YS Sharmila contest from Kalyanadurgam :  రాష్ట్ర విభజన అనంతరం ఆంధ్ర ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ కోలుకోలేని పరిస్థితిలో పడింది. కాంగ్రెస్ పార్టీ దశాబ్ద కాలంగా ఏపీ అసెంబ్లీలో సభ్యత్వాన్ని కూడా కోల్పోయింది. 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక్క సీటు కూడా దక్కలేదు. 2019 ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి ఇదే పరిస్థితి ఎదురైంది. ఈసారి ఎలాగైనా నవ్యాంధ్రప్రదేశ్ లో బోనీ కొట్టాలని ఉద్దేశంతో కాంగ్రెస్ పార్టీ తీవ్ర స్థాయిలో కసరత్తును ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ పిసిసి చీఫ్ అధ్యక్షురాలిగా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో కాంగ్రెస్ కు ఊపిరి పోసినట్లు అయింది. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి బరిలో దిగేందుకు అభ్యర్థులు కూడా ఆశాజనకంగా కనిపిస్తున్నారు.  


షర్మిల బాధ్యతలు పేట్టిన తర్వాత  కాంగ్రెస్‌లో కదలిక 


వైఎస్ షర్మిల అంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టిన అనంతరం విభజన సమయంలో జరిగిన తప్పులు తెలుసుకొని తాము అధికారంలోకి వస్తే విభజన చట్టంలో ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పుకొస్తున్నారు. దానికి అనుగుణంగానే వైఎస్ షర్మిల ఢిల్లీలో ఆంద్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలంటూ ధర్నా చేయడం కూడా జరిగింది. రాష్ట్రం లో 10 సంవత్సరాలుగా అధికారం లో ఉన్న టీడీపీ, వైసీపీ ప్రత్యేక హోదా తీసుకురావటం లో విఫలం అయ్యారని షర్మిల ద్వెజమెత్తారు. ఈ నినాదంతో నే ఈసారి ఆంధ్రప్రదేశ్ ఎలాగైనా కాంగ్రెస్ పార్టీ సత్తా చాటాలని కాంగ్రెస్ అధినాయకత్వం తీవ్రమైన కసరత్తును మొదలుపెట్టింది. ఏపీ అసెంబ్లీలో తమ ప్రతినిధికి అవకాశం వస్తే రాష్ట్రానికి న్యాయంగా రావాల్సిన వాటిపై పోరాటం చేస్తామని హామీ కూడా ఇస్తున్నారు. 


కళ్యాణదుర్గం  నుంచి పోటీ చేయించాలని రఘువీరా ప్రయత్నాలు


వైయస్ షర్మిల ను అనంతపురం జిల్లాలోని కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి ఎన్నికల బరిలోకి దింపాలని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రఘువీరారెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. షర్మిల పోటీపై కాంగ్రెస్ పెద్దలతో కూడా చర్చించినట్లు ప్రచారం జరుగుతుంది. గతంలో కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి రఘువీరారెడ్డి విజయం సాధించడమే కాకుండా కళ్యాణదుర్గం నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడిపించారు. నియోజకవర్గంలో రోడ్లు, తాగునీరు ఇతర వసతులను భారీగా కల్పించారు. రైతాంగానికి రావలసిన అన్ని రకాల బెనిఫిట్స్ను రఘువీరారెడ్డి అందించారు. విభజన అనంతరం రఘువీరా రెడ్డి కళ్యాణదుర్గం నుంచి పోటీ చేసి ఓటమి చవిచూశారు. అయినప్పటికీ గౌరవప్రదమైన ఓట్లే రఘువీరారెడ్డి వచ్చాయి. ఈసారి వైఎస్ షర్మిలను కళ్యాణదుర్గం నుంచి బరిలోకి దింపితే ఈ ప్రభావం జిల్లా వ్యాప్తంగానే కాకుండా రాయలసీమ వ్యాప్తంగా కూడా ఉంటుందని అంచనా వేస్తున్నారు. మరోవైపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో కళ్యాణదుర్గం, మడకశిరలో కాంగ్రెస్ పార్టీకి మంచి పట్టు ఉంది. దీనికి కారణం రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గ మడకశిర అయితే అది ఎస్సీ రిజర్వ్ నియోజకవర్గం కావడంతో కళ్యాణదుర్గం నుంచి రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలుపొందారు. ప్రస్తుతం కళ్యాణదుర్గం నియోజకవర్గం నుంచి షర్మిల పోటీలో ఉంటే తప్పకుండా గెలుస్తుందని కాంగ్రెస్ నేతలు చర్చించుకుంటున్నారు. 


గెలుపు బాధ్యతలు తీసుకోనున్న రఘువీరా 


అధికార వైసీపీ పార్టీలో ఉన్న గ్రూపు రాజకీయాలు.. ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీలో  గ్రూపు రాజకీయాలు కాంగ్రెస్ కు కలిసొచ్చే అంశం.  వైసిపి పార్టీ నుంచి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ ప్రాతినిథ్యం వహిస్తున్నప్పటికీ ప్రస్తుతం మంత్రి ఉషాకు పెనుగొండ నియోజకవర్గానికి సమన్వయకర్తగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నియమించారు. అనంతపురం ఎంపీ తలారి రంగయ్య కు కళ్యాణదుర్గం సమన్వయకర్తగా అవకాశం కల్పించారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ నుంచి ఉమామహేశ్వర నాయుడు ఇన్చార్జిగా కొనసాగుతున్నప్పటికీ టిడిపి మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరావు చౌదరి వర్గం కూడా ఈసారి టికెట్ కావాలంటూ పట్టుబడుతున్న పరిస్థితి. ఇలా.. ప్రధాన పార్టీలలో వర్గ పోరు ఉండడంతో ఈ అంశం కాంగ్రెస్ పార్టీకి కలిసి రావడమే కాకుండా వైయస్ షర్మిల స్టార్ క్యాంపైనర్ గా కూడా మంచి అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. కళ్యాణ్ దుర్గం నియోజకవర్గంలో బిసి క్యాడర్ తో పాటు దళితులు కూడా ఎక్కువగా ఉంటారు. వీరంతా మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి పై అభిమానానికి కొదవలేదని చెబుతున్న పరిస్థితి. వైఎస్ షర్మిల అనంతపురం జిల్లా నుంచి పోటీ చేస్తే ఖచ్చితంగా విజయం సాధించి అసెంబ్లీలోకి అడుగు పెడతారని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.