Janasena Nagababu Cabinet Entry:  ఆంధ్రప్రదేశ్ రాజకీయంలో జనసేన సీనియర్ నేత, ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబుకు కేబినెట్ హోదాతో కూడిన  ఆంధ్రప్రదేశ్ సైంటిఫిక్ అండ్ ఎకోలాజికల్ గ్రీనింగ్, రీఫారేస్టేషన్ ప్రాజె  కార్యనిర్వాహక కమిటీ ఛైర్మన్ పదవిని కేటాయించారు.   ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పర్యవేక్షిస్తున్న పర్యావరణ, అటవీ శాఖ  పరిధిలోనే ఈ నియామకం జరగడం, దానికి కేబినెట్ ర్యాంకు హోదా కల్పించడంతో.. నాగబాబుకు ప్రత్యక్షంగా మంత్రివర్గంలో  చోటు దక్కే అవకాశాలకు ముగింపు పడినట్లేననే భావిస్తున్నారు. 

Continues below advertisement

గతంలో నాగబాబును మంత్రిని చేస్తామని చెప్పిన పవన్ 

గతంలో నాగబాబును ఎమ్మెల్సీగా సభలోకి పంపే ముందు, భవిష్యత్తులో జరిగే కేబినెట్ విస్తరణలో ఆయనకు మంత్రి పదవి కట్టబెడతారనే ప్రచారం విస్తృతంగా సాగింది. పవన్ కళ్యాణ్ కూడా గతంలో తమ సోదరుడి సేవలను ప్రభుత్వంలో తగిన రీతిలో ఉపయోగించుకుంటామని సంకేతాలిచ్చారు. అయితే, ఎమ్మెల్సీ అయిన తర్వాత కేబినెట్ విస్తరణ వాయిదా పడుతూ రావడం, తీరా ఇప్పుడు హఠాత్తుగా ఒక కమిటీ ఛైర్మన్ పదవికి కేబినెట్ ర్యాంక్ ఇచ్చి సరిపెట్టడం వెనుక పవన్ కళ్యాణ్ అత్యంత వ్యూహాత్మకంగా వెనక్కి తగ్గినట్లు కనిపిస్తోంది.

Continues below advertisement

విమర్శలు రాకుండా ఉండటానికేనా? 

ఈ హఠాత్ మార్పు వెనుక ప్రధానంగా కుటుంబ పాలన అనే ముద్ర పడకుండా చూసుకోవడమే పవన్ ప్రధాన ఉద్దేశమని  భావిస్తున్నారు. ఇప్పటికే జనసేన అధినేతగా పవన్ ఉపముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి సమయంలో సొంత సోదరుడిని నేరుగా మంత్రివర్గంలోకి తీసుకుంటే, విపక్ష  వైసీపీకి ఆయాచితంగా ఆయుధం ఇచ్చినట్లవుతుందని పవన్ ముందే ఊహించారు. గతంలో వైసీపీ ప్రభుత్వంపై  స్వపక్షపాతం పేరిట చేసిన విమర్శలే తమకు రివర్స్ కాకుండా ఉండేందుకే పవన్ ఈ జాగ్రత్త వహించినట్లు తెలుస్తోంది. మరోవైపు కూటమి ప్రభుత్వంలో  సర్దుబాటు , సామాజిక సమీకరణలు కూడా కీలక పాత్ర పోషించాయి. టీడీపీ-జనసేన-బీజేపీ కూటమిలో పరిమిత సంఖ్యలో ఉన్న మంత్రి పదవుల కోసం తీవ్ర పోటీ ఉంది. స్వయంగా డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్, తన శాఖల కేటాయింపుల్లో సొంత సోదరుడికే మంత్రి పదవి ఇస్తే పార్టీలోని ఇతర సీనియర్ నాయకులు, కాపు సామాజిక వర్గం ,  ఇతర బీసీ నేతలలో అసంతృప్తి రగిలే ప్రమాదం ఉంది. అందుకే, పార్టీ బ్యాలెన్స్ దెబ్బతినకుండా ఉండేందుకు కూటమి సమీకరణలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయానికి వచ్చినట్లు స్పష్టమవుతోంది.

నాగబాబుకు హోదాతోనే సరి!

 నాగబాబుకు కేబినెట్ హోదా ఇచ్చి ఆయన సీనియారిటీకి, సేవలకు తగిన గౌరవం ఇచ్చినట్లు కనిపిస్తున్నప్పటికీ, ప్రత్యక్ష మంత్రివర్గంలోకి మాత్రం ఆయనకు ప్రవేశం లేకుండా ఒక స్పష్టమైన సరిహద్దు గీసినట్లయింది. దీని ద్వారా ప్రభుత్వంపై వచ్చే కుటుంబ పాలన విమర్శల ముల్లును తుంచివేయడంతో పాటు, పార్టీకి, అన్నకు ఇద్దరికీ న్యాయం చేసినట్లు పవన్ తన రాజకీయ పరిణతిని చాటుకున్నారని చెప్పవచ్చు. భవిష్యత్తులో కేబినెట్ విస్తరణ జరిగినా నాగబాబు పేరు ఇక రేసులో ఉండదనే విషయాన్ని ఈ నియామకం ద్వారా స్పష్టంగా తేల్చేశారని క్లారిటీ వచ్చేసినట్లయింది.