TamilNadu Politics: మళ్లీ తమిళనాట సనాతన మంట పెట్టిన ఉదయనిధి - అందుకుంటున్న బీజేపీ - అరవ రాజకీయం మారుతోందా?
Sanatana Dharma Politics: తమిళనాడు రాజకీయాల్లో సనాతన ధర్మం చుట్టూ సాగుతున్న వివాదం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది. ఉదయనిధి అసెంబ్లీ సమావేశాల్లో ఆయన చేసిన వ్యాఖ్యలకు బీజేపీకి ఓ అవకాశంగా మారాయి.

Dravidian Ideology Vs Sanatana Dharma: తమిళనాడు రాజకీయాలు ఇప్పుడు ద్రవిడ సిద్ధాంతం నుంచి మతపరమైన ధ్రువీకరణ వైపు వేగంగా మళ్లుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్ అసెంబ్లీ వేదికగా సనాతన ధర్మ నిర్మూలన గురించి చేసిన తాజా వ్యాఖ్యలు రాష్ట్రంలో అగ్గి రాజేస్తున్నాయి. గతంలో బయట చేసిన వ్యాఖ్యలకు, ఇప్పుడు అధికారికంగా అసెంబ్లీ రికార్డుల్లో చేరేలా మాట్లాడటానికి చాలా తేడా ఉందని భావిస్తున్నారు. డీఎంకే తన కోర్ నాస్తిక, ద్రవిడ ఓటు బ్యాంకును కాపాడుకోవడానికి ఈ వ్యూహాన్ని అనుసరిస్తుండగా, ఇది పరోక్షంగా బీజేపీకి తమిళ గడ్డపై బలపడటానికి కావాల్సిన గ్రౌండ్ సిద్ధం చేస్తోంది.
తమిళనాడులో సనాతనంపై విస్తృత చర్చ
సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా తమిళనాడులో నిరసన జ్వాలలు ఎగిసిపడ్డాయి. బీజేపీ నాయకురాలు, నటి ఖుష్భూ సుందర్ ఈ అంశంపై తీవ్రంగా స్పందించారు. "సనాతన ధర్మాన్ని నిర్మూలిస్తామనడం కోట్లాది మంది హిందువుల ఉనికిని ప్రశ్నించడమేనని, ఒక మతాన్ని లక్ష్యంగా చేసుకుని విద్వేషం చిమ్మడం డీఎంకే దిగజారుడు రాజకీయాలకు పరాకాష్ట అని ఆమె మండిపడ్డారు. కేవలం రాజకీయ నాయకులే కాకుండా, ప్రముఖ ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు మరియు వివిధ హిందూ సంఘాల నేతలు కూడా ఈ వివాదంలో గొంతు కలిపారు. సనాతన ధర్మం అనేది ఒక జీవన విధానమని, దానిని అంతం చేయడం ఎవరి తరం కాదని పలువురు పీఠాధిపతులు పేర్కొన్నారు.
విజయ్ వ్యూహాత్మక మౌనం.. ఇరకాటంలో టీవీకే
ఈ వివాదంలో అందరి దృష్టి ఇప్పుడు తమిళ వెట్రి కజగం అధినేత విజయ్ మీద ఉంది. ఇటీవల తన పార్టీ సిద్ధాంతాలను ప్రకటిస్తూ ఆధ్యాత్మిక రాజకీయాల గురించి ప్రస్తావించిన విజయ్, ఇప్పుడు ఉదయనిధి వ్యాఖ్యలపై మౌనం వహించడం చర్చనీయాంశమైంది. అటు హిందూ ఓటర్లను దూరం చేసుకోలేక, ఇటు ద్రవిడ ముద్రను వదులుకోలేక విజయ్ సతమతమవుతున్నట్లు కనిపిస్తోంది. మేము హిందూ వ్యతిరేకులం కాదు, కేవలం విభజన రాజకీయాలకే వ్యతిరేకం అని టీవీకే ఇస్తున్న వివరణలు క్యాడర్‌లో అయోమయాన్ని సృష్టిస్తున్నాయి. ఈ మౌనం విజయ్‌కు భవిష్యత్తులో నష్టం చేకూరుస్తుందని, స్పష్టమైన స్టాండ్ తీసుకోకపోతే బీజేపీ ఆ స్థానాన్ని ఆక్రమిస్తుందని విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
అన్నామలై సనాతన అస్త్రం
బీజేపీ నేత అన్నామలై ఈ అవకాశాన్ని ఏమాత్రం వదులుకోవడం లేదు. ఉదయనిధి వ్యాఖ్యలను హిందూ ధర్మంపై దాడిగా చిత్రీకరిస్తూ ఆయన ఎదురుదాడి చేస్తున్నారు. ప్రజల విశ్వాసాలను కించపరచడమే డీఎంకే పనిగా పెట్టుకుంది అని అన్నామలై చేస్తున్న విమర్శలు సామాన్య భక్తులలోకి బలంగా వెళ్తున్నాయి. ముఖ్యంగా గ్రామీణ తమిళనాడులో ఉన్న భక్తి భావనను ఓట్లుగా మార్చుకునేందుకు బీజేపీకి ఇదొక గోల్డెన్ ఛాన్స్ గా మారింది. గతంలో ఎన్నడూ లేని విధంగా హిందూ ఓటు బ్యాంకు ఏకీకరణ ప్రయత్నాలు తమిళనాట కనిపిస్తున్నాయి. దాదాపుగా అన్ని పార్టీలు సనాతన వ్యతిరేక గొంతుకను వినిపిస్తుంటే, మరోవైపు బీజేపీ ఒక్కటే సింహభాగం హిందూ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. తమిళనాడులో బలపడటానికి ఇదోమంచి అవకాశంగా బీజేపీ భావించే అవకాశం ఉంది.
Before You Go
Telangana Politics: మరో స్థాయికి వెళ్లిన బూతుల పంచాయతీ.. కంట్రోల్ తప్పిన పొలిటీషియన్స్
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















