మణిపూర్‌ లో హింసాకాండ ఇప్పట్లో ఆగేటట్లు కనిపించడం లేదు.  నిత్యం ఏదోక మూల అల్లరిమూకలు రెచ్చిపోతునే ఉన్నారు. కొంతకాలం క్రితం ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి అత్యాచారం, హత్య తర్వాత ఈ వివాదం మరో మలుపు తిరిగింది. దేశవ్యాప్తంగా దీనిపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ ఘటనలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోంది. సభ్య సమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఈ ఘటనపై సుప్రీంకోర్టు కూడా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. కేంద్రం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలంటూ నోటీసులు కూడా ఇచ్చింది. సుప్రీంకోర్టు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పిన కేంద్రం ఈ కసును సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఒక అఫిడవిట్‌ దాఖలు చేసింది. 


ఈ క్రమంలోనే కేసును సీబీఐకి బదిలీ చేస్తున్నట్లు సుప్రీం కోర్టుకు కేంద్ర ప్రభుత్వం వివరించింది. అంతే కాకుండా ఈ కేసు విచారణ మణిపూర్‌ రాష్ట్రానికి బయటనే జరిగేలా చూడాలని సుప్రీం కోర్టును కేంద్ర హోంశాఖ కోరింది.  దీంతో కేసు సీబీఐకి బదిలీ అయ్యింది. అంతేకాకుండా కేసు విచారణ కేవలం ఆరు నెలల వ్యవధిలోనే పూర్తి అయ్యే విధంగా ఆదేశాలు జారీ చేయాలని సుప్రీం కోర్టును కేంద్రం కోరింది. 


కేసు సీబీఐకి బదిలీ కావడంతో విచారణ త్వరగానే పూర్తవుతుందని నమ్ముతున్నట్లు కేంద్రం తెలిపింది. ఈ విషయం మణిపూర్‌ రాష్ట్ర ప్రభుత్వానికి  సంబంధించినది అయినప్పటికీ కూడా కేంద్రం తన శాయశక్తుల న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నట్లు  కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్‌ భల్లా పేర్కొన్నారు. 


ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో బయటకు వచ్చినప్పటి నుంచి కేంద్రం ఈ కేసు గురించి తెలుసుకుంటూనే ఉంటున్నట్లు ఆయన వివరించారు. ఇప్పటికీ ఇంకా హింసాకాండ జరుగుతూనే ఉండటంతో బాధితులకు ప్రభుత్వం ఏదైనా సహాయక చర్యలు చేపట్టి వెంటనే పరిస్థితులు చక్కదిద్దాలని కేంద్రానికి సుప్రీంకోర్టు సూచించింది. వారికి జీవనోపాధి పొందే విధంగా తగిన సహాయం అందించాలని, వృత్తి పరమైన శిక్షణతోపాటు హింసల వల్ల నష్టపోయిన వారికి తగిన ఉద్యోగావకాశాలు కూడా కల్పించడానికి కృషి చేస్తున్నట్లు కేంద్రం సుప్రీంకి తెలిపింది. 


పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి నిత్యావసరాలతోపాటు  మందులు అదుబాలుటులో ఉండేలా అన్ని శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్టు సుప్రీం కోర్టుకు కేంద్రం వివరించింది. ఎప్పుడైతే మణిపూర్‌ లో హింస మొదలైందో ఆనాటి నుంచి సాయుధ పోలీసు బలగాలు రాష్ట్రంలో మోహరించినట్లు కేంద్రం తెలిపింది. మణిపూర్‌లో 124 అదనపు కంపెనీల సాయుధ పోలీసులు, 185 ఆర్మీ అసోం రైఫిల్స్ తో పాటు స్థానిక పోలీసులు కూడా మోహరించినట్లు కేంద్రం పేర్కొంది.


ఈ అంశాలన్నింటి గురించి సుప్రీం కోర్టు జులై 28 న విచారణ చేపట్టనుంది. మణిపూర్‌ ఇద్దరు మహిళల వీడియో ఎప్పుడైతే బయటకు వచ్చిందో ఆనాడే సుప్రీం కోర్టు ఈ కేసును సుమోటోగా స్వీకరించింది. ఈ ఘటన అందరినీ ఎంతో కలవరపరిచిందని తెలిపింది. సీజేఐ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఘటనలో ప్రమేయం ఉన్న ప్రతి ఒక్కరిని వెంటనే పట్టుకుని శిక్షించాలని పోలీసు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇకపై ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆదేశాలు జారీ చేయడంతోపాటు, రాష్ట్రంలో ఎలాంటి హింసాకాండ జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని ధర్మాసనం ఆదేశించింది.