Pawan Kalyan : పిఠాపురం నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నానని అమిత్ షా అడిగితే కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని పవన్ అన్నారు. అప్పుడు పిఠాపురంలో తనకు బదులుగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారన్నారు. ఈ వ్యాఖ్యలపై పీఠపురం సీటుపై మాజీ ఎమ్మెల్యే, టీడీపీ కీలక నేత ఎస్వీఎస్‌ఎన్ వర్మ భిన్నంగా స్పందించారు. ఎన్నికల్లో పిఠాపురం శాసనసభ స్థానం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేయకుంటే ఆయన స్థానంలో తాను పోటీకి సిద్ధంగా ఉన్నానని మాజీ ఎమ్మెల్యే ఎస్వీఎస్‌ఎన్ వర్మ తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు తన సీటును పవన్ కళ్యాణ్ కోసం త్యాగం చేశానని వెల్లడించారు.
పవన్ తప్ప ఎవరు పోటీ చేసినా బరిలో ఉంటా : వర్మ
పవన్ కళ్యాణ్ కాకుండా జనసేన తరపున పిఠాపురం నుంచి వేరే వారు పోటీ చేస్తే తాను కూడా పోటీలో ఉంటానని తేల్చి చెప్పారు. పవన్ కళ్యాణ్ పిఠాపురం శాసనసభ స్థానం నుంచి కాకుండా కాకినాడ నుంచి ఎంపీగా పోటీ చేస్తే తాను తప్పుకుండా పొత్తులో భాగంగా పిఠిపురం స్థానంలో పోటి చేస్తానని వెల్లడించారు. తాజాగా కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలులో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన ఈ విషయాన్ని అందరికీ తెలియజేశారు. దాదాపు 20 సంవత్సరాలగా టీడీపీకోసం పనిచేస్తున్నాని తెలిపారు. అయితే టీడీపీ అధినేత చంద్రబాబు ఆదేశాల మేరకు పొత్తులో భాగంగా తన స్థానాన్ని జనసేన కోసం కేటాయించడం జరిగిందన్నారు. ఎంతో బాధతో తన స్థానాన్ని వదులుకున్నానన్నారు. పొత్తులో భాగంగా పవన్ కళ్యాణ్ విజయానికి తాను కృషి చేస్తానని తెలిపారు.
తన కోసం ఉదయ్ శ్రీనివాస్ సీటు త్యాగం చేశారన్న పవన్
మంగళవారం తన పార్టీ కార్యాలయంలో నిర్వహించిన మీడీయా సమావేశంలో మాట్లాడిన పవన్ కళ్యాణ్ పిఠాపురం, కాకినాడ స్థానాలపై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్ర పెద్దలు తనకి లోక్ సభ, శాసనసభ స్థానాల్లోనూ పోటీ చేయమన్నారని పవన్ కళ్యాణ్ వెల్లడించారు. అయితే తనకు మాత్రం శాసనసభకు పోటీ చేయడమే ఇష్టం అని తెలిపారు. దీని కారణంగానే తాను పిఠాపురం నుంచి శాసనసభకు పోటీ చేస్తున్నట్లు వెల్లడించారు. ముందు రాష్ట్రానికి పని చేస్తానని తర్వాత దేశానికి పనిచేస్తానని పేర్కొన్నారు. అయితే ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షాలు లోక్ సభకు పోటీ చేయాలని కోరితే తాను కాకినాడ ఎంపీగా పోటీ చేస్తానని తెలిపారు. అలాంటి పరిస్థితుల్లో ప్రస్తుతం కాకినాడ ఎంపీ అభ్యర్థిగా ఉన్న ఉదయ్ శ్రీనివాస్ తన స్థానంలో పిఠాపురం నుంచి పోటీ చేస్తారని వెల్లడించారు.
పవన్ వ్యాఖ్యలతో గందరగోళం పెరుగుతోందా ?
పవన్ కళ్యాణ్ పోటీ చేయబోయే పిఠాపురం స్థానం నుంచి.. పార్టీ పెద్దల నిర్ణయిస్తే తనకు బదులుగా ఉదయ్ శ్రీనివాస్ పోటీ చేస్తారని తెలిపారు. పవన్ కళ్యాణ్ కోసం సీటు వదులుకున్న టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించికున్నాయి. వీరు ఇరువురు చేసిన వ్యాఖ్యలతో ప్రస్తుతం పిఠాపురం స్థానంపై రాజకీయ వేడి మొదలైంది. పవన్ కోసమే తాను సీటు వదులుకున్నానని తన స్థానంలో వేరు వారు పోటీ చేస్తే మాత్రం తాను తప్పుకుండా పోటీకి సిద్ధమవుతానని వర్మ కుండబద్దలు కొట్టారు.