Revant Reddy : రేవంత్ రెడ్డి .. రాజకీయాల్లో ఈ పేరంటేనే ఓ ఫైర్ బ్రాండ్. పార్టీ ఏదైనా కానీ.. రేవంత్ పేరు చెబితే.. జనాలకు గుర్తొచ్చేది మాత్రం. రఫ్ అండ్ టఫ్ లీడర్. అలాంటి లీడర్ అందరి ముందరా కంటతడి పెట్టారు. తనపై కుట్రలు జరుగుతున్నాయంటూ ఎమోషనల్ అయ్యారు. ఏ విషయాన్నైనా ఫేస్ టు ఫేస్ తేల్చుకునే రేవంత్ రెడ్డి.. ఎంతకూ బెదరని రేవంత్ రెడ్డి.. బేలగా.. మాట్లాడటం అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఎంతో స్ట్రాంగ్ గా ఉండే రేవంత్ రెడ్డి ఎమోషన్ అయిపోవడం టాపిక్ ఆఫ్ ది తెలంగాణాగా మారింది. తనను అభిమానించే వాళ్లకు, కార్యకర్తలకు, పార్టీ శ్రేణులకు తన మనసులో బాధ చెబుతున్న అంటూ.. రాజకీయంగా తనను దెబ్బతీయడానికి కుట్ర జరుగుతోందని, కొందరు నేతలు సీఎం కేసీఆర్ తో కుమ్మక్కయ్యారంటూ రేవంత్ రెడ్డి ఉద్వేగభరితంగా వ్యాఖ్యలు చేశారు.
రేవంత్ ఎమోషనల్ అవడం వెనుక రాజకీయం ఏమిటి ?
రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర తెలంగాణలోకి ఎంట్రీ ఇవ్వబోతున్న సమయంలో రేవంత్ ఎమోషనల్ స్పీచ్ హాట్ టాపిక్ అయింది. దాదాపుగా రెండు వారాలు రాహుల్ యాత్ర తెలంగాణలో ఉంటుంది. యాత్ర ప్రారంభానికి ముందే... రేవంత్ విషాదరాగం ఆలపించడానికి కారణం ఏంటి..? ఇప్పటికైతే... బీజేపీ టీఆరేఎస్ కుమ్మక్కై.. తనను తొక్కేసి.. తద్వారా.. కాంగ్రెస్ పార్టీని తెంలగాణ గడ్డపై లేకుండా చేయాలని కుట్రపన్నుతున్నాయన్నది రేవంత్ ప్రధాన ఆరోపణ. అయితే ఇది బయట వ్యవహారం మాత్రమే కాదు. ఇంటి లోపల కూడా రచ్చ మామూలుగా లేదు. కాంగ్రెస్ గ్రూపు రాజకీయాలతో రేవంత్ ఏడాదిగా తంటాలు పడుతూ వస్తున్నారు.. రేవంత్ మాటల్లో అర్థాలు వెతికితే.. కారణాలు చాలానే కనిపిస్తున్నాయి.
పాతుకుపోయిన తమను కాదని రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై సీనియర్ల అసంతృప్తి !
గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ లోకి రేవంత్ రావడం.. ఏకంగా పీసీసీ ప్రెసిడెంట్ కూడా అవ్వడం అన్నది కాస్తంత అన్ ప్రెసిడెంట్ ఇష్యూనే. ఎందుకంటే.. శతాబ్దానికి పైగా చరిత్ర ఉన్న ఆ పార్టీలో దశాబ్దాలకు పైగా పాతుకుపోయిన లీడర్లు అనేకమంది. వీరందరినీ కాదని.. తెలుగుదేశం పార్టీ నుంచి వచ్చిన రేవంత్ అమాంతంగా ఆ స్థాయికి చేరిపోయారంటూ సణిగే వాళ్లు కాంగ్రెస్ లో కొకొల్లలు. అతి తక్కువ కాలంలోనే వర్కింగ్ ప్రెసిడెంట్ గా.. ఆ పై ఏకంగా ప్రెసిడెంట్ గా మారిపోవడం