ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ , ఆయనకు చెందిన సంస్థ ఐ ప్యాక్ వైఎస్ఆర్‌సీపీకి ఎలాంటి సేవలు అందించడం లేదని ఆ పార్టీ కీలక నేత, ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ప్రకటించారు. పీకేతో జగన్‌కు వ్యక్తిగతంగా స్నేహం ఉందన్నారు. 2019 ఎన్నికల్లో ఆయన మాతో కలిసి పనిచేశారు. తరువాత ప్రశాంత్ కిశోర్ మాతో పనిచేయడం లేదు. భవిష్యత్‌లో పనిచేసే అవకాశాలు ఉండకపోవచ్చని స్పష్టం చేశారు. వైఎస్ఆర్‌సీపీకి కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకోవాల్సిన అవసరం ఏముందని సజ్జల మీడియా ప్రతినిధుల్ని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఏ పార్టీతోనూ పొత్తు ఉండదని.. ఒంటరిగానే పోటీచేయాలన్నది సీఎం వైఎస్ జగన్ సిద్ధాంతమన్నారు. వైఎస్ఆర్‌సీపీతో పొత్తు పెట్టుకోవాలని చాలా పార్టీలు అనుకోవచ్చు. .కానీ సీఎం జగన్ ఎప్పుడూ పొత్తుల్లేకుండానే రాజకీయం చేస్తున్నారని గుర్తు చేశారు.
ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ పార్టీకి ఇచ్చిన బ్లూ ప్రింట్‌లో పలు రాష్ట్రాల్లో పొత్తులు పెట్టుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్‌కు సూచించారు. ఆ బ్లూ ప్రింట్‌లో ఏపీలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో పొత్తులు పెట్టుకోవాలని సూచించారు. ఆ విషయంపై జాతీయ మీడియాలోనూ విస్తృత ప్రచారం జరిగింది. కానీ వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ మాత్రం స్పందించలేదు. దీంతో కాంగ్రెస్ పార్టీ విషయంలో వైఎస్ఆర్‌సీపీ సానుకూలంగా ఉందన్న అభిప్రాయం ప్రారంభమయింది. పీకే సేవలు వైఎస్ఆర్‌సీపీకి ఇంకా అందుతున్నాయని ఆయన స్ట్రాటజీ మేరకే పొత్తుల విషయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ ముందడుగు వేస్తుందన్న అభిప్రాయాలు వినిపించాయి. స్పందించకపోవడంతో ఇవి పెరిగిపోతున్నాయని గమనించిన వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ పొత్తులపై క్లారిటీ ఇచ్చినట్లుగా తెలుస్తోంది.
రాష్ట్రంలో ఎవరితోనూ పొత్తు పెట్టుకునేది లేదన్న సజ్జల రామకృష్ణారెడ్డి జాతీయ స్థాయిలో పెట్టుకుంటారా లేదా అన్నదానిపై స్పష్టత ఇవ్వలేదు. కానీ ఆ పార్టీకి చెందిన ఇతర నేతలు మాత్రం... రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడే ఏ పార్టీకి అయినా మద్దతిస్తామని చెబుతున్నారు. ప్రత్యేకహోదా ఇస్తామని కాగితంపై సంతకం పెట్టి ఇస్తే మద్దతిస్తామని చెబుతున్నారు. అంటే జాతీయ స్థాయిలో పొత్తుల ఆప్షన్స్‌ను వైఎస్ఆర్ కాంగ్రెస్ ఓపెన్‌గానే పెట్టుకున్నట్లుగా భావిస్తున్నారు.
2019 ఎన్నికల్లో వైఎస్ఆర్‌సీపీ గెలుపులో ప్రశాంత్ కిషోర్ ప్రధాన పాత్ర పోషించారని సీఎం జగన్ ప్రకటించారు. ఆయన వచ్చే ఎన్నికలకూ సేవలు అందిస్తారని గతంలో మంత్రులకు కేబినెట్ భేటీలో చెప్పినట్లుగా ప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు పీకే కానీ ఆయన కంపెనీ ఐ ప్యాక్ కానీ ఎన్నికలకు సేవలు అందించడం లేదని సజ్జల చెప్పడంతో వైఎస్ఆర్‌సీపీ నేతలకూ ఓ క్లారిటీ వచ్చినట్లయింది.