Nara Lokesh Leadership Administrative Skills: విజయనగరం జిల్లా భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం ముగించుకుని తిరుగుపయనమైన సందర్భంలో.. దేశ ప్రధాని నరేంద్ర మోదీ, ఏపీ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ భుజం తట్టి  "శభాష్ లోకేశ్! చాలా బాగా పనిచేస్తున్నావు.. ఇదే వేగం, స్ఫూర్తితో ముందడుగు వేయి"  అని అభినందించడం కేవలం ఒక సాధారణ వీడ్కోలు మర్యాద మాత్రమే కాదు. భారత రాజకీయాల్లో సీనియర్ నేతల గుర్తింపు పొందడం అంత సులభం కాని తరుణంలో, ప్రధాని స్థాయిలో లభించిన ఈ ఆత్మీయ ప్రశంసా వాక్యాలు నారా లోకేశ్ పాలనా నైపుణ్యానికి, క్రమశిక్షణతో కూడిన పట్టుదలకు దక్కిన జాతీయ స్థాయి  ముద్రగా చెప్పుకోవచ్చు. 

Continues below advertisement

వారసుడిగా విమర్శలు - ఇప్పుడు నేతగా పనితీరు 

తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారసుడిగా రాజకీయ అరంగేట్రం చేసిన ప్రారంభంలో లోకేశ్ తీవ్ర ప్రతికూల విమర్శలను, సోషల్ మీడియా ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నారు.  వారసత్వం అనే నైతిక బరువుతో ప్రయాణం ప్రారంభించిన ఆయన, విమర్శలను ఎదురుదాడికి సాకుగా మార్చుకోకుండా పరిపాలనా సామర్థ్యం, పక్కా కార్పొరేట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్‌తో తనను తాను మలచుకున్నారు. పాదయాత్ర ద్వారా ప్రజల్లోకి చొచ్చుకెళ్లడం, మంగళగిరి నియోజకవర్గంలో రికార్డు విజయం సాధించడమే కాకుండా.. కార్నెగీ మెల్లన్, స్టాన్‌ఫోర్డ్ విశ్వవిద్యాలయాల విద్యాభ్యాసం అందించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని పాలనలో సమర్థవంతంగా వినియోగిస్తూ ఒక ప్రొఫెషనల్ లీడర్‌గా ఎదిగారు.

Continues below advertisement

పాలనా నైపుణ్యం ఉన్న నేతగా లోకేష్

విజయనగరం భోగాపురం ఎయిర్‌పోర్ట్ ప్రారంభోత్సవం,  యోగాంధ్ర ప్రపంచ రికార్డు కార్యక్రమాల నిర్వహణ, లేదా గతంలో ప్రధాని మోదీ ఏపీ పర్యటనల సమన్వయం ఇలా ప్రతి ఈవెంట్‌లోనూ లోకేశ్ చూపించిన ఆర్గానైజింగ్ స్కిల్స్ ప్రధానిని విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రభుత్వం చేపట్టిన డిజిటల్ గవర్నెన్స్, గ్రీవెన్స్ రెడ్రెసల్ సిస్టమ్‌తో పాటు విద్యాశాఖలో తెచ్చిన సంస్కరణలపై ప్రధాని మోదీ ముందే సమాచారం పొంది ఉండటంతోనే.. వేదికపై పబ్లిక్‌గా లోకేశ్‌ను ప్రశంసించారని స్పష్టమవుతోంది. ఇది ఒక యువ నాయకుడి కష్టానికి, పారదర్శక కార్యాచరణకు దక్కిన ప్రతిఫలం అనుకోవచ్చు. 

గతంలో వారసుడిగా ఉన్న మోదీ విమర్శలు 

వారసత్వ రాజకీయాలను తీవ్రంగా వ్యతిరేకించే ప్రధాని మోదీ గతంలో లోకేష్ ను కూడా విమర్శించారు. కానీ ఇప్పుడు అభినందిస్తున్నారు. ప్రధాని శభాష్ అని అనడం వెనుక లోకేశ్ సొంతంగా సంపాదించుకున్న గుర్తింపే ప్రధాన కారణం. ఐటీ, ఎలక్ట్రానిక్స్, మానవ వనరుల వికాస శాఖల మంత్రిగా గ్లోబల్ ఇన్వెస్టర్లను ఆంధ్రప్రదేశ్‌ వైపు ఆకర్షించడంలో లోకేశ్ నిరంతరం విదేశీ ప్రతినిధులతో సమావేశమవుతూ చురుగ్గా పనిచేస్తున్నారు. పెట్టుబడుల సేకరణ, నిరుద్యోగ యువతకు నైపుణ్యాభివృద్ధి కల్పనలో ఆయన చూపుతున్న వేగం జాతీయ స్థాయిలో కూడా చర్చనీయాంశమైంది. మరోవైపు విపక్షాలు చేసే రాజకీయ విమర్శలకు సైతం లోకేశ్ ఇప్పుడు సంయమనంతో, సమాచార ఆధారిత  సమాధానాలు ఇస్తూ ఒక సీనియర్ స్టేట్స్‌మన్‌లా వ్యవహరిస్తున్నారు. పార్టీలో తండ్రి చంద్రబాబు నాయుడి పక్కన ఒక బలమైన రెండో శ్రేణి నాయకత్వంగా నిలబడటమే కాకుండా, ఎన్డీయే కూటమి సమన్వయంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. పవన్ కల్యాణ్ వంటి జనసేన అధినేతతో, బిజెపి కేంద్ర నాయకత్వంతో సౌహార్ద్రపూర్వక సంబంధాలను నిర్వహిస్తూ కూటమికి బలమైన ఆధారంగా నిలిచారు.

యువనేతల్లో లోకేష్‌కు ప్రత్యేక స్థానం 

సొంత ప్రయాణంలో తండ్రి నీడ నుంచి బయటకు వచ్చి, తనదైన శైలిలో పాలన సాగిస్తూ, శభాష్  అని ప్రధాని చేత పటించుకోవడం ఒక యువ నేతకు అతిపెద్ద పొలిటికల్ మైలురాయి. దేశంలోనే అత్యంత ప్రామిసింగ్ యంగ్ పొలిటీషియన్లలో ఒకరిగా ఎదిగిన లోకేశ్‌కు ప్రధాని ఇచ్చిన ఈ బూస్ట్, రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక, విద్యా వికాసంలో మరింత వేగాన్ని నింపడమే కాక.. జాతీయ స్థాయిలో ఆయన ప్రాధాన్యతను మరింత పెంచనుందనడంలో సందేహం లేదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.