Telangana New Cabinet Aspirants Revanth: పొరుగు రాష్ట్రమైన కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు, ఆ తదుపరి మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ ప్రక్రియ కాంగ్రెస్ హైకమాండ్‌కు మాత్రమే కాకుండా, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కూడా ఒక కీలకమైన పాఠాన్ని నేర్పుతోంది. ముఖ్యమంత్రిగా డి.కె. శివకుమార్ బాధ్యతలు స్వీకరించిన అనంతరం చేపట్టిన కేబినెట్ విస్తరణలో కొత్తవారికి, యంగ్ లీడర్లకు అవకాశం కల్పిస్తూ 19 మందిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పటికీ, బెర్త్‌లు దక్కని సీనియర్ ఎమ్మెల్యేలు రాజీనామా బాట పట్టడం కర్ణాటక కాంగ్రెస్‌లో తీవ్ర అలజడి సృష్టించింది. సీనియర్లు, మాజీ మంత్రులు బహిరంగంగా అసంతృప్తి వెళ్లగక్కడమే కాక, ఎమ్మెల్యే పదవులకూ వీడ్కోలు పలికే వరకు పరిస్థితి దాటిపోవడంతో.. వారిని చల్లార్చేందుకు నామినేటెడ్ పోస్టులు, కార్పొరేషన్ ఛైర్మన్ గిరీలతో సర్దుబాటు చేసేందుకు అధిష్ఠానం తీవ్ర కసరత్తు చేయాల్సి వస్తుంది. 

Continues below advertisement

తెలంగాణలో మరింత కసరత్తు చేయాల్సిందే!

కర్ణాటక పరిణామాలను అత్యంత సమీపంగా పరిశీలించిన తర్వాత, తెలంగాణలో చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న కేబినెట్ విస్తరణ , రేవంత్ రెడ్డి  Gen Z ఆశయాలకు అనుగుణంగా చేయాలనుకుంటున్న మార్పులపై అధిష్ఠానం ఆలోచనా విధానం పూర్తిగా మారింది. తెలంగాణలో ప్రస్తుతం కేబినెట్‌లో ఖాళీగా ఉన్న బెర్త్‌ల భర్తీతో పాటు, కొందరు మంత్రుల శాఖల మార్పు లేదా కుదింపుపై ప్రచారం జరుగుతున్న తరుణంలో.. కర్ణాటక తరహా అసమ్మతి సెగలు హైదరాబాద్‌లో రగులుకోకుండా ఉండేందుకు ముందుజాగ్రత్త చర్యలు అవసరమని రేవంత్ రెడ్డి గ్రహించారని అనుకోవచ్చు. తెలంగాణ కాంగ్రెస్‌లోనూ సీనియర్లు, సీనియర్ రీజినల్ లీడర్లు కేబినెట్ బెర్త్‌ల కోసం తీవ్రస్థాయిలో పోటీపడుతున్నారు. రెడ్డి, బిసి, ఎస్సీ, ఎస్టీ ,  మైనారిటీ సామాజిక వర్గాల నుంచి అనేకమంది ఆశావహులు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ ముమ్మరం చేశారు. రేవంత్ రెడ్డి తన నిర్ణయాల్లో యువ ఎమ్మెల్యేలకు ప్రాధాన్యం ఇవ్వాలని భావిస్తున్నప్పటికీ, దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న సీనియర్లను పూర్తిగా పక్కనబెడితే కర్ణాటకలో మాదిరిగానే ఎమ్మెల్యేల తిరుగుబాటు లేదా సహాయ నిరాకరణ పెరిగే ప్రమాదం ఉందన్న అభిప్రాయం వినిపిస్ోతంది. 

Continues below advertisement

ఆశావహుల కోసం ప్రత్యేక వ్యూహం

ఈ క్రమంలోనే సీఎం రేవంత్ రెడ్డి అండ్ టీమ్ సామాజిక సమతుల్యత + కాంపెన్సేషన్ ప్యాకేజీ వ్యూహాన్ని తెరపైకి తెస్తున్నారు. కేవలం కేబినెట్ బెర్త్‌లు ఇవ్వడమే కాకుండా, పదవులు రాని ముఖ్య నేతలకు ముందే స్పష్టత ఇచ్చి, వారికి పవర్ ఫుల్ నామినేటెడ్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవులు, జిల్లా ఇన్‌ఛార్జ్ బాధ్యతలు, లేదా ప్రభుత్వ సలహాదారు పాత్రలను ఆఫర్ చేయడం ద్వారా ముందస్తుగానే అసంతృప్తికి చెక్ పెట్టాలని భావిస్తున్నారు. సర్దుబాటు ప్రక్రియ కేబినెట్ విస్తరణకు ముందే పూర్తయితే, ప్రమాణ స్వీకారం రోజున డ్రామాలు జరగకుండా నివారించవచ్చనేది కాంగ్రెస్ ప్లాన్. అంతేకాకుండా, సామాజిక సమీకరణల పరంగా ఉమ్మడి జిల్లాల ప్రాతినిధ్యాన్ని దెబ్బతీయకుండా జాగ్రత్త పడుతున్నారు. ఉదాహరణకు ఉమ్మడి నల్గొండ, ఖమ్మం, రంగారెడ్డి జిల్లాల మధ్య కాంబినేషన్ దెబ్బతింటే అది ప్రభుత్వ స్థిరత్వంపై ప్రభావం చూపుతుంది.

జాగ్రత్తలు తీసుకోవాల్సిందే

కర్ణాటకలో డి.కె. శివకుమార్  ఓపిక పడితే అవకాశాలు వస్తాయి  అని సర్దిచెప్పాల్సి వచ్చిన పరిస్థితిని తెలంగాణలో రాకుండా చూడాలంటే.. విస్తరణ రోజునే ఎవరికి ఏ పదవి లభిస్తుందో స్పష్టమైన రోడ్‌మ్యాప్ ప్రకటించడం ఒక్కటే సరైన మార్గమని ఏఐసీసీ భావిస్తోంది. కర్ణాటక కేబినెట్ విస్తరణ గందరగోళం తెలంగాణ కాంగ్రెస్ పాలనకు ఒక ముందస్తు హెచ్చరిక లా పనిచేసింది. కేవలం కొత్తవారికి అవకాశాలు ఇవ్వడం మాత్రమే కాకుండా, పార్టీ పాతకాపులను గౌరవిస్తూ, రాజీనామాల వేడి తగ్గించే సమగ్ర ప్యాకేజీతోనే రేవంత్ రెడ్డి తన కేబినెట్ విస్తరణను పూర్తి చేసే దిశగా అడుగులు వేస్తున్నారు.