Warangal Politics Konda Family: కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కొండా సురేఖను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయడంతో తెలంగాణ రాజకీయాల్లో వారి రాజకీయ భవిష్యత్తుపై పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. మేము కాంగ్రెస్‌లోనే ఉంటాము అని ప్రకటిస్తున్నప్పటికీ, ఆచరణలో వారికి సొంత పార్టీలోనూ, ఇతర పార్టీలలోనూ దారులు దాదాపు మూసుకుపోయాయి.
కొండా దంపతుల రాజకీయ ప్రయాణం ఎటు?
తెలంగాణ కాంగ్రెస్ కేబినెట్ నుంచి అనూహ్యంగా బర్తరఫ్ అయిన మాజీ మంత్రి కొండా సురేఖ , ఆమె భర్త కొండా మురళిలకు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర ప్రతికూల పరిస్థితులు ఎదురవుతున్నాయి. తాము కాంగ్రెస్ క్రమశిక్షణ కలిగిన నాయకులమని చెప్తున్నప్పటికీ, అధిష్టానంతో వచ్చిన పూడ్చలేని విభేదాల వల్ల సొంత పార్టీలోనే వారు పూర్తిగా ఒంటరిగా మారారనేది స్పష్టమవుతోంది. ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ శ్రేణులు మరియు ఇతర సీనియర్ నాయకులు కూడా వారిని పక్కనపెట్టే ధోరణినే అవలంబిస్తుండటంతో కాంగ్రెస్‌లో వారి మనుగడ ప్రశ్నార్థకంగా మారింది. మరో ప్రధాన ప్రతిపక్షమైన భారత్ రాష్ట్ర సమితి వైపు చూద్దామంటే, ఆ దారులు ఎప్పుడో మూసుకుపోయాయి. గతంలో బిఆర్ఎస్ పార్టీ వీడే సమయంలో కేసీఆర్, కేటీఆర్ కుటుంబాలపై కొండా దంపతులు చేసిన తీవ్రమైన వ్యాఖ్యలను గులాబీ నాయకత్వం ఇంకా మర్చిపోలేదు. ప్రస్తుతానికి బిఆర్ఎస్లోకి వారిని చేర్చుకునే ప్రసక్తే లేదని ఆ పార్టీ గులాబీ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
భారతీయ జనతాపార్టీలోకి రావడం కష్టమే!
కాంగ్రెస్, బిఆర్ఎస్ దారులు మూసుకుపోవడంతో మిగిలిన ఏకైక ప్రధాన వేదిక భారతీయ జనతా పార్టీ మాత్రమే. కానీ, బిజెపి రాజకీయ శైలి, అక్కడ ఉండే క్రమశిక్షణా రాశి కొండా దంపతుల శైలికి ఏమాత్రం పొసగవు. బిజెపి సిద్ధాంతపరమైన పునాదులతో పాటు సంస్థాగత నిర్ణయాలకు ప్రాధాన్యత ఇస్తుంది. వరంగల్ బిజెపిలో ఇప్పటికే ఉన్న స్థానిక నేతలను పక్కనపెట్టి కొండా దంపతుల ఆధిపత్యాన్ని అంగీకరించేందుకు కమలం కేడర్ సిద్ధంగా లేదు. పెత్తనం లేకపోతే ఇమడలేని కొండా సురేఖకు కమలం గూడు కూడా సవాలుగానే మారనుంది. సీనియర్ నేత మురళీధర్ రావు..బీజేపీ డస్ట్ బిన్ కాదంటూ సోషల్ మీడియాలో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది.
సొంత రాజకీయం చేయడమే ఆప్షనా?
ఇలాంటి స్థితిలో కొండా దంపతులకు ఏ పార్టీతోనూ పొత్తు కుదరని పరిస్థితి ఏర్పడితే, వారు స్వతంత్ర పోరాటం వైపే మొగ్గు చూపాల్సి రావచ్చు. వరంగల్ తూర్పు, పరకాల పరిధిలో తమకున్న సొంత క్యాడర్, అభిమానులను నమ్ముకుని ఒంటరిగా రాజకీయం చేయడం లేదా రాబోయే పరిణామాల వరకు సైలెంట్‌గా వేచి చూడడం తప్ప తక్షణమే వారి ముందుకు ఎలాంటి సులువైన రాజకీయ ప్రత్యామ్నాయాలు కనిపించడం లేదు.
