జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవంలో పవన్ కల్యాణ్ .. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక ఓట్లను చీలనివ్వబోనని శపథం చేశారు. వైసీపీ వ్యతిరేక శక్తుల్ని కలుపుకుంటానన్నారు. విషయంలో బీజేపీ రోడ్ మ్యాప్ ఇస్తామందని.. దాని కోసం ఎదురుచూస్తున్నామని ప్రకటించారు. రాజకీయ ప్రయోజనాలు వదిలి.. రాష్ట్ర ప్రయోజనాల కోసం ముందుకొచ్చే వారితో పొత్తుల గురించి ఆలోచిస్తామని ప్రకటించారు. పవన్ కల్యాణ్ వ్యాఖ్యలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశం అవుతున్నాయి. దీనికి కారణం టీడీపీతో పొత్తుపై విస్తృతంగా చర్చ జరుగుతూండటమే.
బీజేపీ రోడ్ మ్యాప్ ఏంటి ?
ఏపీలో పొత్తులపై రోడ్ మ్యాప్ ఇస్తామని బీజేపీ అంటోందని పవన్ కల్యాణ్ ప్రకటించారు. అంటే..బీజేపీ, జనసేన మాత్రమే కలిసి బరిలోకి దిగే ఆలోచన లేదని అనుకోవాలి. నిజంగా ఆ రెండు పార్టీలు కలిసి పోటీ చేస్తే అధికార వ్యతిరేక ఓటు అడ్డంగా చీలిపోతుంది. ఈ విషయం చెప్పడానికిరాజకీయ పండితులు అక్కర్లేదు. తిరుపతి ఉపఎన్నికలు చూస్తే తెలిసిపోతుంది. ఈ రెండు పార్టీలు కలిస్తే వన్ ప్లస్ వన్ టు కావడం లేదు. బీజేపీ ఒక్క దానితోనే కలవడం వల్ల కూటమికి మైనార్టీ ఓట్లుపడటం లేదు. అదే సమయంలో.. జనసేన హార్డ్ కోర్ ఫ్యాన్స్ కూడా బీజేపీపై అంత పాజిటివ్‌గా లేరు. మరి బీజేపీ ఇచ్చే రోడ్ మ్యాప్ ఎలా ఉంటుంది ? ఆ కూటమిలో ఎవరు కలవబోతున్నారు ?
2014 ఎన్నికల నాటి కూటమికి ప్లాన్ చేస్తున్నారా ?
2014 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ, జనసేన కలిసి పోటీ చేశాయి. అయితే అప్పుడే పార్టీ పెట్టిన కారణంగా.., పవన్ కల్యాణ్ సీట్లు అడగలేదు. కానీ టీడీపీ - బీజేపీ అభ్యర్థుల గెలుపు కోసం ఆయన విస్తృతంగా ప్రచారం చేశారు. జనసేన ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉంది. అప్పట్లో అది సక్సెస్ ఫుల్ టీం. ఆ తర్వాత రాజకీయాలు.., రాష్ట్ర ప్రయోజనాల కోణంలోనే విడిపోయారు. ఆ దెబ్బ అందరికీ పడింది. అయితే బీజేపీకి వచ్చిన నష్టమేం లేదు. ఏపీలో ఏ పార్టీ ఉన్నా... బీజేపీకి ఢిల్లీలో సపోర్ట్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అందుకే పార్టీ పరంగా బలపడలేకపోయినా... బీజేపీకి నష్టం లేకపోయింది. కానీ టీడీపీ, జనసేనకు మాత్రం కోలుకోలేని దెబ్బ పడింది. స్వయంగా పవన్ కల్యాణ్ కూడా గెలవలేకపోయారు. ఇలాంటి తప్పు మళ్లీ జరగకుండా ఉండాలంటే... 2014 నాటి కూటమి ఒక్కటే మార్గమన్న అంచనాతో పవన్ ఉన్నారని.. అదే మాటను వ్యతిరేక ఓటును చీలనీయబోమన్న వ్యాఖ్య ద్వారా చెప్పారని అంటున్నారు.
జనసేనతో ఓకే...బీజేపీతో పొత్తుకు టీడీపీ ఓకే అంటుందా?
జనసేనతో పొత్తు విషయంలో తెలుగుదేశం పార్టీకి ఎలాంటి అభ్యంతరాలు లేవు. నిజం చెప్పాలంటే.. ఆ పార్టీ ఎప్పుడు ఓకే అంటుందా అని వన్ సైడ్ లవర్‌గా ఎదురు చూస్తుంది. జనసేనతో పొత్తు పెట్టుపెట్టుకుంటే వన్ ప్లన్ వన్ ఫోర్ అవుతుందని టీడీపీ నేతలకు గట్టి అంచనాలు ఉన్నాయి. అయితే ఈ విషయంలో బీజేపీని కూడా కలుపుకోవాలా లేదా అన్నఅంశంపై సందిగ్ధం టీడీపీ నేతలకు ఉంటుంది. ఆ పార్టీకి ఒక్క శాతం కూడా ఓటు బ్యాంక్ లేకపోవడం.. ఆ పార్టీలో అత్యధిక మంది నేతలు అధికార పార్టీకి సన్నిహితులన్న ప్రచారం ఉండటంతో వారు మరింత ఆలోచన చేసే అవకాశం ఉంది. అయితే ఏపీ నడవాలంటే.. ఢిల్లీ ప్రభుత్వం మద్దతు అవసరం కాబట్టి.. బ ీజేపీని ఈ కోణంలో కలుపుకున్నా ఆశ్చర్యం లేదని అంటున్నారు.
పొత్తులకు బీజేపీ-జనసేన- టీడీపీ మాత్రమే చాయిస్...!
ఏపీలో ప్రస్తుతం ఉన్న రాజకీయాల్లో 2014 కూటమికి మాత్రమే చాయిస్ కనిపిస్తోంది. ఎందుకంటే బీజేపీ ఉంటే కమ్యూనిస్టులు చేరరు. బీజేపీనే రోడ్ మ్యాప్ ఇస్తానంటోందని పవన్ అంటున్నారు కాబట్టి ఆ పార్టీని వదిలిపెట్టారు. సహజంగానే కాంగ్రెస్‌ను చేర్చుకోరు. అందరూ కలిసి వైసీపీ మీద పోరాడాలనకుంటున్నారు కాబట్టి ఆ పార్టీతో జత కట్టే అవకాశం ఉండదు.. అంతిమంగా పవన్ కల్యాణ్ పొత్తులకు సిద్ధమయ్యారని అనుకోవాలి.