Politics of reorganizing Telangana districts:  తెలంగాణలో జిల్లాల పునర్వ్యవస్థీకరణ అంశం మళ్లీ తెరపైకి రావడం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలోని 33 జిల్లాల సరిహద్దులను సమీక్షించాలని నిర్ణయించింది. ముఖ్యంగా రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ వేదికగా చేసిన ప్రకటన ఈ చర్చకు ఆజ్యం పోసింది. గత ప్రభుత్వం కేవలం లక్కీ నెంబర్లు) మరియు,  రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలను ఇష్టానుసారంగా విభజించిందని ఆయన ఆరోపించారు. ఒకే నియోజకవర్గంలోని మండలాలు మూడు, నాలుగు వేర్వేరు జిల్లాల్లో కలిసి ఉండటం వల్ల అటు పాలనాపరంగా, ఇటు సామాన్య ప్రజలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వం వాదిస్తోంది.

Continues below advertisement

 రద్దు వార్తలు - సోషల్ మీడియా హోరు 

ప్రభుత్వం సమీక్ష అని ప్రకటించగానే, సోషల్ మీడియాలో  సిద్దిపేట రద్దు ,  గద్వాల రద్దు వంటి వార్తలు విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ఈ ప్రచారం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. దీనిని బీఆర్ఎస్ నేతలు, ముఖ్యంగా హరీష్ రావు గారు తీవ్రంగా పరిగణిస్తున్నారు. "సిద్దిపేట జిల్లాను రద్దు చేస్తే ఊరుకునేది లేదని, ప్రజలతో కలిసి పోరాటం చేస్తాం  అని ఆయన గట్టిగా హెచ్చరిస్తున్నారు. బీఆర్ఎస్ హయాంలో ఏర్పడిన జిల్లాలను తాకడం అంటే ప్రజల సెంటిమెంట్‌ను దెబ్బతీయడమేనని ప్రతిపక్షం వాదిస్తోంది. ఈ వివాదాన్ని బీఆర్ఎస్ ఒక పొలిటికల్ అస్త్రంగా మలచుకోవాలని చూస్తోంది.

Continues below advertisement

 ప్రభుత్వం మళ్లీ ఈ జోలికి వెళ్లాల్సిన అవసరం ఏముంది? 

ప్రభుత్వ వాదన ప్రకారం.. ప్రస్తుత వ్యవస్థలో కొన్ని మండలాల ప్రజలు తమ జిల్లా కేంద్రానికి వెళ్లాలన్నా 60-70 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వస్తోంది. ఉదాహరణకు, నల్గొండ ఉమ్మడి జిల్లా పరిధిలోని కొన్ని ప్రాంతాల్లో అధికారులు, ప్రజలు సమన్వయం కోసం మూడు జిల్లాల చుట్టూ తిరగాల్సి వస్తోంది. నియోజకవర్గం మొత్తం ఒకే జిల్లా పరిధిలోకి వచ్చేలా మార్పులు చేయడం,హైదరాబాద్‌ను మూడు జిల్లాలుగా  విభజించి, ఓఆర్ఆర్ వరకు పాలనను క్రమబద్ధీకరించడం,  ఐటీ హబ్‌లు ఉన్న ప్రాంతాలను ఒక జిల్లాగా, గ్రామీణ ప్రాంతాలను మరో జిల్లాగా మార్చడం వంటి ప్రతిపాదనలు ఉన్నాయి.  

 పెద్ద తలనొప్పిగా మారే ముప్పు ఉందా? 

 జిల్లాల పునర్వ్యవస్థీకరణ అనేది అత్యంత సున్నితమైన అంశం. ఒకసారి జిల్లా కేంద్రంగా మారిన పట్టణం, మళ్లీ ఆ హోదా కోల్పోతే అక్కడి ప్రజల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతుంది. రియల్ ఎస్టేట్ విలువలు పడిపోతాయని, మౌలిక సదుపాయాల కల్పన ఆగిపోతుందని ప్రజలు భయపడుతున్నారు. మున్సిపల్ ఎన్నికల ముందే ఈ అంశాన్ని తెరపైకి తేవడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయంగా రిస్క్ తీసుకుంటుందనే చెప్పాలి. ఒకవేళ ప్రభుత్వం  జిల్లా రద్దు  కాకుండా కేవలం సరిహద్దుల మార్పు అని స్పష్టత ఇవ్వకపోతే, బీఆర్ఎస్ దీనిని ప్రజల్లోకి సెంటిమెంట్‌గా తీసుకెళ్లి లబ్ధి పొందడం ఖాయం.  ప్రభుత్వం ఏకపక్షంగా కాకుండా, అసెంబ్లీలో చర్చించి, అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందరి ఆమోదంతో ముందుకు వెళ్తామని మంత్రి పొంగులేటి హామీ ఇచ్చారు. ఈ లోపు రాజకీయ సెగలు తగ్గాలంటే ప్రభుత్వం జిల్లాల రద్దుపై వస్తున్న వార్తలకు గట్టిగా కౌంటర్ ఇవ్వాల్సి ఉంటుంది.