Rahul At Medigadda: భూపాలపల్లి జిల్లాలోని మేడిగడ్డ బ్యారేజ్‌ను కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ పరిశీలించారు. బ్యారేజ్‌పైకి మీదుకు వెళ్లి.. ఎక్కడెక్కడ కుంగింది.. ఎక్కడెక్కడ పగుళ్లు వచ్చాయి అన్నది పరిశీలించారు. ఆ సమయంలో.. కాంగ్రెస్‌ నేతలు వేలాదిగా బ్యారేజ్‌ దగ్గరకు చేరుకున్నారు. పోలీసులు ఏర్పాటు చేసిన  బారికేడ్లు తోసుకుని బ్యారేజ్‌పైకి వెళ్లేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో పోలీసులు-కాంగ్రెస్‌ శ్రేణుల మధ్య తోపులాట జరిగింది. కాంగ్రెస్‌ శ్రేణులను పోలీసులు చెదరగొట్టారు.


మేడిగడ్డ బ్యారేజ్‌లో కుంగిన పిల్లర్లను పరిశీలించారు రాహుల్‌గాందీ. ఆయనతోపాటు రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, శ్రీధర్‌బాబు ఉన్నారు. మేడిగడ్డ ప్రాజెక్టును పరిశీలించిన తర్వాత... హైదరాబాద్‌ వెళ్లారు రాహుల్‌ గాంధీ. మేడిగడ్డ బ్యారేజీ పరిశీలనకు ముందు.. అంబటిపల్లిలో మహిళా సదస్సులో పాల్గొన్నారు రాహుల్‌ గాంధీ. కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అవినీతి చేసిందని ఆరోపించారు రాహుల్‌. లక్ష కోట్ల రూపాయలతో కాళేశ్వరం కట్టామని గొప్పలు చెప్పుకున్న... కేసీఆర్‌ సర్కార్‌ అవినీతి, డొల్లతనం మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ల కుంగుబాటుతో బట్టబయలైందని మండిపడ్డారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణానికి కేటాయించిన డబ్బులు ఆ ప్రాజెక్టు నిర్మాణం కోసమే పూర్తిగా ఖర్చు పెట్టి ఉంటే.. ఇలా పిల్లర్లు కుంగిపోయేవి కావని అన్నారాయన. ప్రాజెక్టుకు కేటాయించిన లక్ష కోట్లలో సగం డబ్బులను దోపిడీ చేశారని ఆరోపించారు. నాసిరకంగా నిర్మాణం చేయడం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్లు కుంగిపోయాయని అన్నారు.


ఆధునిక టెక్నాలజీ లేకపోయినా.. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో నిర్మాణం చేసిన శ్రీశైలం, నాగార్జునసాగర్, జూరాల నెట్టెంపాడు, బీమా వంటి ప్రాజెక్టులు నేటికీ పటిష్టంగా ఉన్నాయన్న రాహుల్‌ గాంధీ.... కాళేశ్వరం నిర్మించి పట్టుమని పది రోజులు కాకముందే కుంగివడం బాధాకరమన్నారు. చిన్నపాటి వర్షాలకే మేడిగడ్డ బ్యారేజీ కుంగితే భారీ వరదలు వస్తే ఎలా తట్టుకుంటుందని ప్రశ్నించారాయన. కాలేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఏటీఎంగా మారిందని చెప్తున్న ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా ఎందుకు చర్యలు తీసుకోలేదని నిలదీశారు రాహుల్‌ గాంధీ. 


ఒక చిన్న ఇల్లు నిర్మించాలన్నా ఇంజనీర్‌తో డిజైన్‌ చేసుకుంటామని... అలాంటిది లక్ష కోట్ల రూపాయలతో నిర్మాణం చేసిన కాళేశ్వరం ప్రాజెక్టుకు సీఎం కేసీఆర్ ఎలా డిజైన్ చేస్తారని ప్రశ్నించారు రాహుల్‌ గాంధీ. ఇంజనీర్లు చేయాల్సిన పనిని ఇంజనీర్లతో చేయించి ఉంటే... ఇలాంటి పరిస్థితి వచ్చి ఉండేది కాదని విమర్శించారు. సీఎం కేసీఆర్ డిజైన్  చేస్తే.... ప్రాజెక్టుకు ప్రమాదం పొంచి ఉంటుందని కాంగ్రెస్ పార్టీ ముందే చెప్పిందని... ఇప్పుడు అదే జరిగిందని అన్నారు.


ఎన్నికలు దొరల తెలంగాణ-ప్రజల తెలంగాణకు మధ్య జరుగుతున్నాయన్నారు  రాహుల్‌ గాంధీ. లక్ష కోట్ల తెలంగాణ సంపద దోపిడీకి గురైంది.. కాళేశ్వరం ప్రాజెక్టు కేసీఆర్‌కు,  ఆయన కుటుంబానికి ఏటీఎంగా మారిందని అన్నారు. రాష్ట్ర సంపదను దోచుకుని తెలంగాణలో ప్రతీ కుటుంబంపై అప్పుల భారం మోపారని విమర్శించారు. కేసీఆర్ దోచుకున్న  సొమ్మును తిరిగి ప్రజలకు చేరేలా చేస్తామన్నారు రాహుల్ గాంధీ. అందుకే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే మహాలక్ష్మి పథకం ద్వారా ప్రతీ మహిళకు నెలకు రూ.2,500  అందించబోతున్నామన్నారు. మోడీ, కేసీఆర్ పాలనలో సిలిండర్ ధర రూ.12వందలకు చేరిందని... తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రూ.500లకే గ్యాస్ సిలిండర్  అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పిస్తామన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌, ఎంఐఎం కలిసి పనిచేస్తున్నాయి.. అందుకే కాంగ్రెస్‌ను  గెలిపించి ప్రజా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోవాలని కోరారు రాహుల్‌.