Pawan Kalyan Pithapuram Development:  ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత నియోజకవర్గమైన పిఠాపురంపై ప్రత్యేక దృష్టి సారించి, రాష్ట్ర రాజకీయాల్లో ఒక సరికొత్త డెవలప్‌మెంట్ మోడల్ కు శ్రీకారం చుట్టారు. సాధారణంగా నాయకులు ఎన్నికల సమయంలో మాత్రమే నియోజకవర్గాన్ని సందర్శిస్తారనే విమర్శలకు భిన్నంగా, అధికారంలోకి వచ్చిన స్వల్ప వ్యవధిలోనే ఏకంగా రూ. 1,500 కోట్ల భారీ బడ్జెట్‌తో  పిఠాపురాన్ని రాష్ట్రంలోనే ఒక మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దేందుకు సమగ్ర ప్రణాళికను అమలు చేస్తున్నారు. ఇది కేవలం మౌలిక వసతుల కల్పన మాత్రమే కాకుండా, పవన్ కళ్యాణ్ రాజకీయ ప్రయాణంలో అత్యంత కీలకమైన శాశ్వత పట్టు  సాధించే వ్యూహంలో భాగమని  భావిస్తున్నారు.   అభివృద్ధే అజెండాగా పవన్ కళ్యాణ్ రాజకీయం!  

Continues below advertisement

పవన్  పిఠాపురంలో  గ్రామీణ పర్యావరణం, సుందరీకరణ, ఆధునిక వసతులు,  స్థానిక పాలనా సంస్కరణలను ఒకేసారి పరుగులు తీస్తున్నారు.  పిఠాపురం వ్యాప్తంగా పవన్ కళ్యాణ్ చేపడుతున్న కార్యక్రమాలలో భూగర్భ జలాల పునరుద్ధరణ ,  చెరువుల సుందరీకరణ ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఫకృద్ధీన్ పాలెంలో మైసమ్మ చెరువును రూ. 73 లక్షలతో వాకింగ్ ట్రాక్, చిల్డ్రన్స్ పార్క్, ఓపెన్ ఎయిర్ జిమ్‌లతో ఆధునీకరించి స్థానికులకు ఆహ్లాదకరమైన ప్రాంతంగా మార్చారు. ఇదే బాటలో నియోజకవర్గవ్యాప్తంగా రూ. 6 కోట్లకు పైగా వ్యయంతో 14 చెరువులకు కొత్త శోభ తీసుకువస్తున్నారు. దీనికి తోడు, జాతీయ రహదారి సమీపంలో 6 ఎకరాల విస్తీర్ణంలో రూ. 1.83 కోట్లతో ఆవిష్కరించిన పీఠికాపుర వనం  పట్టణ అటవీ ప్రాజెక్టు, పర్యావరణం మరియు ప్రజారోగ్యం పట్ల ఆయనకున్న స్పష్టమైన విజన్‌కు నిదర్శనంగా నిలుస్తోంది.

ప్రాథమిక వ్యవస్థల  ప్రక్షాళన   

Continues below advertisement

కేవలం పైపైన పనులకే పరిమితం కాకుండా నియోజకవర్గంలోని ప్రాథమిక వ్యవస్థలను పవన్ ప్రక్షాళన చేస్తున్నారు. చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలు , ప్రభుత్వ పాఠశాలలు, ఆసుపత్రుల ఆధునీకరణ, మోడల్ అంగన్వాడీ కేంద్రాల నిర్వహణపై పక్కా ప్రణాళికతో ముందడుగు వేస్తున్నారు. రోడ్లు, డ్రైనేజీ వంటి సుదీర్ఘకాల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపే దిశగా అడుగులు పడుతున్నాయి. పిఠాపురం ఒక ప్రముఖ పుణ్యక్షేత్రం  కూడా కావడంతో, ఇక్కడి పర్యాటక రంగాన్ని బలోపేతం చేసి, స్థానికంగా ఉపాధి అవకాశాలను పెంచేందుకు తగిన వ్యూహాలను అమలు చేస్తున్నారు. ఈ అభివృద్ధి సంక్షేమ ఫలాలు వేగంగా, పారదర్శకంగా ప్రజలకు అందేందుకు పవన్ కళ్యాణ్ పాలనాపరమైన సంస్కరణలు చేపట్టారు. ఇందులో భాగంగా పిఠాపురం ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ కి స్వయంప్రతిపత్తి హోదా కల్పించడం మైలురాయిగా చెప్పవచ్చు. కాకినాడ జిల్లా కలెక్టర్ నేతృత్వంలో పనిచేసే ఈ సంస్థ, నియోజకవర్గంలో ప్రణాళికాబద్ధమైన మౌలిక వసతులు, ఆర్థిక వృద్ధి, మరియు నిధుల వినియోగాన్ని నిరంతరం పర్యవేక్షిస్తోంది. అధికారిక యంత్రాంగాన్ని నేరుగా రంగంలోకి దించడం ద్వారా పనుల్లో జాప్యానికి తావులేకుండా  స్పీడ్ గవర్నెన్స్ ను పరిచయం చేశారు.

ఓ తిరుగులేని నియోజకవర్గంగా మార్చుకునే ప్లాన్  

 పవన్ కళ్యాణ్ తన పంథాను స్పష్టంగా మార్చుకున్నట్లు తెలుస్తోంది. గతంలో ఓటమిని చవిచూసిన అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకున్న పవన్, ఒక నియోజకవర్గాన్ని తిరుగులేని కోటగా మార్చుకోవాలంటే అభివృద్ధి అజెండా నే బలమైన మార్గమని నమ్ముతున్నారు. పిఠాపురం ప్రజల్లో  మా ఎమ్మెల్యే మాకు అండగా ఉన్నారు, పనులు చేసి చూపిస్తున్నారు  అనే బలమైన నమ్మకాన్ని కలిగించడం ద్వారా, భవిష్యత్తులో ఈ స్థానంలో ఎవరూ ఆయనను సవాలు చేయలేని విధంగా రాజకీయంగా స్థిరపడే వ్యూహాన్ని అమలు చేస్తున్నారు. ఒక వైపు రాష్ట్ర స్థాయిలో ఉప ముఖ్యమంత్రిగా కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే, మరోవైపు సొంత నియోజకవర్గంపై ఈ స్థాయిలో నిధులు, సమయం కేటాయించడం సాధారణ విషయం కాదు. పిఠాపురంలో పవన్ సాధించే విజయం లేదా ఇక్కడ సృష్టించే మోడల్ డెవలప్‌మెంట్ , భవిష్యత్తులో జనసేన పార్టీ పాలనా విధానానికి ఒక బెంచ్‌మార్క్‌గా మారే అవకాశం ఉంది.