Tamil Nadu Bypolls: తమిళనాడు ఉపఎన్నికల్లో సీఎం విజయ్‌కు సవాల్ - ఫిరాయింపు ఎమ్మెల్యేలకే టిక్కెట్లు - ప్రజా వ్యతిరేకతను తట్టుకోగలరా?
Dharapuram By Election: తమిళనాడులో రెండు అసెంబ్లీ స్థానాల ఉపఎన్నికలు సీఎం విజయ్‌కు సవాలుగా మారాయి. ఫిరాయింపు ఎమ్మెల్యేలకే అభ్యర్థిత్వం ఇవ్వడంతో ఓటర్లు వ్యతిరేకించే ప్రమాదం కనిపిస్తోంది.

CM Vijay Campaign: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త శకానికి నాంది పలుకుతూ అధికార పీఠాన్ని దక్కించుకున్న తమిళగ వెట్రి కళగం అధినేత, ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్‌కు అనూహ్యమైన పొలిటికల్ ఛాలెంజ్ ఎదురవుతోంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన కొద్ది నెలలకే ధారాపురం, మదురాంతకం స్థానాలకు ఉపఎన్నికలు అనివార్యమవడం, ఆ ఉపఎన్నికల్లో తమ పార్టీకి చెందిన ఫిరాయింపు అభ్యర్థులే బరిలో నిలవడం టీవీకే వర్గాల్లో తీవ్ర కలకలానికి దారితీసింది. స్లీన్ పొలిటికల్ ఫోర్స్ అని చెప్పుకుంటూ అధికారంలోకి వచ్చిన విజయ్, ఇతర పార్టీల ఎమ్మెల్యేలను తమ వైపునకు తిప్పుకుని మళ్లీ ప్రజలపై ఉపఎన్నికల భారాన్ని మోపడంపై స్థానిక ఓటర్లలో అసంతృప్తి వ్యక్తమవుతోంది.
ఫిరాయింపులపై ప్రజా వ్యతిరేకత
ఈ వ్యతిరేకతను , ప్రజల ఆగ్రహాన్ని తొలగించడానికి సీఎం విజయ్ స్వయంగా ప్రచార మైదానంలోకి దిగడం రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ధారాపురం, మదురాంతకం నియోజకవర్గాల్లో నిర్వహించిన భారీ బహిరంగ సభల్లో పాల్గొంటూ నన్ను మీ సొంత కొడుకుగా భావించి ఓటయండి అంటూ విజయ్ నేరుగా ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ప్రతిపక్ష డీఎంకే మరియు ఏఐఏడీఎంకేలు ఈ ఫిరాయింపుల అంశాన్ని ప్రధాన అస్త్రంగా చేసుకుని తీవ్ర స్థాయిలో దాడి చేస్తున్నాయి. ఇటీవల గెలిపించిన ప్రజాప్రతినిధులు పార్టీలు మారి మళ్లీ ఉపఎన్నికలను రుద్దారనే కోపం ఓటర్లలో స్పష్టంగా కనిపిస్తుండటంతో విజయ్ శ్రేణులు ఆందోళన చెందుతున్నాయి.
ఖచ్చితంగా గెలిచి తీరాల్సిన ఎన్నికలు
విజయ్ రాజకీయ భవిష్యత్తుకు , ఆయన క్రేజ్‌కు ఈ ఉపఎన్నికలు అత్యంత కీలకమైన యాసిడ్ టెస్ట్ గా మారాయి. పొరపాటున ఈ రెండు స్థానాల్లో ఫలితాలు తేడా వస్తే , మెజార్టీ గణనీయంగా తగ్గితే.. విజయ్ గాలి తగ్గిపోయింది , సినిమా గ్లామర్ పొలిటికల్ మేజిక్ పనిచేయడం లేదు అంటూ ప్రతిపక్షాలు ముప్పేట దాడికి దిగే అవకాశం ఉంది. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వ స్థిరత్వంపై పెద్దగా ప్రభావం లేకపోయినప్పటికీ, సీఎం ఇమేజ్‌కు రాజకీయంగా ఇది పెద్ద దెబ్బగా పరిణమిస్తుంది. అందుకే ఈ ఉపఎన్నికల ఫలితాలు రాబోయే రోజుల్లో తమిళనాడు పొలిటికల్ నేరేటివ్‌ను మార్చేసే అవకాశం ఉందనే విశ్లేషణలు బలంగా వినిపిస్తున్నాయి.
ఎన్నికలపైనే దృష్టి పెట్టిన విజయ్
దీనిని దృష్టిలో ఉంచుకునే టీవీకే ముఖ్య నాయకులు, ప్లానర్లు అంతా ఈ రెండు ఉపఎన్నికలపైనే పూర్తిస్థాయిలో దృష్టి కేంద్రీకరించారు. పక్కా క్షేత్రస్థాయి వ్యూహాలు, బూత్ స్థాయి నెట్‌వర్క్, భారీ ప్రచార ఆర్భాటంతో ఓటర్ల అసంతృప్తిని తుడిచిపెట్టేందుకు శక్తివంచన లేకుండా శ్రమిస్తున్నారు. ఓటర్లను ఆకట్టుకునేందుకు పార్టీ శ్రేణులు సకల శక్తులు ఒడ్డుతుండగా, ప్రతిపక్షాల విమర్శలను తిప్పికొట్టడమే లక్ష్యంగా ప్రచారాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. తమిళనాడు రాజకీయ రంగస్థలంలో కింగ్ గా అవతరించిన విజయ్‌కు ఈ మొదటి ఉపఎన్నికల పోరు అనుకోని పెద్ద పరీక్షగా మారింది. ఫిరాయింపుల రాజకీయాన్ని తమిళజనం ఆమోదిస్తారా? లేక విజయ్ వ్యక్తిగత క్రేజ్ ముందు ఆ అసంతృప్తి కొట్టుకుపోతుందా? అనేది త్వరలోనే తేలనుంది. హై-స్టేక్స్ పోరుగా మారిన ఈ ఉపసమరం విజయ్ పొలిటికల్ కెరీర్‌లో ఎంతవరకు నిలబడుతుందో వేచి చూడాలి.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















