Priyanka In Action : ఒక్క గెలుపు మళ్లీ కాంగ్రెస్ కి ఊపిరిపోసింది. హిమాచల్ ప్రదేశ్ ని కైవసం చేసుకున్న హస్తం పార్టీ ఇప్పుడు అదే గెలుపు వ్యూహాన్ని తెలుగురాష్ట్రాలకు అమలు చేయబోతోందా ? ఇందిరాగాంధీ వారసురాలిగా పేరందుకున్న ప్రియాంక గాంధీ తెలుగు నేలపై కాలు పెట్టబోతోందా? సోదరుడు రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర వచ్చే నెలతో ముగియనుంది. ఈ పాదయాత్ర దేశవ్యాప్తంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నింపడంతో పాటు హిమాచల్ ప్రదేశ్ లో పార్టీ గెలవడం కాస్తంత ఊరటనిచ్చింది. ఈ ఊపుని కంటిన్యూ చేసేలా మరో పాదయాత్రకి సిద్ధమవుతోంది కాంగ్రెస్ పార్టీ.
తెలుగు రాష్ట్రాల్లో ప్రియాంకా గాంధీ పాదయాత్ర
త్వరలో ప్రియాంక గాంధీ తెలుగునేలపై పాదయాత్ర చేయడానికి సిద్ధమవుతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకప్పుడు సౌత్ లో ముఖ్యంగా తెలుగురాష్ట్రాల్లో కాంగ్రెస్ కి పట్టు ఉండేది. కానీ అంతర్గత కుమ్ములాటలు, అధికారంలో లేకపోవడం వంటి పలు కారణాలతో సీనియర్లంతా పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఉన్న ఒకరిద్దరు సీనియర్లు కూడా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంంతో తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పరిస్థితి ఘోరంగా ఉంది. ఎంత మంది ఇంఛార్జ్ లను పెట్టినా తెలంగాణ, ఏపీల్లో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మారలేదు. అధ్యక్షులను పెట్టినా కూడా ఉపయోగం లేకుండా పోయింది. దీంతో అధిష్టానం తెలుగురాష్ట్రాలపై ఇప్పుడు దృష్టిని పెట్టింది.
కర్ణాటకతో పాటు తెలుగు రాష్ట్రాల బాధ్యతలు తీసుకోనున్న ప్రియాంకా గాంధీ
సౌత్ లో కర్నాటకతో పాటు తెలంగాణలో వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు ఖర్గే కర్నాటక వాసి కావడంతో ఆయన ఆ రాష్ట్ర ఎన్నికలపై దృష్టిపెట్టారు. పార్టీని బలోపేతం చేసే ప్రక్రియని మొదలెట్టారు. ఇక తెలుగురాష్ట్రాలపై ప్రియాంక గాంధీ ఫోకస్ పెట్టారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే తెలంగాణ రాష్ట్ర వ్యవహారాలను ఇక ప్రియాంక గాంధీ చూస్తారన్న న్యూస్ బయటకు వచ్చింది. ఇప్పుడు ఏపీని కూడా ఆమె చక్కదిద్దే ప్రయత్నాలు చేస్తారన్న టాక్ వినిపిస్తోంది. ఏపీ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడిగా రుద్రరాజు ఎంపికయ్యారు. ప్రస్తుతం పార్టీ క్యాడర్ తో పాటు అన్ని వర్గాల నేతలను క లుపుకు పోతూ భవిష్యత్ ప్రణాళికను రూపొందిస్తున్నారు. ప్రియాంక గాంధీ పిలుపు మేరకు ఢిల్లీ వెళ్లిన రుద్రరాజు త్వరలోనే వ్యూహరచనని అమలు పరచనున్నారని టాక్.
హిమాచల్ గెలుపులో ప్రియాంకదీ కీలక పాత్ర
హిమాచల్ ప్రదేశ్ లో ప్రియాంక గాంధీ ప్రతీ నియోజకవర్గం నేతలతో, కార్యకర్తలతో భేటీ కావడమే కాదు ప్రతీ వీధి , ప్రతీ ఇల్లు తిరిగి పార్టీని గెలిపించాలని కోరారు. స్థానిక సమస్యలతో పాటు వివిధ వర్గాల సమస్యలను తెలుసుకున్నారు. వాటిపై ఫోకస్ చేసి ఎన్నికల ప్రచారంలో హామీలు ఇచ్చారు. ఫలితంగా తిరుగులేని మెజార్టీతో హిమాచల్ ప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని అందుకుంది. ఇప్పుడదే ఫార్ములాని ప్రియాంక గాంధీ తెలుగురాష్ట్రాల్లో అమలు చేయబోతున్నారట. మహిళా మోర్చా ర్యాలీలతో ప్రతీ ఇల్లు, ప్రతీ గల్లీ తిరిగి కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని కోరనున్నారట. ఏపీకి ప్రత్యేక హోదా కల్పిస్తామన్న ప్రధాన హామీని ఈ ర్యాలీలో ప్రియాంక గాంధీ ప్రకటించనున్నారని తెలుస్తోంది.
తెలంగాణలో నేతల్ని సమన్వయపరచడమే అసలైన సవాల్ !
అయితే తెలుగు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ పుంజుకోవడానికి అవకాశాలు ఉన్నా నేతల పనితీరు వల్లే పార్టీ బలోపేతం కావడంలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా తెలంగాణ లో నేతల మద్య విభేదాల కారణంగానే ఆ పార్టీ ప్రజల్లో మన్నలు పొందలేకపోతుందనీ, ఏపీలో పార్టీకి నేతలు, పనిచేసే కార్యకర్తలు లేకపోవడం వల్ల పార్టీ పుంజుకోవడంలేదని సొంత పార్టీ నేతలే అంటున్నారు. మరి ఈ సమయంలో ప్రియాంకాగాంధీ పార్టీనీ ఏ రకంగా ముందుకు తీసుకెళ్తారనేదే పెద్ద ప్రశ్న.