minority government not easy for Vijay : తమిళనాడులో విజయ్ పార్టీ సంపూర్ణంగా విజయం సాధించలేదు. ఆయన టూ బై ధర్డ్ తరహా మెజార్టీ వస్తే తిరుగులేదని అనుకోవచ్చు. కానీ మెజార్టీకి ఇతరుల మీద ఆధారపడాల్సిందే. అంటే మైనార్టీ సర్కార్ ను నడపాలి. ప్రజలు ఇతర పార్టీల కన్నా ఎక్కువగా చాన్స్ ఇచ్చారు కాబట్టి ఆయన సీఎంగా ప్రమాణం చేస్తారు. అయితే అది ముళ్ల కిరీటం లాంటి దే. ఆయనకు ప్రజలు అతిపెద్ద పార్టీగా గౌరవం ఇచ్చారు కానీ, సంపూర్ణ అధికారాన్ని కట్టబెట్టలేదు. రాబోయే ఐదేళ్ల కాలం విజయ్‌కు ఒక నిరంతర అగ్నిపరీక్షగా మారనుంది.
మైనార్టీ ప్రభుత్వ వైకుంఠపాళి
మెజారిటీకి అవసరమైన 118 స్థానాలకు కొద్ది దూరంలో టీవీకే ఆగిపోవడంతో, విజయ్ ఇప్పుడు ఒక మైనార్టీ ప్రభుత్వం నడపక తప్పని పరిస్థితి. స్వతంత్రులు లేదా చిన్న పార్టీల మద్దతుతో ఆయన ప్రమాణ స్వీకారం చేసినా, ప్రతి బిల్లును అసెంబ్లీలో ఆమోదింపజేసుకోవడం ఆయనకు కత్తిమీద సామే అవుతుంది. ద్రవిడ దిగ్గజాలైన డీఎంకే, అన్నాడీఎంకేలు ప్రస్తుతానికి ప్రజా తీర్పును గౌరవిస్తూ మౌనంగా ఉన్నట్లు కనిపించినా, అది తుపాను ముందు ప్రశాంతత మాత్రమే అని గ్రహించాలి.
ద్రవిడ పార్టీల వేచి చూసే ధోరణి
రాజకీయాలు చాలా క్రూరమైనవి. డీఎంకే , అన్నాడీఎంకేలు ఇప్పుడే విజయ్ ప్రభుత్వాన్ని కూల్చడానికి ప్రయత్నించవు. ఎందుకంటే, ప్రజలు ఒక కొత్త మార్పును కోరుకుని విజయ్‌కు అవకాశం ఇచ్చారు. ఇప్పుడే ఆయనను అడ్డుకుంటే ప్రజల్లో ఆయనపై సానుభూతి పెరుగుతుందని ఆ పార్టీలకు తెలుసు. అందుకే, వారు కనీసం రెండేళ్ల పాటు విజయ్ పాలనను నిశితంగా గమనిస్తారు. ఆ సమయంలో విజయ్ చేసే ప్రతి చిన్న తప్పును భూతద్దంలో చూపిస్తూ, ప్రజల్లో ఆయనపై ఉన్న హీరో " ఇమేజ్‌ను డ్యామేజ్ చేసే పనిలో నిమగ్నమవుతారు.
రీల్ హీరో vs రియల్ పర్ఫార్మెన్స్
విజయ్ ఇప్పటి వరకు సినిమాల్లో ఒకే ఒక్క ఫైట్‌తో లేదా ఒక ఎమోషనల్ డైలాగ్‌తో సమస్యలను పరిష్కరించడం చూపిస్తూ వచ్చారు. కానీ రియల్ లైఫ్ లో పరిపాలన అనేది భిన్నమైన అంశం. మేనిఫెస్టోలో ఇచ్చిన భారీ హామీలను అమలు చేయాలంటే వేల కోట్ల నిధులు కావాలి. ఇప్పటికే ఆర్థిక సంక్షోభంలో ఉన్న తమిళనాడును గట్టెక్కించడం, ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడం ఆయనకు అతిపెద్ద సవాలు. అంచనాలు ఆకాశంలో ఉన్నప్పుడు, ఫలితాలు సామాన్యంగా ఉంటే ప్రజల్లో అసహనం చాలా వేగంగా మొదలవుతుంది. ఆ అసహనాన్ని క్యాష్ చేసుకోవడమే ద్రవిడ పార్టీల తదుపరి వ్యూహం.
జమిలి ఎన్నికల ముప్పు
విజయ్ ప్రభుత్వం గనుక ఆశించిన స్థాయిలో రాణించలేకపోతే, కేంద్రం ప్రతిపాదిస్తున్న జమిలి ఎన్నికల అంశం ఆయనకు శాపంగా మారే అవకాశం ఉంది. ఒకవేళ 2029 లోక్‌సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు వచ్చేలా ద్రవిడ పార్టీలు పావులు కదిపితే, విజయ్ తన ఐదేళ్ల కాలాన్ని పూర్తి చేసుకోలేక పోవచ్చు. డీఎంకే, అన్నాడీఎంకేలు తమ క్యాడర్‌ను కాపాడుకుంటూనే, టీవీకే వైపు వెళ్లిన ఓటర్లను మళ్ళీ తమవైపు తిప్పుకునేందుకు లోపాయికారీ ఒప్పందాలు చేసుకున్నా ఆశ్చర్యపోనక్కర్లేదు.
అంచనాల భారమే అతిపెద్ద శత్రువు
విజయ్ కి ఉన్న అతిపెద్ద శత్రువు విపక్షాలు కాదు, ఆయన మీద ప్రజలకు ఉన్న విపరీతమైన అంచనాలే. ఎంజీఆర్ లేదా జయలలిత స్థాయి మేజిక్ ను విజయ్ నుంచి జనం ఆశిస్తున్నారు. పరిపాలనలో ఏమాత్రం తడబడినా, సినిమాలు వేరు, రాజకీయం వేరు అనే ముద్ర ఆయనపై బలంగా పడిపోతుంది. ఒకసారి ప్రజల్లో ప్రతికూల అభిప్రాయం మొదలైతే, దానిని మళ్ళీ మార్చడం అసాధ్యం. అప్పుడు ద్రవిడ పార్టీలు తమదైన రాజకీయం మొదలుపెట్టి, మళ్ళీ రాష్ట్రాన్ని తమ గుప్పిట్లోకి తెచ్చుకుంటాయి.
విజయ్ కి ఇప్పుడు దొరికిన విజయం ఒక సువర్ణావకాశం అలాగే ఒక హెచ్చరిక కూడా. ఆయన మాటల నుంచి చేతల్లోకి మారి, అద్భుతమైన పాలన అందిస్తేనే ఈ ద్రవిడ కూటముల వ్యూహాల నుంచి తప్పించుకోగలరు. లేనిపక్షంలో, తమిళనాడు రాజకీయ చరిత్రలో ఆయన ఒక స్వల్పకాలిక సంచలనం గా మిగిలిపోయే ప్రమాదం ఉంది. రాజకీయ రణక్షేత్రంలో విజయ్ కి అసలైన యుద్ధం ఇప్పుడే మొదలైంది.