కొందరికి కంటగింపుగానే మారింది. ఎమ్మెల్యెల వలసలతో తెలంగాణలో ఢీలా పడిపోయిన పార్టీకి ఓ రకంగా రేవంత్ ఊపు తీసుకొచ్చారు. కేసీఆర్ లాంటి నేతలకు స్ట్రాంగ్ గా కౌంటర్లు ఇవ్వాలన్నా.. మాస్ లో చొచ్చుకుపోవాలన్నా... కచ్చితంగా రేవంత్ బెటర్ ఆప్షన్. అయితే ఆయన అనుభవం పార్టీలో తక్కువ. అదే మైనస్ అయింది. కాంగ్రెస్ లో బలమైన నేతలుగా ఉన్న కోమటిరెడ్డి బ్రదర్స్, అధిష్టానంతో అంటిపెట్టుకుని ఉన్న వీహెచ్ లాంటి వాళ్లు.. ముందు నుంచి ఉన్న భట్టి, షబ్బీర్, ఉత్తమ్, మధుయాష్కీ లాంటి వాళ్లు అందరూ ఇబ్బంది పడిన వారే. అయితే అధిష్టానం ఆదేశించడంతో అప్పటికి ఒప్పుకున్నా.. ఎప్పటికప్పుడు ఇబ్బందులు తప్పడం లేదు. ఆయన పదవి చేపట్టిన ఏడాదిలో బయట వాళ్ల కంటే... కాంగ్రెస్ లీడర్లతోనే ఎక్కువ తలపడాల్సి వచ్చింది. కోమటిరెడ్డి లాంటి వాళ్లని కాచుకోవాలి. వీహెచ్ లాంటి వాళ్ల విమర్శల్ని భరించాలి. మిగిలిన వాళ్లు ఏం చేస్తున్నారో గమనించుకోవాలి. ఇవన్నీ రేవంత్ ఇబ్బందులు. అధిష్టానం అండతో ఆయన లాక్కొస్తూనే ఉన్నారు.
అందరూ కుమ్మక్కై కుట్రలు చేస్తున్నారని రేవంత్ ఆరోపణ
అయితే ఇప్పుడు రేవంత్ ఓ కీలకమైన సమయంలో అడుగుపెట్టారు. ఇంకో ఏడాది లో ఎలక్షన్లు ఉన్నాయి. ఆయన నాయకత్వాన్ని ప్రూవ్ చేసుకోవలసిన సమయం వచ్చేసింది. ఎవరు ఎన్ని మాట్లాడినా ఇప్పటికిప్పుడు ... కాంగ్రెస్ పార్టీకి రాష్ట్ర వ్యాప్తంగా మాస్ ఇమేజ్ ఉన్న లీడర్ రేవంతే. ఆతను ఉన్నాడు కాబట్టి .. కొన్నిచోట్ల అయినా ఆ పార్టీ గట్టిగా టీఆరెఎస్ ను ఎదిరించగలుగుతోంది. దీనికి తోడు కేసీఆర్ కు... రేవంత్ కు ఉన్న రైవలరీ అందరికీ తెలిసిందే. కాబట్టి రేవంత్ ను పూర్తిగా తొక్కేయడానికి కుట్ర జరుగుతోంది అనే వాదన తెలంగాణ రాజకీయాల్లో ఉంది. తనను .. పూర్తిగా దెబ్బతీయడానికి బీజేపీ- టీఆరెస్ కలిసి పనిచేస్తున్నాయని ఆయన ఎప్పటి నుంచో ఆరోపిస్తున్నారు. మునుగోడు ఎలక్షన్ ను అందుకు వేదిక చేసుకోవాలనుకుంటున్నారన్నది ఆయన మద్దుతుదారుల వాదన. రేవంత్ కు పార్టీలో ప్రత్యర్ధి అయిన కోమటి రెడ్డి సోదరుడే... పార్టీ నుంచి వెళ్లిపోయి బీజేపీ తరపున బరిలోకి దిగారు. కాంగ్రెస్ పార్టీ స్టార్ కాంపెయినర్ గా ఉన్న వెంకటరెడ్డి.. సొంతపార్టీపై విమర్శలు చేస్తున్నారు. టికెట్ కేటాయింపు దగ్గరనుంచి పార్టీలో చాలా గందరగోళం నడిచింది. అన్ని అడ్డంకులు అధిగమించి ప్రచారం చేస్తున్నా.. వాళ్లని తట్టుకోవడం రేవంత్ కు కష్టంగా మారుతోంది.
