KTR vs Revanth Reddy:  ప్రజాస్వామ్య రాజకీయాల్లో ఒక నాయకుడి పనితీరు ఎంత ముఖ్యమో, ప్రజల్లో అతనికి ఉన్న ఇమేజ్  కూడా అంతే కీలకం. ముఖ్యంగా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాయకులు ఎంత వినమ్రంగా, ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తూ ముందుకు సాగితే అంత త్వరగా మళ్లీ పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే బిఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్  వైఖరిపై శ్రేణులు , నెటిజన్ల నుంచి నిరంతరం ఒకే విధమైన విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఆయన మాట్లాడే తీరు, వ్యవహరించే శైలిలో ఆత్మవిశ్వాసం కంటే అహంకారం  మోతాదే ఎక్కువగా కనిపిస్తోందన్న చర్చ తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎక్కువగా ఉంది. 

Continues below advertisement

కేటీఆర్ అహంకారం వల్లే పార్టీ ఓడిందన్న కవిత   

ఈ విమర్శలకు ఇటీవల చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు మరింత బలాన్ని చేకూర్చాయి. బిఆర్‌ఎస్ విడిపోయి సొంతంగా రాజకీయ బాట పట్టిన ఆయన సోదరి కల్వకుంట్ల కవిత సైతం కేటీఆర్ వైఖరిపై తీవ్రస్థాయిలో పరోక్ష విమర్శలు గుప్పించడం సంచలనంగా మారింది. గతంలో అసెంబ్లీ ఎన్నికల ఓటమికి  కెసిఆరే కారణం  అన్నట్లుగా ఆయన చేసిన వ్యాఖ్యలు, కార్యకర్తలతో ఫోన్ సంభాషణల్లో చూపించిన అసహనం, ఉపాధి  పథకాల కోసం అడిగిన సగటు మహిళను  పిల్లల్ని ఎవరి కోసం కన్నావ్  అని నిలదీసిన పాత సంఘటనలను ప్రస్తావిస్తూ.. కేటీఆర్ అహంకార ధోరణి పార్టీకి ఎంత నష్టం చేసిందో సోషల్ మీడియా వేదిక ప్రశ్నించారు. 

Continues below advertisement

కేటీఆర్‌ది ఆత్మవిశ్వాసమని చెబుతున్న బీఆర్ఎస్ నేతలు

వాస్తవానికి బిఆర్‌ఎస్ నాయకులు, కేటీఆర్ మద్దతుదారులు దీనిని అహంకారం అని ఒప్పుకోవడానికి సిద్ధంగా లేరు. ఆయన విద్యావంతుడని, డైనమిక్ లీడర్‌గా ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో ధారాళంగా మాట్లాడుతూ గ్లోబల్ విజన్‌తో నిర్ణయాలు తీసుకుంటారని, అది ఆయనకున్న  ఆత్మవిశ్వాసం  అని సమర్థించుకుంటారు. నగర పరిధిలోని కార్పొరేట్ వర్గాలు, ఐటీ రంగానికి కేటీఆర్ శైలి కనెక్ట్ అయినప్పటికీ, గ్రామీణ ప్రాంతాలు , బహుజన వర్గాల్లో మాత్రం ఈ ప్రవర్తన  దొరతనం  చూపిస్తున్నారనే వ్యతిరేక ముద్రకు  దారితీసింది. 2023 శాసనసభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్ ఓటమికి ఈ అహంకార ముద్ర కూడా ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు.  ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాతైనా ఈ ధోరణిలో మార్పు వస్తుందని ఆశించిన శ్రేణులకు నిరాశే ఎదురవుతోంది. క్షేత్రస్థాయి కార్యకర్తలు చిన్నపాటి సూచనలు చేసినా లేదా ప్రశ్నలు అడిగినా సహనం కోల్పోవడం, ప్రజా సమస్యలపై మాట్లాడేటప్పుడు అధికార పక్షాన్ని విమర్శించడంతో పాటు సామాన్యులను కూడా తక్కువ చేసి మాట్లాడటం కేటీఆర్‌కు రాజకీయంగా వ్యతిరేక అంశాలుగా మారుతున్నాయి. 

కేటీఆర్ ఇమేజ్ మేకోవర్ చేసుకోవాల్సిందే 

ప్రతిపక్ష హోదాలో ఉన్నప్పుడు ప్రజల బాధలను ఓపికగా వినడం, దిగువ స్థాయి కేడర్‌ను ఆప్యాయంగా పలకరించడం అత్యంత అవసరం. కానీ ఇప్పటికీ అధికారంలో ఉన్నప్పటి వైఖరినే ప్రదర్శించడం వల్ల కేటీఆర్ రాజకీయ భవిష్యత్తుకు పెద్ద గండంగా మారే ప్రమాదం ఉంది. ఆత్మవిశ్వాసానికి, అహంకారానికి మధ్య ఉన్న సన్నని గీతను గుర్తించి, ప్రజలకు మరింత అందుబాటులో ఉండేలా  అంబుడ్స్‌మన్  శైలిని అలవర్చుకోవాలని పలువురు సలహాలిస్తున్నారు.  రాజకీయాల్లో ఎంత ఎదిగినా ఒదిగి ఉండటమే సుదీర్ఘ రాజకీయ ప్రస్థానానికి పునాది.  కేటీఆర్ తనపై పడిన  అహంకారి అనే ముద్రను చెరిపేసుకోకపోతే, అది కేవలం ఆయనకే కాకుండా బిఆర్‌ఎస్ పునరుజ్జీవనానికి కూడా పెద్ద ఆటంకంగా మారే అవకాశం ఉంది. సోషల్ మీడియా యుగంలో చిన్నపాటి అసహనం కూడా వేగంగా రీల్స్‌గా మారి లక్షలాది మందికి చేరుతున్న తరుణంలో, కేటీఆర్ ఇకనైనా తన మాటతీరులో వినమ్రతను పెంచుకుని, క్షేత్రస్థాయి నాయకులు, కార్యకర్తలతో మమేకమవకపోతే రాజకీయంగా మరిన్ని ఎదురుదెబ్బలు తప్పవని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.