LokSabha Elections 2024: కోస్గి: అసెంబ్లీ ఎన్నికల్లో విజయంతో కాంగ్రెస్ నేతల్లో నూతనోత్సాహం కనిపిస్తోంది. లోక్‌సభ ఎన్నికల్లోనూ భారీగా స్థానాలు కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోంది. మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల కానున్న సమయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) కీలక ప్రకటన చేశారు. నారాయణపేట జిల్లా కోస్గి బహిరంగ సభలో మాట్లాడుతూ.. లోక్‌సభ ఎన్నికలకు కాంగ్రెస్ పార్టీ నుంచి తొలి అభ్యర్థిని ఆయన ప్రకటించారు. మహబూబ్‌నగర్‌ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థిగా చల్లా వంశీచంద్ రెడ్డి (Vamshi Chand Reddy) పేరును బహిరంగ సభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు.


వంశీచంద్ రెడ్డిని మహబూబ్ నగర్ ఎంపీగా గెలిపించుకోవాలని కాంగ్రెస్ శ్రేణులకు పిలుపునిచ్చారు. వంశీచంద్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని, అందుకు తన నియోజకవర్గం కొడంగల్ నుంచే 5వ వేల మెజార్టీ రావాలన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో 17 స్థానాలకు గానూ 14 సీట్లలో కాంగ్రెస్ నెగ్గి రాష్ట్ర ప్రయోజనాల కోసం పార్లమెంట్ లో పోరాటం చేస్తుందన్నారు. వచ్చే వారం రోజుల్లో రూ.500లకే గ్యాస్ సిలిండర్, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అమలుపై ప్రకటన చేస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. వచ్చే నెల 16లోగా అందరికీ రైతు భరోసా అందిస్తామని భరోసా ఇచ్చారు. రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి రైతులను ఆదుకుంటామని చెప్పారు.



పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా ఇస్తామని 2014లో మోడీ ఇచ్చారు. పదేండ్లుగా ఆ హామీని ఎందుకు నెరవేర్చలేదో తెలంగాణ బీజేపీ నేతలు డీకే అరుణ, కిషన్ రెడ్డి, జితేందర్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. కృష్ణా రైల్వే లైన్  ఎందుకు ముందుకు సాగలేదని ప్రశ్నించారు. కేంద్రంలో ప్రభుత్వం ఉన్నా... నలుగురు బీజేపీ ఎంపీలు ఉన్నా.. రాష్ట్రానికి నాలుగు రూపాయలైనా తెచ్చారా? మరి పాలమూరు జిల్లాలో ప్రజలను ఓట్లు వేయాలని ఎలా అడుగుతారు? అంటూ అటు బీఆర్ఎస్, ఇటు బీజేపీ నేతలపై నిప్పులు చెరిగారు.


ఎవరీ వంశీ చంద్ రెడ్డి..
చల్లా వంశీ చంద్ రెడ్డి కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే. 2014 ఎన్నికల్లో కల్వకుర్తి శాసనసభ నియోజకవర్గం నుండి ఎంఎల్ఏగా గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి తల్లోజు ఆచారిపై 78 ఓట్ల స్వల్ప తేడాతో గెలుపొంది, తొలిసారిగా తెలంగాణ అసెంబ్లీలో అడుగుపెట్టారు. విద్యార్థి దశ నుండే ఉన్న ఆసక్తితో వంశీచంద్ రెడ్డి రాజకీయాల్లో వచ్చారు. అంచెలంచెలుగా ఎదిగిన వంశీచంద్ రెడ్డి 2005 – 2006లో ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట కార్యదర్శిగా చేశారు. 2006 – 2010 ఎన్.ఎస్.యూ.ఐ రాష్ట అధ్యక్షుడిగా, 2012-14 లో రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా బాధ్యతలు నిర్వహించారు. 2014లో కల్వకుర్తి నుంచి పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు. 


2018 ఆగస్టులో పార్టీలో సేవలకు గుర్తింపునిచ్చి ఏఐసీసీ కార్యదర్శిగా నియమించారు. అదే ఏడాది తెలంగాణ అసెంబ్లీకి జరిగిన ముందస్తు ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి జైపాల్ యాదవ్ చేతిలో ఓటమిచెందారు. 2019 లోక్‌సభ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి టీఆర్ఎస్ అభ్యర్థి మన్నె శ్రీనివాస్ రెడ్డి చేతిలో ఓడిపోయారు. ప్ర‌స్తుతం ఏఐసీసీ కార్యదర్శి హోదాలో మహారాష్ట్ర పార్టీ వ్యవహారాలను ప‌ర్య‌వేక్షిస్తున్నారు. ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ సహాయకుడిగా, జాతీయ స్థాయిలో పార్టీ సంస్థాగత వ్యవహారాల బాధ్యతలను నిర్వహించారు. 2023 ఆగస్టు 20న కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమితుడయ్యారు వంశీచంద్ రెడ్డి.