టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ .. తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌కు లీగల్ నోటీసులు జారీ చేశారు. తనపై అసత్య ఆరోపణలు చేస్తున్నారని వాటికి ఆధారాలు ఉంటే బయట పెట్టాలని లేకపోతే బహిరంగ క్షమాపణ చెప్పాలని కేటీఆర్ నోటీసుల్లో డిమాండ్ చేశారు. మంత్రి కేటీఆర్ గారి పాపులారిటీని దృష్టిలో ఉంచుకొని, ఆయనపై నిరాధార పూరితమైన ఆరోపణలు చేసి ప్రచారం పొందాలన్న దురుద్దేశంతోనే బండి సంజయ్ అబద్ధాలు చెప్పారని కేటీఆర్ న్యాయవాది అంటున్నారు. ఒక జాతీయ స్థాయి పార్టీ కి ప్రాతినిధ్యం వహిస్తున్న బండి సంజయ్ ప్రజా జీవితంలోని కనీస ప్రమాణాలు పాటించకుండా... కేవలం ప్రచారం పొందాలన్న యావతో ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల అంశాన్ని తన క్లైంట్ కేటీఆర్ కి ఆపాదించే దురుద్దేశ పూర్వకమైన ప్రయత్నం చేశారని కేటీఆర్ తరపున నోటీసులు జారీ చేసిన న్యాయవాది తెలిపారు. మంత్రి కేటీఆర్ గారి పరువుకు కలిగించేలా, అసత్య పూరిత వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ సివిల్ మరియు క్రిమినల్ చట్టాల ప్రకారం మంత్రి కేటీఆర్ కి పరిహారం చెల్లించడంతో పాటు చట్టప్రకారం తగిన చర్యలకు అర్హులవుతారని నోటీసుల్లో పేర్కొన్నారు. 48 గంటల్లో తన క్లైంట్ కేటీఆర్ కి బేషరతుగా క్షమాపణ చెప్పాలన్నారు.
బండి సంజయ్ తన పాదయాత్రలోని ఓ సభలో మాట్లాడుతూ తెలంగాణలో 27 మంది ఇంటర్ విద్యార్థులు చనిపోవడానికి కేటీఆర్ కారణం అన్నారు. అయినప్పటికీ కేటీఆర్‌పై కేసీఆర్ చర్యలు తీసుకోలేదన్నారు. ఈ వీడియోను తెలంగాణ బీజేపీ తన ట్విట్టర్‌లో పోస్ట్ చేసింది. ఈ ఆరోపణలు తీవ్రంగా ఉండటంతో కేటీఆర్ సీరియస్‌గా స్పందించారు. ఇలాంటి నిరాధారణ ఆరోపణలు ఆపకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఇలాంటి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు ఉన్నా ప్రజల ముందు పెట్టాలని లేకపోతే బహిరంగ క్షమాపణలు చెప్పాలని కేటీఆర్ గురువారం ట్విట్టర్‌లో డిమాండ్ చేశారు. అయినా బండి సంజయ్ స్పందించకపోవడంతో తన న్యాయవాది ద్వారా లీగల్ నోటీస్ జారీ చేశారు.
గత ఏడాది డిసెంబర్‌లో విడుదలైన ఇంటర్ ఫలితాల్లో 51 శాతం మంది విద్యార్థులు ఫెయిల్ అయ్యారు. ఈ కారణంగా పలువురు విద్యార్థులు మనస్థాపానికి గురై.. బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఓ విద్యార్థి ఏకంగా తన మరణానికి కేటీఆర్ కారణం అంటూ ట్వీట్ చేశారు. ఇలా మొత్తం దాదాపుగా ఇరవై ఏడు మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారు. కరోనా కారణంగా క్లాసులు సరిగ్గా జరపకపోయినా కఠినమైన పరీక్షలు పెట్టారని అందుకే బాగా చదివేవారు కూడా ఫెయిలయ్యారని విద్యార్థులు ఆందోళనకు దిగారు. రాజకీయ పార్టీలన్నీ మద్దతు ఇచ్చాయి. విద్యార్థుల ఆత్మహత్యలు అంతకంతకూ పెరిగిపోతూండటంతో తెలంగాణ ప్రభుత్వం పరిస్థితిని రివ్యూ చేసి..అందర్నీ పాస్ చేయాలని నిర్ణయించుకుంది. అప్పుడే బీజేపీ నేతలు విద్యార్థుల ఆత్మహత్యలకు కేటీఆర్ కారణం అని ఆరోపించడం ప్రారంభించారు. బండి సంజయ్ కూడా అప్పట్లో ఈ ఆరోపణలు చేశారు. తాజాగా పాదయాత్రలోనూ అవే ఆరోపణలు రిపీట్ చేశారు. అయితే కనీసం విద్యా శాఖ మంత్రి కూడా కేటీఆర్ కాదు. పరీక్షలతో ఆయనకు ఎలాంటి సంబందం లేదు. అయినప్పటికీ బండి సంజయ్ ఆపకుండా అవే ఆరోపణలు చేస్తూండటంతో కేటీఆర్ న్యాయపరమైన చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.