Payyavula On Pegasus : తెలుగుదేశం పార్టీ హయాంలో డేటా చోరీ జరిగిందని తాము నిర్ధారించామంటూ అసెంబ్లీ హౌస్ కమిటీ చేసిన ప్రకటనపై తెలుగుదేశం పార్టీ విమర్శలు గుప్పించింది. చంద్రబాబునాయుడు ప్రభుత్వం పెగాసెస్ కొనలేదని డీజీపీగా ఉన్నప్పుడు గౌతమ్ సవాంగ్ ఆర్ టీఐ సమాధానం ఇచ్చారని ,, కేవలం అసత్య ప్రచారాలు, అభూత కల్పనలతో ప్రజల్ని నమ్మించి మోసం చేసే ప్రయత్నం చేస్తున్నారని పయ్యావుల కేశవ్ ఆరోపించారు. అసలు నిఘా ఈ ప్రభుత్వంలో జరుగతోందన్నారు. తమ ఎమ్మెల్యేలు, మంత్రులపైనే ప్రస్తుత ప్రభుత్వం నిఘా పెట్టిందని ఆరోపించారు.
టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు గతంలో సీఎంగా ఉండగా డేటా చౌర్యం చేశారని అక్రమ కేసు పెట్టి దాన్ని నిరూపించడానికి అనవసరంగా ఉద్యోగస్థులను వేధించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో టీడీపీతో పాటు వైఎస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు, సాక్షిలో పనిచేస్తున్న ఉద్యోగులపైనే నిఘా పెట్టారని పయ్యావుల ఆరోపణలు చేశారు. హాని కర వ్యక్తులపై ప్రయోగించే నిఘా అస్త్రాన్ని కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు వ్యతిరేకంగా వైసీపీ సర్కార్ దుర్వినియోగం చేసోందన్నారు. ఇందుకోసం బెంగళూరు నుంచి ప్రైవేటు వ్యక్తుల్ని సైతం నియమించుకుని మరీ వారికి నగదు రూపంలో చెల్లింపులు చేస్తున్నారని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వ సంస్థలచే ఎవరెవరిపై నిఘా పెట్టారనేదానిపై ఆడిట్ కు సిద్ధమా అని పయ్యావుల సవాల్ చేశఆరు. మంత్రులు, ఎమ్మెల్యేలచే ఆరోపణలు చేయించడంకాదు రాతపూర్వకంగా సమాధానం ఇవ్వగలరా? అని నిలదీశారు. ప్రభుత్వం నిఘాపై పెడుతున్న ఖర్చుపై కాగ్ ఆడిట్ కు సిద్ధమేనా అని పయ్యావుల ప్రశ్నించారు. అసెంబ్లీలో చర్చ లేకుండానే స్పీకర్ సాయంతో సభా సంఘం ఏర్పాటు చేశారు. టీడీపీ ఎమ్మెల్యేలు లేకుండానే సభా సంఘం ఏర్పాటు చేయడం ఏమిటని ప్రశ్నించారు. విపక్షం నుంచి ఒక్క ఎమ్మెల్యే కూడా లేకుండా మొత్తం వైసీపీ నేతలతో ఏర్పాటు చేసిన సభా సంఘానికి విలువ ఎక్కడుందని ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ కమిటీ కాదు అసెంబ్లీ కమిటీ అనేది గుర్తుంచుకోవాలన్నారు.
ప్రతీ ప్రభుత్వం దగ్గర ఇళ్లలో ఎవరుంటున్నారనే సమాచారం సేకరిస్తారన్నారు. ఇది అన్ని ప్రభుత్వాలు చేస్తున్న పనే అన్నారు. డేటా చౌర్యంపై కేసులు పెట్టి ఏం తేల్చారని నిలదీశారు. ప్రభుత్వం గతంలో చేసిన ఆరోపణలతో ఇప్పుడు నవ్వుల పాలైందన్నారు. పెగాసస్ టీడీపీ దగ్గరుండే బాబాయ్ గొడ్డలిపోటు జరిగేదా అని ప్రశ్నించారు. రాజకీయ లబ్ధి కోసమే గత ప్రభుత్వం డేటా చౌర్యానికి పాల్పడినట్లు హౌస్ కమిటీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. దీనిపై వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో అసెంబ్లీకి నివేదిక ఇస్తామన్నారు.