KTR Comments On BJP : పార్లమెంట్‌లో కొన్ని పదాలను నిషేధజాబితాలో చేర్చడంపై తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండి పడ్డారు. నిజానికి ఆ పదాలన్నీ ఇతర పార్టీ నేతలపై బీజేపీ నేతలు చేసే వ్యాఖ్యలేనని ఆయన గుర్తు చేశారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ ప్రజా సమస్యలపై ఆందోళన చేసే వారిని ఆందోళన్ జీవి అంటూ ఎగతాళి చేసేవారని కేటీఆర్ గుర్తు చేశారు . ఎన్డీఏ సర్కార్‌ను నాన్ పర్ఫార్మింగ్ అసెట్ గా పేర్కొంటూ ఆ కూటమి నేతల పార్లమెంట్ లాంగ్వేజ్ ఇదే అని కేటీఆర్ కొన్నింటిని ఉదహరిస్తూ ట్వీట్ చేశారు.
పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న సందర్భంగా లోక్ సభ, రాజ్యసభలో ఎంపీలు కొన్ని పదాలను వాడకూడదని లోక్ సభ సెక్రటేరియట్ ఒక బుక్‌లెట్‌ను ఇటీవలే విడుదల చేశారు. ఇకపై ‘జుమ్లాజీవి’, ‘కొవిడ్ స్పైడర్’, ‘స్నూప్‌గేట్’, వంటి ఇంగ్లీష్ పదాలను పార్లమెంట్‌లో వాడటం నిషిద్ధం. దీంతోపాటు అవినీతిపరుడు, అసమర్థుడు, నాటకం, నటన, సిగ్గులేదు, ధోకేబాజ్ వంటి పదాలను అన్ పార్టమెంటరీ పదాలుగా గుర్తించింది. వాటిని ఉభయ సభల్లో సభ్యులు వాడటానికి వీలులేదు. వీటితో పాటు చంచా, చంచాగిరి, అసత్య, అహంకార్, గూన్స్, అప్‌మాన్, కాలా బజారీ, దలాల్, దాదాగిరీ, బేచారా, బాబ్‌కట్, లాలీపాప్, విశ్వాస్‌ఘాత్, బేహ్రీ సర్కారు, జుమ్లాజీవీ, శకుని, వంటి హిందీ పదాలు కూడా బుక్‌లెట్‌లో చోటు చేసుకున్నాయి.
అలాగే పార్లమెంట్‌లో నిరసనలు, ఆందోళనలుచేపట్టంపైనా ఆంక్షలు విధించారు. దీనిపై విపక్ష పార్టీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. తాము ఆ భాష వాడతామని. నిరసనలు వ్యక్తం చేస్తామని .. చర్యలు తీసుకుంటే తీసుకోవచ్చని సవాల్ చేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ తాము ఇతరులపై అనే మాటలను నిషేధించడాన్ని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ వాళ్లైతే అనొచ్చు.. ఇతర పార్టీల నేతలు అనకూడదా అని ప్రశ్నిస్తున్నారు. ఇటీవలి కాలంలో కేటీఆర్ వరుసగా బీజేపీ నేతలపై తీవ్రమైన విమర్శలు చేస్తున్నారు.