Lavu Meet Chandrababu: సార్వత్రిక ఎన్నికలు దగ్గరపడుతున్న కొద్దీ ఏపీలో రాజకీయాలు శరవేగంగా మారిపోతున్నాయి. వైసీపీ(YSRCP) చేపట్టిన రాజకీయ బదిలీలపై అసంతృప్తిగా ఉన్న కొందరు నేతలు అధికార పార్టీని వీడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం (TDP)పక్షాన కొందరు చేరగా.. మరికొందరు ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఎంపీ పదవికి, పార్టీకి రాజీనామా చేసిన నరసరావుపేట ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులు (Lavu Sri Krishna Devarayalu) చంద్రబాబును ఆయన నివాసంలో కలిశారు. త్వరలోనే  ఆయన సైకిల్ ఎక్కనున్నారని ప్రచారం జరుగుతోంది.
టీడీపీలోకి చేరికలు
పొత్తుల వ్యవహారం, సీట్ల కేటాయింపు  కొలిక్కి వస్తుండటంతో  తెలుగుదేశం(TDP) అధినేత చంద్రబాబు నివాసం వద్ద కొద్ది రోజులుగా  సందడి వాతావరణం నెలకొంది. వివిధ నియోజకవర్గాల నుంచి పెద్దఎత్తున నేతలు టీడీపీలో చేరేందుకు ఆసక్తిగా ఉన్నారు. ఆయా నియోజకవర్గాల బాధ్యులు వారిని తాడేపల్లికి పంపిస్తున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరేందుకు మార్గం సుగమం చేసుకుంటున్న  కీలక నేతలు సైతం వారి అనుచరగణంతో అక్కడికి చేరుకుని అధినేతతో సంప్రదింపులు జరుపుతున్నారు. దీంతో వారం, పదిరోజులుగా ఆయన నివాసం వద్ద జనం తాకిడి పెరిగింది. 
టీడీపీలోకి లావు!
తెలుగుదేశంపార్టీలో చేరికల్లో భాగంగా నరసరావుపేట(Narasaraopet) వైసీపీ మాజీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు  ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఇటీవలే ఎంపీ పదవికి, వైసీపీ(YCP)కి రాజీనామా చేసిన ఆయన... త్వరలోనే తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. ఇప్పటికే నియోజకవర్గం వ్యాప్తంగా ఆయన అభిమానులు  తెలుగుదేశం ఫ్లెక్సీలతో నింపేశారు. ఈనెల 22న ఆయన సైకిల్ ఎక్కనున్నట్లు  సమాచారం. నరసరావుపేట ఎంపీ టిక్కెట్ పై హామీ వచ్చిన తర్వాతే ఆయన వైసీపీకి రాజీనామా చేసినట్లు తెలిసింది. కొంతకాలంగా  వైసీపీ అధిష్టానం తీరుపై అసంతృప్తిగా ఉన్న లావు.... పార్టీ కార్యక్రమాల్లోనూ అంటీముట్టనట్లుగానే   పాల్గొంటున్నారు.


వైసీపీ అధినాయకత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా  ఆయన అమరావతి రైతులకు మద్దతు సైతం తెలిపారు. అప్పటి నుంచే ఆయనకు పార్టీతో సత్సంబంధాలు తెగిపోయాయని సమాచారం. పైగా నరసరావుపేట సీటును వేరొకరికి ఇస్తామని...గుంటూరు నుంచి ఈసారి పోటీ చేయాల్సిందిగా జగన్(Jagan) ఆయనకు సూచించారు. తాను నరసరావుపేట నుంచే బరిలో ఉంటానని లావు తెగేసే చెప్పారు. దీనిపై వైసీపీ అధిష్టానం నుంచి ఎలాంటి సానుకూల నిర్ణయం రాకపోవడంతో ఆయన ఆ పార్టీకి, ఎంపీ పదవికి రాజీనామా చేశారు. అంతకు ముందే ఆయనకు తెలుగుదేశం నుంచి ఎంపీ టిక్కెట్ ఆఫర్ వచ్చింది. అందులో భాగంగానే ఆయన చంద్రబాబును కలిశారు. త్వరలోనే లావు శ్రీకృష్ణ దేవరాయులు పసుపు కండువా కప్పుకోవడం ఖాయమని తేలిపోయింది. 
భారీగా చేరికలు
ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయులతోపాటు పెద్దఎత్తున వైసీపీ శ్రేణులు తెలుగుదేశంలో చేరనున్నారు. ఆ పార్టీ సీనియర్ నేత అట్లా చిన్న వెంకట్ రెడ్డి వంద కార్లతో భారీ కాన్వాయ్ తో చంద్రబాబు నివాసం వద్దకు చేరుకుకున్నారు. వీరితో వివిధ నియోజకవర్గాల నుంచి తరలివచ్చిన నేతలు, కార్యకర్తలతో చాలారోజుల తర్వాత చంద్రబాబు నివాసం కళకళలాడుతోంది. వైసీపీకి చెందిన కీలక నేతలు తమతో టచ్లో ఉన్నారని చంద్రబాబు చెప్పిన 24గంటల్లోనే ఆ పార్టీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయులు కలవడం వైసీపీని కలవరపెడుతోంది. ఇంకా ఎంతమంది నేతలు పార్టీని వీడిపోతారోనని అంచనా వేస్తోంది