AP Minister Appalraju :   ఆంధ్రప్రదేశ్‌లో ఏ క్షణమైనా ఎన్నికలు జరగవచ్చని మంత్రి సీదిరి అప్పలరాజు చేసిన ప్రకటన ఇప్పుడు రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది. మనము ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ఉన్నామని ఆయన పార్టీ కార్యకర్తలకు స్పష్టం చేశారు. పలాస నియోజకవర్గంలో  మంత్రి క్యాంప్ ఆఫీస్‌ను ప్రారంభించారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు ధర్మాన కృష్ణదాస్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించి.. నియోజకవర్గ పార్టీ కార్యకర్తలందరితో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ముందస్తు ఎన్నికల ప్రస్తావన తీసుకు వచ్చారు.  ఎప్పుడైనా ఎన్నికలు రావొచ్చని కార్యకర్తలు అంతా సిద్ధంగా ఉండాలని ఆయన పిలుపునిచ్చారు. గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ఇప్పటికే ఎన్నికల ప్రచారం చేస్తున్నామని మంత్రి అప్పలరాజు చెప్పుకొచ్చారు. అప్పలరాజు మాటలు కార్యకర్తల్లో చర్చనీయాంశమయ్యాయి. 


వైఎస్ఆర్‌సీపీ హైకమాండ్ ఇచ్చిన అనధికార సంకేతాలతోనే మంత్రి వ్యాఖ్యలు ?


ఇటీవల వైఎస్ఆర్‌సీపీ  అగ్ర నేతలు కొంత మంది ముఖ్య నేతలకు.. ముందస్తు ఎన్నికలపై సంకేతాలు ఇచ్చిందని ఆ పార్టీలో ప్రచారం జరుగుతోంది. 2024 ఏప్రిల్‌లో షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ అప్పుడు పార్లమెంట్‌తో పాటు ఎన్నికలు జరుగుతాయి. అలా జరగడం ఏపీ ప్రభుత్వ పెద్దలకు ఇష్టం లేదని.. అంటున్నారు. జమిలీ ఎన్నికలు జరిగితే.. కేంద్ర ప్రభుత్వ అంశాలే హైలెట్ అయ్యే అవకాశం ఉంది. అదే రాష్ట్రానికి విడిగా ఎన్నికలు జరిగితే.. రాష్ట్ర అజెండా మేరకు ఎన్నికల అజెండా సెట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే.. తెలంగాణతో పాటు ఎన్నికలకు వెళ్లే చాన్స్ ఉందని భావిస్తున్నారు. తెలంగాణకు వచ్చే ఏడాది నవంబర్‌లోనే ఎన్నికలు జరగనున్నాయి. 


ఆరు నెలల ముందుగా ఎన్నికలకు వెళ్లడం మంచిదని పీకే టీం సలహా ?


మరోసారి గెలవాలంటే తప్పకుండా ముందస్తు ఎన్నికలు వెళ్లాలని జగన్ గట్టిగా నమ్ముతున్న ప్రశాంత్ కిషోర్ టీం సలహా ఇచ్చిందని వైసీపీలో కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది.అందుకే జగన్ ముందస్తు సన్నాహాలు ప్రారంభించారని చెబుతున్నారు. గతంలో తెలంగాణలో కేసీఆర్‌ అనుసరించిన విధానాన్నే పాటిస్తూ.. షెడ్యూల్‌ కన్నా ఆరు నెలల ముందే ఎన్నికలకు వెళ్లాలని.. వైసీపీ అధినేత జగన్‌ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. దానికి సన్నాహకంగా ఈ నవంబర్‌ నుంచి బస్సు యాత్ర చేపట్టాలని అనుకుంటున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎమ్మెల్యే అభ్యర్థుల ఎంపికపై కూడా పీకే టీమ్‌ సర్వే మొదలుపెట్టింది.  గడప గడపకు కార్యక్రమం వల్ల   ఎమ్మెల్యేల్లో ప్రజల పట్ల ఉన్న స్పందనను తెలుసుకుంటున్నారు.  కొందరు ఎమ్మెల్యేలు ప్రజల నుంచి నిరసన సెగ ఎదుర్కొన్నారు. వీరందరి జాబితాను పీకే టీమ్‌ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. 


విపక్షాలు సన్నద్ధం కాక ముందే ఎన్నికల భేరీ !


ముందస్తు ఎన్నికల సన్నాహంలో భాగంగానే ఈమధ్య జగన్ పథకాల వేగం పెంచారు. ఉచితాలు కూడా ఊపందుకున్నాయి. మరోవైపు మూడు రాజధానుల మూడుముక్కలాట  జోరు కూడా పెరిగింది. అధికారపార్టీ ఈ సన్నద్ధతలో భాగంగా తన వ్యూహాలు పటిష్టం చేసుకోవడంతో పాటు ప్రతిపక్షాల జోరు పెరగకుండా పగ్గాలు వేసే పనిలో కూడా గట్టిగా నిమగ్నం అయింది.ఒక పక్క తెలుగుదేశం నుంచి నాయకులను ఆకర్షించే వ్యూహాలు అమలు చేస్తూనే, మరో పక్క పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్లెం వేయడంపై ఎక్కువ దృష్టి పెడుతోంది అధికార పార్టీ. ప్రస్తుత పరిణామాలు దీన్నే నిర్ధారిస్తున్నారు.