Tamil Nadu Assembly Election Preparations:   ద్రవిడ రాజకీయాల గడ్డపై 2026 అసెంబ్లీ ఎన్నికల సమరం అప్పుడే మొదలైపోయింది. ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ తన  ద్రవిడ మోడల్  పాలనతో పాటు రాజకీయ చతురతను జోడించి వ్యూహ ప్రతివ్యూహాలు రచిస్తున్నారు. ప్రధాన ప్రతిపక్షం అన్నాడీఎంకేను సంస్థాగతంగా దెబ్బతీయడం, సంక్షేమ పథకాలతో ఓటు బ్యాంకును పదిలపరచుకోవడం, కొత్తగా వస్తున్న రాజకీయ సవాళ్లను ఎదుర్కోవడమే లక్ష్యంగా స్టాలిన్ అడుగులు వేస్తున్నారు.

 అన్నాడీఎంకేకు  పెద్ద షాక్ 

స్టాలిన్ అనుసరిస్తున్న వ్యూహాల్లో అత్యంత కీలకమైంది ప్రత్యర్థి పార్టీలోని అసమ్మతిని క్యాష్ చేసుకోవడం. అన్నాడీఎంకేలో కీలక నేతగా ఉన్న మాజీ ముఖ్యమంత్రి ఓ. పన్నీర్ సెల్వం  ఫిబ్రవరి 27న అధికారికంగా డీఎంకే గూటికి చేరడం తమిళ రాజకీయాల్లో పెను సంచలనంగా మారింది. ఎడ్పాడి పళనిస్వామి   నాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్న వర్గాలను తనవైపు తిప్పుకోవడం ద్వారా అన్నాడీఎంకే ఓటు బ్యాంకును చీల్చాలనేది స్టాలిన్ ప్లాన్. దీనికి తోడు శశికళ కూడా సొంత కుంపటి పెట్టే దిశగా వెళ్తుండటం అన్నాడీఎంకేను మరింత బలహీనపరిచేలా కనిపిస్తోంది.

 మహిళా ఓటర్లపై సంక్షేమ అస్త్రం 

ఎన్నికల్లో కీలకంగా మారే మహిళా ఓటర్లను ఆకట్టుకోవడంలో స్టాలిన్  మేజిక్ చేస్తున్నారు. కలైంజ్ఞర్ మగలిర్ ఉరిమై తిట్టం పథకం ద్వారా ఇప్పటికే కోటి మందికి పైగా మహిళల ఖాతాల్లో నగదు జమ చేస్తున్నారు. తాజాగా ఫిబ్రవరిలో బకాయిలు, ముందస్తు చెల్లింపులు కలిపి ఏకంగా  5,000 మొత్తాన్ని జమ చేయడం ప్రత్యర్థులను విస్మయానికి గురిచేసింది. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చేలోపు మరిన్ని తాయిలాలు ప్రకటించే అవకాశం ఉందన్న ప్రచారం డీఎంకే శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపుతోంది.

విజయ్  ట్విస్ట్ - స్టాలిన్‌కు కొత్త సవాలు 

స్టాలిన్ విజయ యాత్రకు కోలీవుడ్ స్టార్ విజయ్ తన  తమిళగ వెట్రి కళగం పార్టీ ద్వారా ప్రధాన అడ్డంకిగా మారేలా కనిపిస్తున్నారు. సినిమా గ్లామర్‌తో పాటు యువతను అమితంగా ఆకర్షిస్తున్న విజయ్, నేరుగా డీఎంకే అవినీతిపై విమర్శలు ఎక్కుపెట్టడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. ముఖ్యంగా డీఎంకేకు కంచుకోట లాంటి ఉత్తర చెన్నై నుంచే పోటీ చేస్తానని విజయ్ ప్రకటించడం స్టాలిన్‌కు సవాలుగా మారింది. అయితే, విజయ్ కేవలం  సినిమా స్టార్  మాత్రమేనని, క్షేత్రస్థాయిలో డీఎంకే క్యాడర్‌ను ఢీకొట్టడం ఆయనకు సాధ్యం కాదని అధికార పార్టీ ధీమా వ్యక్తం చేస్తోంది.

డిఫెన్స్ నుంచి అటాకింగ్‌లోకి 

స్టాలిన్ ప్రస్తుతానికి  డిఫెన్సివ్  మోడ్ నుంచి  అటాకింగ్ మోడ్‌లోకి వెళ్లారు. బీజేపీని  ఢిల్లీ శత్రువు గా చిత్రీకరిస్తూనే, రాష్ట్రంలో విపక్షాలను ముక్కలు చేయడంలో విజయం సాధిస్తున్నారు. అన్నాడీఎంకే చీలికలు, సంక్షేమ పథకాల వర్షం, పటిష్టమైన కూటమి - ఈ మూడు అంశాలే స్టాలిన్‌ను రెండోసారి సీఎం పీఠంపై కూర్చోబెడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే, విజయ్ ఇచ్చే  ట్విస్ట్ ' క్షేత్రస్థాయిలో ఏ మేరకు పని చేస్తుందనేదే ఇప్పుడు అసలైన సస్పెన్స్.