Lokesh era Starts in TDP:  తెలుగుదేశం పార్టీలో అధికారికంగా నాయకత్వ మార్పు దిశగా అడుగులు పడుతున్నాయి.   252 మందితో కూడిన నూతన కార్యవర్గం ప్రమాణస్వీకారం బాధ్యతల్లోకి వచ్చింది. పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా నారా లోకేష్ బాధ్యతలు చేపట్టడం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. కేవలం చంద్రబాబు కుమారుడిగా కాకుండా,  ఐదేళ్లలో పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు క్షేత్రస్థాయిలో తిరిగి,  యువగళం పాదయాత్ర ద్వారా కేడర్‌లో భరోసా నింపిన లోకేష్‌కు ఇది లభించిన అసలైన గుర్తింపు. ఇప్పుడు అధికారిక హోదాతో పార్టీ పగ్గాలు చేపట్టడం ద్వారా టీడీపీలో లోకేష్ శకం ప్రారంభమవుతోందని అనుకోవచ్చు. 

Continues below advertisement

లోకేష్ చేతుల్లోకి పార్టీ 

లోకేష్‌కు కొత్త బాధ్యతలు చంద్రబాబు నాయుడు వ్యూహాత్మక ఆలోచనగా కనిపిస్తోంది. ముఖ్యమంత్రిగా రాష్ట్ర పాలనపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాల్సి ఉన్నందున, పార్టీ వ్యవహారాలను నమ్మకమైన, చురుకైన చేతుల్లో పెట్టాలని ఆయన నిర్ణయించుకున్నారు. లోకేష్ వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బాధ్యతలు తీసుకోవడం వల్ల చంద్రబాబు కేవలం సూపర్ విజన్ కే పరిమితమై, పార్టీ వ్యూహరచనలో దిశానిర్దేశం చేసే అవకాశం ఉంటుంది. తద్వారా అటు ప్రభుత్వం, ఇటు పార్టీ రెండూ బ్యాలెన్స్‌డ్‌గా నడవాలన్నదే అధిష్టానం ఆలోచన.

Continues below advertisement

లోకేష్ ఆలోచన మేరకే కార్యవర్గం 

లోకేష్ తన ఇమేజ్‌ను మార్చుకోవడంలో విజయవంతమయ్యారు. 2019లో ఎదురైన ఓటమి నుంచి పాఠాలు నేర్చుకుని, గ్రౌండ్ లెవల్‌లో కార్యకర్తలతో మమేకమై వారి కష్టసుఖాల్లో తోడు నిలిచారు. సోషల్ మీడియాలో తనపై వచ్చే విమర్శలను తిప్పికొట్టడమే కాకుండా, ప్రత్యర్థులకు గట్టి కౌంటర్ ఇచ్చే స్థాయికి ఎదిగారు. ఇప్పుడు తన టీమ్  తో కలిసి పని చేసే క్రమంలో, పార్టీలో తనదైన ముద్ర వేయడమే కాకుండా 2029 లక్ష్యంగా యువతను పెద్ద ఎత్తున పార్టీ వైపు ఆకర్షించే బాధ్యత ఆయనపై ఉంది.

పార్టీని జెన్ జీ కి దగ్గర చేసే పనితీరు

నూతన కార్యవర్గంలో 252 మందికి చోటు కల్పించడం వెనుక సామాజిక సమీకరణాలు, ప్రాంతీయ సమతుల్యత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అటు సీనియర్ల అనుభవాన్ని గౌరవిస్తూనే, ఇటు యువతకు పెద్దపీట వేయడం ద్వారా పార్టీలో కొత్త ఉత్సాహాన్ని నింపే ప్రయత్నం చేశారు. లోకేష్ సారథ్యంలో పని చేసే ఈ టీమ్.. గ్రామ స్థాయి నుండి పార్టీని బలోపేతం చేయడంతో పాటు, ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వంతెనలా పని చేయాల్సి ఉంటుంది. 

నారాలోకేష్‌కు అంత తేలిక కాదు!

లోకేష్‌కు ఇది ఒక అగ్నిపరీక్ష లాంటిదే. అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నడపడం ఒక ఎత్తు అయితే, ప్రజల అంచనాలకు అనుగుణంగా పార్టీని పటిష్టం చేయడం మరో ఎత్తు. పట్టుదలకు మారుపేరుగా నిలిచిన లోకేష్, ఇప్పుడు తన పరిపాలన దక్షతను పార్టీ వ్యవహారాల్లో ఎలా చూపిస్తారో వేచి చూడాలి.   ప్రమాణస్వీకారం కేవలం ఒక కార్యక్రమం మాత్రమే కాదు.. అది తెలుగుదేశం పార్టీ భవిష్యత్ దిశను నిర్దేశించే ఒక నూతన అధ్యాయం అనుకోవచ్చు.