పీసీసీ కోసమే ఇతర పార్టీలతో కలిసి కుట్రలు చేస్తున్నారని రేవంత్ అనుమానం
వెంకటరెడ్డి తన తమ్ముడికి లోపాయకారిగా సహకరిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. రేవంత్ ఏమోషనల్ అయిన కొన్ని గంటల్లోనే .. వెంకటరెడ్డి మాట్లాడినట్లుగా చెబుతున్న ఆడియో క్లిప్ ఒకటి బయటకు వచ్చింది. ఆయన ఈ ఒక్కసారికి తమ్ముడికి ఓటేయండి.. తర్వాత నేనే ప్రెసిడెంట్ గా అవుతా అని వెంకటరెడ్డి చెబుతున్నట్లుగా ఉంది. రేవంత్ ఆరోపిస్తోంది కూడా అదే. తనను పీసీసీ చీఫ్ గా ఫెయిల్ అని నిరూపించే ఇంకెవరో నాయకత్వం తీసుకుంటారని చెబుతున్నారు. లాఠీ తూటాలకైనా, తుపాకీ గుండ్లకైనా తాను సిద్ధంగా ఉన్నానన్నారు. కాంగ్రెస్ పార్టీ కోసం ప్రాణాలు సైతం ఇచ్చేందుకు, చివరి శ్వాస వరకు పనిచేస్తానంటూ భావోద్వేగానికి లోనయ్యారు. పీసీసీ పదవి సోనియా గాంధీ తనకు ఇచ్చిన అవకాశమని, కానీ అప్పటినుంచి పార్టీలో తాను ఒంటరివాడిని అయ్యానని.. అందుకు బీజేపీ, కేసీఆర్ కుట్రలు కూడా ఓ కారణమని ఆరోపించారు రేవంత్ రెడ్డి. ‘దేశంలో కాంగ్రెస్ పార్టీని చంపేందుకు సీఎం కేసీఆర్ సుపారి తీసుకున్నాడు. పది రోజులపాటు ఢిల్లీలో ఉండి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో రహస్య మంతనాలు జరిపాడు కేసీఆర్. కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలన్న కుట్రతోనే కేసీఆర్.. అమిత్ షా ఆడుతున్న డ్రామాలో భాగంగానే మునుగోడు ఉప ఎన్నికలో కాంగ్రెస్ ఓటమి కోసం కుట్రలు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం సిఆర్పిఎఫ్ బలగాలతో మునుగోడును చుట్టి ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి కాంగ్రెస్ కార్యకర్తలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. అని రేవంత్ అంటున్నారు.
ఫైటర్‌గా పేరు తెచ్చుకున్న రేవంత్ కన్నీరు పట్టుదలకు సంకేతమా ? బలహీనతకు అర్థమా ?
రేవంత్ ది మొదటి నుంచి పోరాటధోరణి.. లోకల్ రాజకీయాలకు ఎదురునిలిచి. జెడ్పీటీసీగా.. ఆ పై ఎమ్మెల్సీగా ఇండిపెండెంట్ గా గెలిచారు. ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలో చేరిన..ఆయన చంద్రబాబు ప్రోత్సాహంతో ఆ పార్టీలో కీలకమైన నేతగా ఎదిగారు. అయితే.. తెలంగాణలో తెలుగుదేశం బలహీనపడటంతో కాంగ్రెస్ లో చేరి అక్కడా వేగంగానే ఎదిగారు. కాంగ్రెస్ లో చేరేముందే పరిస్థితి ఎలా ఉంటుందో ఆయనకు అవగాహన ఉంది. అయితే రేవంత్ ఆరోపిస్తున్నట్లు.. ఆయన్ను దెబ్బతీయడానికి టీఆరెస్, బీజేపీతో పాటు.. తన పార్టీలోని నేతలు కూడా కలిసి పనిచేస్తంటే.. రేవంత్ పెద్ద పోరాటం చేస్తున్నట్లే లెక్క. కాంగ్రెస్ పార్టీ కిందటి ఎన్నికల్లో ప్రతిపక్షం. ఇప్పటికీ గ్రామీణ ప్రాంతాల్లో పట్టుంది. బీజేపీ వేగంగా ఎదుగుతోందన్న పేరున్నప్పటికీ .. కొన్ని జిల్లాల్లో ఆ పార్టీ బలం నామమాత్రమే. అలాగే బీజేపీ బలం అంతా పట్టణ ప్రాంతాల్లో ఉంది. అయినా ఆ పార్టీ.. టీరెఎస్ ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. అలా కనిపించేలా చేయడం కోసం, కాంగ్రెస్ ఉనికిలో లేదు అని చెప్పడం కోసమే TRS-BJP పనిచేస్తున్నాయన్నది రేవంత్ ఆరోపణ. ఇందులో నిజానిజాలు ఎలా ఉన్నా.. ఆయనకు మాత్రం రాజకీయంగా ఇది జీవన్మరణ సమస్య. రోజురోజుకూ పార్టీ పరిస్థితి జఠిలం అవుతుండటం... మునుగోడులో పరిస్థితి బాలేదని సర్వేలు చెబుతుండటంతో ఆ ఒత్తిడి మరింత పెరుగుతోంది. రాజకీయంగా ఫైటర్ అయిన రేవంత్ ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటారో చూడాలి.