Sajjala Comments :  ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ము మాయంపై అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ప్రభుత్వ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి విమర్శించారు. మళ్లీ అధికారంలోకి రాలేమనే  తెలుగుదేశం పార్టీ నిరాశ, నిస్పృహతో  వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మీద అడ్డగోలుగా కుట్రలు, కుతంత్రాలతో  విషం చిమ్ముతోందని ఆయన ఆరోపించారు.  ప్రతిపక్షంలో ఉండటం అంటే ఎవరికైనా అదే ముగింపు కాదు. మళ్లీ అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేయాలి. ప్రజాస్వామ్యంలో అది సహజం. అందుకోసం అనుసరించాల్సిన సంప్రదాయ పద్ధతులు ఉన్నాయని కనీ టీడీపీ తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు. 


 ఓటరు దేవుడు... చంద్రబాబు నాయుడు, జగన్‌ మోహన్‌ రెడ్డిగారు, టీడీపీ, వైయస్సార్‌ సీపీ తలరాతను నిర్ణయిస్తాడు. ఓటరుకు అప్పీలు చేసే విధంగా ఎన్ని పోరాటలు అయినా చేయవచ్చు. అధికారంలో ఉండి ఉంటే వారి హయాంలో చేసిన మంచి చెప్పవచ్చు. లేదా ఇప్పుడు అధికారంలో ఉన్న ప్రభుత్వ లోపాలను ఎత్తిచూపవచ్చు. అవి ప్రభుత్వ విధానాలు, నైతిక ప్రవర్తన, ప్రభుత్వ పనితీరు, పారదర్శకత, అవినీతి అన్నీ సబ్జెక్ట్‌లు అవుతాయి. ఏవైతే వాస్తవాలు కావో వాటినే తీసుకువచ్చి, ఒక కుట్ర ప్రకారం టీడీపీ ప్రచారం చేయడమే దుర్మార్గం. టీడీపీ వాళ్లు మాట్లాడేదానిలో ఆధారాలు ఉండవు. అన్నీ అభూతకల్పనలు, అవాస్తవాలు. వాటిని  ఒకటికి వందసార్లు, రెండు వందల సార్లు చెప్పుకుంటూ వెళుతున్నారన్నారు.  


2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ, దాన్ని నిలుపుకునేందుకు చంద్రబాబు నాయుడు ఒళ్లు దగ్గర పెట్టుకుని ప్రజలకు చేయాల్సిన వాటిలో వంద శాతం కాకపోయినా, కనీసం పదిశాతం పనులు చేసి మళ్లీ తీర్పు కోరతారేమో అనుకున్నాం. ఇచ్చిన హామీలు అన్నీ తుంగలోకి తొక్కి తాను మారని చంద్రబాబు నాయుడేనని మరోసారి రుజువు చేసుకున్నారు. రైతులకు  లక్షకోట్ల రుణమాఫీ చేస్తానని ఎప్పటిలానే రైతులను మోసం చేశాడన్నారు.  చచ్చీచెడీ అయిదేళ్లలో 14వేల కోట్లు చెల్లించారు. మిగిలిన 600హామీలను తుంగలోకి తొక్కేశారు. చేసిన అప్పులతో పాటు అధికారం నుంచి దిగిపోయేటప్పుడు రూ.4లక్షల కోట్లకు పైగా బకాయిలు పెట్టి వెళ్లిపోయారని ఆరోపించారు. 


 వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిగారు అధికారంలోకి రాగానే మేనిఫెస్టోలో పెట్టిన హామీలు 95శాతం పైగా అమలు చేయడంతో, తన నిబద్ధతను నిరూపించుకున్నారు. చంద్రబాబు నాయుడు గతంలో తాను చేసిన పాపాలకు ప్రాయశ్చిత్తం ప్రకటించడం, భవిష్యత్‌లో అలా ఉండనని చెప్పడం, ఇంతకన్నా భిన్నంగా ఉంటామని చెప్పడం మానేసి... ఈ మూడేళ్లలో తిట్లు, బూతు పురాణాలతో కాలం గడుపుతున్నారు. ఎన్నికలు రావడానికి ఇంకా రెండేళ్లు సమయం ఉంది. దాంతో పిచ్చి పీక్స్‌కి వెళ్లిపోయి చంద్రబాబుతో పాటు ఆయన పార్టీ నాయకులు రోజుకు ఒక అంశాన్ని తెరపైకి తెచ్చి ...  ఎక్కడో మొదలుపెట్టి దాన్ని ఎక్కడికో ముడి పెడుతున్నారు. ఆధారాలతో సహా వస్తారా.. అంటే అదీ లేదని విమర్శించారు. ఉద్యోగుల జీపీఎఫ్ విషయంలో సాంకేతిక తప్పిదం జరిగిందని..  ఉద్యోగుల సొమ్ము తీసుకోవడానతికి అదేమీ మార్గదర్శి చిట్ ఫండ్ కాదన్నారు.