పార్టీ నుంచి తీర్మానం చేసి పంపినట్టు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. రాష్ట్రంలో అమలు చేసిన, చేయబోతున్న గ్యారెంటీలను సోనియాగాంధీకి వివరించామని చెప్పారు. మహిళలకు ఉచిత బస్సు పథకం మంచి ఫలితాలను ఇస్తోందని.. గత రెండు నెలల్లో 15కోట్ల జీరో టికెట్లు రికార్డ్ అయినట్లు సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లామన్నారు. త్వరలోనే మరో రెండు గ్యారెంటీలు అయిత.. 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ అమలు చేయనున్నట్లు తెలిపారు. ఇక... రాష్ట్రంలో మొదటిసారి రూపొందిస్తున్న హెల్త్ ప్రొఫైల్ గురించి కూడా సోనియాకు వివరించామన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పథకాల అమలు తీరును సోనియా హర్షించారని.. తమను అభినందించారని చెప్పారు.


ముఖ్యంగా... పార్లమెంట్ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ. రాష్ట్రంలోని 17 స్థానాల్లో కనీసం 12 ఎంపీ సీట్లు గెలవాలని టార్గెట్‌గా పెట్టుకుంది. ఈ విషయాన్ని కూడా సోనియా గాంధీ దృష్టికి తీసుకెళ్లారు సీఎం రేవంత్‌రెడ్డి. అత్యధిక స్థానాలు గెలుచుకునేందుకు తీవ్రంగా కృషిచేస్తామని చెప్పారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో గెలుపునకు అన్ని రకాలుగా సన్నాహాలు చేస్తున్నట్టు వివరించారు. ఇందులో భాగంగానే... ప్రతి లోక్‌స‌భ నియోజ‌క‌వ‌ర్గంలో ఆశావాహుల నుంచి ద‌ర‌ఖాస్తులు  స్వీక‌రించామ‌ని తెలిపారు. వచ్చిన దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించి... బ‌ల‌మైన అభ్యర్థులను ఎంపిక చేస్తామ‌ని సోనియా గాంధీకి వివ‌రించారు.


ఇక.. ఢిల్లీ పర్యటనకు వెళ్లిన సీఎం రేవంత్‌రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి... ముందుగా ఝార్ఖండ్‌లో జరగుతున్న రాహుల్ గాంధీ భారత్ న్యాయ్ యాత్రలో పాల్గొన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం  అమ‌లు చేస్తున్న రెండు గ్యారంటీ పథకాలు అయిన మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సు ప్రయాణం, రాజీవ్ ఆరోగ్య శ్రీ పరిమితి పెంపు గురించి రాహుల్‌కు వివరించారు. పార్లమెంట్ ఎన్నికల్లో సత్తా చాటుతామని.. సోనియా గాంధీని తెలంగాణ నుంచి పోటీ చేసేలా ఒప్పించాలని రాహుల్‌ గాంధీని విజ్ఞప్తి చేశారు.