Minister Komatireddy Sensational Comments: రాష్ట్రంలో బీఆర్ఎస్ దుకాణం బంద్ అయిపోయిందని.. ఆ పార్టీ అధినేత కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు చేసిన పాపాలే ఆయనకు చుట్టుకున్నాయని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatreddy) మండిపడ్డారు. హైదరాబాద్ లో మీడియాతో నిర్వహించిన చిట్ చాట్ లో ఆయన మాట్లాడారు. కేసీఆరే పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారని.. గేట్లు తెరవకముందే కాంగ్రెస్ లోకి ఇతర పార్టీల నేతలు వస్తున్నారని అన్నారు. బీజేపీలోని 8 మంది ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ లోకి వస్తారని చెప్పారు. ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు, బీజేపీకే పోటీ అని వెల్లడించారు. భువనగిరి టికెట్ గురించి తాను కానీ, రాజగోపాల్ రెడ్డి కానీ అడగలేదని స్పష్టత ఇచ్చారు. ప్రభుత్వాన్ని కూలగొడతామని బెదిరింపులకు దిగితే ప్రజలు ఊరుకోరని.. తిరుగుబాటు చేస్తారని అన్నారు. ఇదేమైనా.. మధ్యప్రదేశ్, మహారాష్ట్రనా అని ప్రశ్నించారు. 


'కేసీఆర్ మొదటి తప్పు అదే'


యాదగిరిగుట్ట పేరును మార్చడమే కేసీఆర్ చేసిన మొదటి తప్పు అని కోమటిరెడ్డి అన్నారు. అక్కడ అవినీతి జరిగిందని.. ఎన్నికల తర్వాత దీనిపై విచారణ చేపడతామని చెప్పారు. యాదాద్రి పేరును మళ్లీ యాదగిరిగుట్టగా మారుస్తామని అన్నారు. 'కేసీఆర్ పాపాల వల్లే కరువు వచ్చింది. కాంగ్రెస్ అంటేనే వర్షం. వర్షం అంటేనే కాంగ్రెస్. దేవుడి పేరుతో కాళేశ్వరం ప్రాజెక్ట్ కట్టి సర్వనాశనం చేశారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వస్తారు.?. అధికారులతో పాపపు పనులు చేయించారు. దీంతో భయంతో వారు నిద్రపోవడం లేదు. కేసీఆర్ ప్రతిదీ రాజకీయం చేశారు. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఏ రాష్ట్రంలోనూ చూడలేదు. అవినీతిని చూస్తుంటే రావుందరూ ఒకే దగ్గర జమయ్యారు. కేసీఆర్ అవినీతిని తీయాలంటే మాకు 20 ఏళ్ల పడేటట్లు ఉంది. పార్లమెంట్ లో కాంగ్రెస్ వర్సెస్ బీజేపీకి మాత్రమే పోటీ. మా అన్నదమ్ముల మధ్య ఎలాంటి విభేదాలు లేవు.' అని కోమటిరెడ్డి పేర్కొన్నారు..


కేటీఆర్ పై విమర్శలు


మూడు పిల్లర్లు కుంగితే ఏమవుతుందని కేటీఆర్ అంటున్నారని.. ఫోన్ ట్యాప్ చేస్తే చేసి ఉంటారని నిర్లక్ష్యంగా అంటున్నారని కోమటిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనపై సుమోటోగా కేసు పెట్టాలన్నారు. 'ఫోన్ ట్యాప్ చేసినట్లు కేటీఆర్ ఒప్పుకున్నారు. దీని మీద కోర్టుకు వెళ్తే అరెస్ట్ అవుతారు.' అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 


థియేటర్ల దోపిడీపై


సినిమా టికెట్ల ధరలు పెంచడం సరికాదని.. కొన్ని సినిమా థియేటర్లలో స్నాక్స్ రేట్లు పెంచి ప్రేక్షకులను ఇబ్బంది పెడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు. మా శాఖ అధికారులు థియేటర్లకు వెళ్లి టికెట్, స్నాక్స్ కొని బిల్లులు తెమ్మని చెప్పామని.. అవి రాగానే నిబంధనలు మీరిన వారిపై కఠిన చర్యలు ఉంటాయని స్పష్టం చేశారు. బడ్జెట్ పెంచుకుని సినిమాలు తీసి.. రేట్లు పెంచాలి అని అడిగితే ఎలా.? అని నిలదీశారు. చిన్న సినిమాలు తీసిన వారికి కనీసం థియేటర్లు దొరకడం లేదని అన్నారు.


Also Read: BRS on Kadiam : కడియం నమ్మక ద్రోహి - ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేతల డిమాండ్