Pawan Kalyan : వచ్చే ఎన్నికల్లో జెండా ఎగరేస్తాం - ఏపీ భవిష్యత్‌కు వైఎస్ఆర్‌సీపీ హానికరమన్న పవన్ కల్యాణ్ !

ఏపీ భవిష్యత్‌కు వైఎస్ఆర్‌సీపీ హానికరమని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. మండపేటలో రైతుభరోసా యాత్రలో పవన్ కల్యాణ్ పాల్గొన్నారు.

Continues below advertisement

Pawan Kalyan : జనసేనను అధికారంలోకి తీసుకు రావాలని ప్రజల్ని కోరడం లేదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. తూర్పుగోదావరి జిల్లాలో ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతుల కుటుంబాలకు సాయం చేసేందుకు భరోసా యాత్ర నిర్వహించారు. ఈ సందర్బంగా మండపేటలో బాధిత కుటుంబాలకు చెక్కులు పంపిణీ చేసిన తర్వాత మాట్లాడారు. తమకే అధికారం ఇవ్వాలని కోరడం లేదని.. ఈ ప్రభుత్వం కావాలా.. మరో ప్రభుత్వం రావాలా అనేది ప్రజలు నిర్ణయించుకోవాలన్నారు. అధికారం కోసం నడిచి వచ్చే వారిని నమ్మవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రోడ్డుపై నడిచేవారంతా మహానుభావులు కాదన్నారు. తూర్పుగోదావరి జిల్లాలో రాజకీయ చైతన్యం ఎక్కువ అని.. మార్పు ఇక్కడ నుంచే ప్రారంభం కావాలన్నారు. 

Continues below advertisement

ఆత్మహత్య చేసుకున్న కౌలురైతుల కుటుంబాలకు జేబుల్లోంచి డబ్బులు తీసి ఇవ్వడం సరదా కాదన్నారు.  ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విధంగానే ఆత్మహత్య చేసుకున్న కౌలు రైతులకు రూ. ఏడు లక్షలు పరిహారం ఇవ్వాలన్నారు. ప్రభుత్వంలో లేకపోయనా కౌలు రైతులకు సాయం చేస్తున్నామన్నారు. వాళ్ల జేబుల్లోనుంచి డబ్బులు తీసి ఇవ్వమనడం లేదని ప్రజలు కట్టిన పన్నుల నుంచే ఇవ్వమని అడుగుతున్నామన్నారు. తనకు జగన్‌లా సిమెంట్ ఫ్యాక్టరీలు లేకపోయినా కోట్ల రూపాయలు రైతుల కుటుంబాలకు సాయం చేశామన్నారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వకుండా వారంతా రైతులు కాదని అంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అమ్మ, అక్క అంటూ మాట్లాడారని.. ఇప్పుడు నిండు గర్భిణి అంగన్వాడి కేంద్రం వద్ద క్యూలో నిల్చోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు.  

2024 ఎన్నికలకు జనసేన సిద్ధంగా ఉందని ప్రకటించారు. కోనసీమ జిల్లాకు అంబేద్కర్ పేరును దురుద్దేశపూర్వకంగా పెట్టారని మండిపడ్డారు. ఎమ్మెల్సీ చేసిన హత్య కేసును తప్పు దారి పట్టించేందుకు ఆ వివాదం తెచ్చారన్నారు. జగన్‌లాగా అంబేద్కర్ పాదయాత్ర చేయలేదని.. అయినా ఆయన మహానీయుడు అయ్యారన్నారు. తెలంగాణలో నా అనే భావన ఉంటే.. ఏపీ అంటే కులం అనే భావన ఉందని..  కులాన్ని గౌరవిస్తూనే కులాతీతభావన ఉండాలన్నారు. ఎన్నికల్లో ఖచ్చితంగా జనసేన జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఎన్నికల ప్రణాళిక ప్రకటిస్తామన్నారు.  జనసేన పార్టీ అధికారంలోకి వస్తే పంచాయతీ నిధులను పంచాయతీ అభివృద్దికే కేటాయిస్తామని స్పష్టం చేశారు. 

తప్పు  జరిగినప్పుడు ఎదిరించే శక్తి లేకపోతే మనుగడ ఉండదని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. తప్పులను ఎత్తి చూపే విషయంలో యువత వెనుకడుగు వేయవద్దని సూచించారు. కేసులకు భయపడవద్దని.. జనసేన అండగా ఉంటుందని పవన్ కల్యాణ్ భరోసా ఇచ్చారు. 99 తప్పుల వరకూ చూస్తామని..  వందో తప్పునకు తాట  తీస్తామని హెచ్చరించారు. ఏపీ భవిష్యత్‌కు వైసీపీ హానికరమన్నారు. పోలీసులు నిష్ఫక్ష పాతంగా పని చేయాలన్నారు. ఎంత మందిని అరెస్ట్ చేస్తారు.. ఎంత మందిని జైల్లో పెడతారని ప్రశ్నించారు. పాలకుల కోసం పని చేస్తే ప్రజలు ఎలా స్పందిస్తారో తెలుసుకోవాలని పోలీసులకు హితవు పలికారు. రాష్ట్రానికి కాపాడేది జనసేన మాత్రమేనన్నారు. వైసీపీ లేని రాష్ట్రాన్ని చూడబోతున్నామన్నారు.  

Continues below advertisement