Revant Reddy :   మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరాలని నిర్ణయించుకోవడపై టీ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి మండిపడ్డారు. కుక్క బిస్కెట్ల కోసం ఆశపడి రాజగోపాల్ రెడ్డి పార్టీ మారుతున్నారని మండిరడ్డారు. ఆర్థిక లావాదేవీల కోసం కన్న తల్లి లాంటి కాంగ్రెస్ పార్టీని అవమానిస్తున్నారని విమర్శించారు. బీజేపీ వేసిన ఎంగిలి మెతుకులకు ఆశపపడ్డారని అన్నారు. మునుగోడులో రాజగోపాల్ రెడ్డిని సోనియా గాంధీ ప్రతినిధిగా ప్రజలు ఎన్నుకున్నారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. తెలంగాణ తల్లి సోనియా గాంధీ అనీ.. అలాంటి తల్లిని ఈడీ ద్వారా అవమానిస్తున్నారన్నారు. తల్లిని అవమానించిన వారి తల తెగనరకాలని.. అలాంటి వారిపై పోరాడాల్సిన సమయంలో.. అమిత్ దగ్గర కూర్చుని కాంట్రాక్టుల లెక్కలు చూసుకున్నారని రేవంత్ రెడ్డి మండిపడ్డారు. 


మోదీ, అమిత్ షా ఇచ్చిన కాంట్రాక్టుల కోసమే కొంత మంది పని చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. ప్రజల ఆకాంక్షల మేరకు ఏర్పడిన తెలంగాణను మోదీ అవమానించారని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు బీజేపీ తెలంగాణ ప్రజలకు తమ నిజ స్వరూపం చూపిస్తోందన్నారు. ఈడీ అనేది బీజేపీకి ఎలక్షన్ డిపార్టుమెంట్‌గా మారిందని విమర్శించారు. ప్రతిపక్ష పార్టీల నేతలపై అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు.  


కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి కాంగ్రెస్ పార్టీ అనేక అవకాశాలు కల్పించిందన్నారు. పార్టీలో సమస్యలు ఉంటే పార్టీ హైకమాండ్‌తో ఎందుకు చర్చించలేదని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పార్టీకీ నష్టం కలిగించాలని చూస్తే అసలు ఊరుకునే ప్రశ్నే లేదన్నారు. మీ బంధాలన్నీ ఆర్థిక బంధాలేనన్నారు. మునుగోడులో ఈ నెల ఐదో తేదీన పార్టీ విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించబోతున్నామని రేవంత్ రెడ్డి ప్రకటించారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటారన్నారు. ఉపఎన్నికల్లో విజయం కోసం పార్టీ కోసం పని చేస్తారని రేవంత్ రెడ్డి ప్రకటించారు.  మునుగోడు ఉపఎన్నిక నిర్వహణ కమిటీని కాంగ్రెస్ పార్టీ ప్రకటిస్తుందన్నారు. ఉపఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటుందని స్పష్టం చేశారు. 


కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పొడిచిన వాళ్లకు మునుగోడు ప్రజలు బుద్ది చెప్పాలని తెలంగాణ కాగ్రెస్ వ్యవహారాల ఇంచార్జ్ మామిగం ఠాగూర్ పిలుపునిచ్చారు.